Share News

ఆర్న... ఐఏఎస్‌

ABN , Publish Date - Jun 27 , 2026 | 05:04 AM

సోషల్‌ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోన్న ‘ఆర్న ఐఏఎస్‌’ ఏఐ వీడియోపై సీఎం చంద్రబాబు శుక్రవారం స్పందించారు.

ఆర్న... ఐఏఎస్‌

  • సీఎంను నవ్వించిన చిన్నారి వీడియో

అమరావతి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): సోషల్‌ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోన్న ‘ఆర్న ఐఏఎస్‌’ ఏఐ వీడియోపై సీఎం చంద్రబాబు శుక్రవారం స్పందించారు. ఆర్న వీడియోను రీపోస్టు చేస్తూ ‘ఈ వీడియో చూసి నవ్వకుండా ఉండటం ఎవ్వరికైనా అసాధ్యం. నేను అధికారికంగా ఆర్నకు మద్దతు ఇస్తున్నాను’ అని రాసుకొచ్చారు. హీరో వెంకటేశ్‌ ఓ సినిమాలో చెప్పిన డైలాగు బ్యాక్‌ గ్రౌండ్‌తో ఈ కృత్రిమ మేధ (ఏఐ) వీడియోను సృష్టించారు. అందులో ఓ చిన్నారి వైజాగ్‌ కలెక్టర్‌గా కుర్చీలో కూర్చుని ఈ డైలాగు చెబుతున్నట్లు ఉంటుంది. ‘నేను ఐఏఎస్‌ పాసై, వైజాగ్‌ కలెక్టర్‌ చైర్‌లో కూర్చొని, చంద్రబాబుతో వీడి యో కాన్ఫరెన్స్‌లో ఉన్నప్పుడు.. ఎందుకో కిటికీ వైపు చూస్తే మా నాన్న కనిపిస్తారు. వెంటనే నేను.. చంద్రబాబూ.. బయట మా బాబు వెయిట్‌ చేస్తున్నారని చెప్పేసి, టీవీ కట్టేసి, నన్ను క్షమించు నాన్నా.. నిన్ను వెయిట్‌ చేయించాను అంటూ కాళ్ల మీద పడుతాను..’ అని ఆ చిన్నారి ఆర్న అంటున్నట్లు క్రియేట్‌ చేశారు.

సోషల్‌ మీడియాలో చురుగ్గా సీఎం

సీఎం చంద్రబాబు ఇటీవల సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామానికి చెందిన 96 ఏళ్ల సానబోయిన సత్యనారాయణ తనకు చంద్రబాబును చూడాలని ఉందంటూ చేసిన పోస్టుపైనా ఆయన స్పందించారు. సిద్ధాంతం పర్యటనకు వెళ్లిన సమయంలో సత్యనారాయణను కలిసి, ముచ్చటించారు. చంద్రబాబు సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటున్నారన్న సంకేతం పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండటానికి ఉపయోగపడుతోంది. తమపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే అంశాలను అధినేత చూస్తారన్న అంశం పార్టీ నాయకులు, కార్యకర్తలను క్రమశిక్షణతో మెలిగేందుకు దోహదపడుతుందని పార్టీ సీనియర్‌ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - Jun 27 , 2026 | 05:08 AM