చేపలు తీసుకెళ్లి.. వంటలో సాయపడి
ABN , Publish Date - May 20 , 2026 | 06:02 AM
‘మత్స్యకార సేవలో’ కార్యక్రమంలో భాగంగా తుమ్మలపెంట గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపు కలియతిరిగారు. స్థానికంగా ఉన్న చేపల మార్కెట్‌ను సందర్శించారు.
మత్స్యకార కుటుంబంతో కలిసి బాబు భోజనం
‘మత్స్యకార సేవలో’ కార్యక్రమంలో భాగంగా తుమ్మలపెంట గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపు కలియతిరిగారు. స్థానికంగా ఉన్న చేపల మార్కెట్‌ను సందర్శించారు. అక్కడ చేపలు విక్రయించే మహిళలతో కొద్దిసేపు మాట్లాడారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అక్కడే స్థానిక మత్స్యకారుడు తానంగారి బాబుతో సీఎం ముచ్చటించారు. వారి జీవనోపాధి, చేపల వేట పరిస్థితులు, మార్కెట్లో విక్రయాలు, స్థానికంగా లభించే చేపల రకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారుడు తానంగారి బాబు, ఆయన కుమారుడు గిరిలు చంద్రబాబును తమ ఇంటికి ఆహ్వానించారు. అందుకు సమ్మతించిన సీఎం.. అక్కడి చేపల మార్కెట్ నుంచి చేపలు కొనుగోలు చేసి తానంగారి బాబు ఇంటికి తీసుకెళ్లారు. ఈ చేపలతో తానంగారి బాబు సతీమణి వెంకమ్మ కూర వండారు. ఈ సమయంలో చంద్రబాబు కూడా వంటి గదిలోనే ఉండి కూర వండే విధానాన్ని పరిశీలించారు. కొద్దిసేపు గరిట కూడా తిప్పడం విశేషం. ఈ చేపల కూరతోనే తానంగారి బాబు కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు కింద కూర్చొని భోజనం చేశారు. ఆ కుటుంబ సభ్యులందరికీ చంద్రబాబే స్వయంగా చేపల కూర వడ్డించారు. ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన వెంకమ్మ కుమార్తెతో మాట్లాడిన చంద్రబాబు.. తల్లీబిడ్డ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తానంగారి బాబు కుటుంబంతో కలిసి సీఎం గ్రూప్ ఫొటో దిగారు.
అలజడి తొలగించి.. ఆశను కలిగించి
మత్య్సకారుల మనస్సులు గెలుచుకోవడం లక్ష్యంగా సీఎం చంద్రబాబు నెల్లూరు పర్యటన సాగింది. ఆసాంతం మత్స్యకారులతో ఆయన మమేకమయ్యారు. వారితో కలివిడిగా గడిపారు. వారు తినే ఆహారమే తానూ తీసుకున్నారు. జువ్వలదిన్నె విషయంలో వైసీపీ నేతలు కొంతకాలంగా విష ప్రచారం సాగిస్తున్నారు. దానివల్ల రేగిన ఆలజడిని మత్స్యకారుల మనస్సులనుంచి తీసివేసి.. ఆశను వారిలో నింపడానికి తన పర్యటనలో ఆయన ప్రయత్నించి.. చాలావరకు విజయం సాధించారు. మన తీరంపై పక్క రాష్ట్రాల చొరబాట్లకు కట్టడిచేస్తామని హామీ ఇవ్వడం ద్వారా మత్య్సకారుల్లో ధైర్యం నింపారు.