చెప్పాం.. చేస్తున్నాం
ABN , Publish Date - Jul 15 , 2026 | 04:11 AM
‘‘ప్రజల సమస్యలు, వాస్తవాలు తెలియాలంటే ఉన్నతస్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాలి. వినూత్న ఆలోచనలతో సుపరిపాలనను ప్రజలకు అందించాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
ఐదేళ్లూ విద్యుత్ చార్జీలు పెంచేది లేదు
తొలిసారి ట్రూడౌన్ అమలు చేస్తున్నాం
మార్చి 31కి పోలవరం తొలి దశ పూర్తి
ఆగస్టు 14న ఎడమ కాలువ ద్వారా నీరు
36 ప్రాజెక్టులు ప్రాధాన్య క్రమంలో పూర్తి
నెలవారీ ఆర్థిక నివేదికలతో మరింత అభివృద్ధి
క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే వాస్తవాలు తెలిసేది
పీఆర్‌జీఎస్‌తో 100శాతం సమస్యల పరిష్కారం
ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం
మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌ఓడీలతో భేటీ
ఉద్యోగులు, అధికారులకు అభినందనలు
ఉన్నతస్థానాల్లో ఉన్న కొందరు అభివృద్ధి నిరోధకులుగా ఉన్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజల సమస్యలు, వాస్తవాలు తెలియాలంటే ఉన్నతస్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాలి. వినూత్న ఆలోచనలతో సుపరిపాలనను ప్రజలకు అందించాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు, కార్యదర్శులు, విభాగాల అధిపతులతో (హెచ్‌వోడీ) మంగళవారం సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నెలవారీ ఆర్థిక నివేదికలపై సమీక్షించారు. ‘‘ఒక మంచి అధికారి సమస్యను పరిష్కరిస్తే... అద్భుతంగా పనిచేసే అధికారి అసలు సమస్యలనేవే తలెత్తకుండా చేస్తారు’’... అనే కోణంలో పనితీరు కనబరచాలని సీఎం సూచించారు. ‘‘ప్రభుత్వం మూడో ఏడాదిలోకి అడుగు పెట్టినప్పటికీ విద్యుత్ చార్జీలు పెంచలేదు. ఐదేళ్లపాటు విద్యుత్ చార్జీలు పెంచేదిలేదని చెప్పిన మాటను నిలబెట్టుకున్నాం. ట్రూడౌన్‌ను కూడా అమలు చేస్తున్నాం. పట్టిసీమ నీటితో గోదావరి నుంచి కృష్ణా డెల్టా ఆయకట్టుకు నీరు అందించగలుగుతున్నాం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో జలసంరక్షణ కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ‘‘ఆగస్టు 14న అనకాపల్లికి పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను విడుదల చేస్తాం. సెప్టెంబరు 1న వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను కూడా జాతికి అంకితం చేస్తాం. రాష్ట్రంలోని 36 ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తిచేస్తాం’’ అని ప్రకటించారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములై సహకరిస్తున్న అధికారులు, ఉద్యోగులందరికీ అభినందనలు తెలిపారు. అదే సమయంలో... కీలకస్థానాల్లో పనిచేస్తున్న కొందరు అధికారులు అభివృద్ధి నిరోధకులుగా ఉన్నారని, ఇది సరికాదని హెచ్చరించారు.
100 శాతం పరిష్కరించాలి
గత ప్రభుత్వ పాలనలో కొన్ని శాఖల్లో పనితీరు మెరుగ్గా లేకపోవడంతో ప్రజల నుంచి పెద్దఎత్తున అర్జీలు వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా అర్జీలను వేగంగా పరిష్కరించి ప్రజలకు సాంత్వన కలిగించాలి. 100 శాతం సమస్యలు పూర్తిగా పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలి. శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కంగుంది, గుంటుపల్లి లాంటి ప్రాంతాల్లో భూ సమస్యల్ని పరిష్కరించాం. రీసర్వే ప్రక్రియ ద్వారా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ప్రతీ నెలా 9న పంపిణీ చేస్తున్నాం. ఇంకా 72 లక్షల పాస్‌పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉంది. అర్జీల పరిష్కారం కోసం నిబంధనల్లో మార్పులు తీసుకురావడం, లేదంటే చట్టాలను సవరించే అంశంపై విశ్లేషణ చేయాలి. మెరుగ్గా పనిచేస్తే 15 శాతం వృద్ధిరేటు సాధించే అవకాశం ఉంది. పాలన సులభతరం చేసేందుకు రెవెన్యూ వసూళ్లు పెంచుకునేలా కొన్ని ఏఐ టూల్స్ రూపొందించాం. ఈ ఏడాది వివిధ శాఖల్లో 24 శాతం మేర రెవెన్యూ వసూళ్లు పెరిగాయి. జీఎస్డీపీ వృద్ధిరేటు 2017తో పోలిస్తే గత ఏడాదిలో 20 శాతం మేర పెరిగింది’’ అని చెప్పారు.
పెట్టుబడుల స్వర్గంగా ఏపీ
2019-24 మధ్య అన్ని వ్యవస్థలు ఛిన్నాభిన్నమైపోయాయని... ఇప్పుడు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కోసం రెండేళ్లుగా సమష్టిగా పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ‘‘ప్రభుత్వ ఆలోచనల్ని అధికార యంత్రాంగం సమర్థంగా అమలు చేసింది. ఆశించిన మార్పులు కొంత వరకు సాధించాం. మరిన్ని రంగాల్లో మరింతగా మెరుగుపడాలి. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర-2047 విజన్ రూపకల్పన చేశాం. గత పాలనలో ఏపీపై పారిశ్రామికవేత్తలకు నమ్మకం పోయింది. ఇప్పుడు మార్పు తెచ్చాం. దేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఆకర్షించాం. ఏపీ పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా మారింది’’ అని వివరించారు.
సమన్వయంతో 2047 లక్ష్యాల సాధన: పీయూష్ కుమార్
‘స్వర్ణాంధ్ర 2047’ విజన్‌తో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ స్పష్టం చేశారు. 2047 నాటికి రాష్ట్ర జీఎ్‌సడీపీ రూ.308 లక్షల కోట్లకు, తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు పెంచేందుకు, ఏటా 15 శాతం కంటే అధిక ఆర్థిక వృద్ధి సాధించే దిశగా కార్యాచరణ కొనసాగుతోందన్నారు. ఈ లక్ష్యాల అమలును పర్యవేక్షించేందుకు 30 సచివాలయ శాఖలు, 87 విభాగాల పరిధిలో 651 కీలక పనితీరు సూచికలు (కేపీఐలు) రూపొందించి డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సేవారంగంలో జీఎస్‌టీ వసూళ్లు 21.3శాతం, ఐటీ ఎగుమతులు 32.2 శాతం, వాణిజ్య వాహనాల నమోదు 51.6శాతం, దేశీయ పర్యాటకుల రాక 22 శాతం పెరగడం ఆర్థిక కార్యకలాపాల బలోపేతానికి సూచికగా పేర్కొన్నారు. బ్యాంకింగ్, ప్రజావిత్తరంగాల్లో బ్యాంకు రుణాలు 137.6 శాతం, రాష్ట్ర సొంత పన్ను ఆదాయం 18.2 శాతం పెరిగాయని తెలిపారు. మూలధన వ్యయం పెంపు, తయారీ రంగం పునరుద్ధరణ, పరిశ్రమలు వేగంగా ప్రారంభించడం, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పెట్టుబడులు, ఉపాధి కల్పనను వేగవంతం చేయడం ద్వారానే ‘స్వర్ణాంధ్ర 2047’ లక్ష్యాలను సాధించగలమని స్పష్టం చేశారు.
స్వర్ణాంధ్ర లక్ష్యాల కోసం..
నెలవారీ ఆర్థిక నివేదికలు సమీక్షించడం ద్వారా ‘స్వర్ణాంధ్ర 2047’ అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం సులభమవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. డేటా ఆధారిత పరిపాలన ద్వారా రియల్ టైమ్ ఫలితాలకు నాంది పలకాలన్నారు. ప్రతి నెలా ఒకసారి కార్యదర్శులు, హెచ్‌ఓడీల సమావేశం ద్వారా ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షిస్తామని తెలిపారు.