Share News

పిల్లలే ఆస్తి

ABN , Publish Date - Jul 25 , 2026 | 04:33 AM

పిల్లలు భారం కాదని, భవిష్యత్తుకు వారే ఆస్తిపాస్తులని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘తల్లికి వందనం’ ప్రభుత్వం దగ్గర డబ్బులుండి కాదు.. మనసుండి ఇస్తున్నామని తెలిపారు.

పిల్లలే ఆస్తి

  • ఇష్టపడి చదవాలి.. ఆడుతూపాడుతూ సాగాలి

  • ప్రభుత్వం వద్ద డబ్బులుండి కాదు..

  • మనసుండి ‘తల్లికి వందనం’ ఇస్తున్నాం

  • విద్యార్థులకు మార్కులు తగ్గితే లోకేశ్‌కీ తగ్గిస్తా

  • విద్యాశాఖ ఇచ్చేముందు బాగా ఆలోచించా

  • ఫలితాలుచూసి నేడు చాలా సంతోషిస్తున్నా

  • ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు

  • రంపచోడవరంలో మెగా పీటీఎం

  • లోకేశ్‌తో కలిసి తల్లిదండ్రులతో మాటామంతీ

  • రాష్ట్రవ్యాప్తంగా 71లక్షల మంది భాగస్వామ్యం

రాజమహేంద్రవరం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): పిల్లలు భారం కాదని, భవిష్యత్తుకు వారే ఆస్తిపాస్తులని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘తల్లికి వందనం’ ప్రభుత్వం దగ్గర డబ్బులుండి కాదు.. మనసుండి ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు మార్కులు తగ్గితే మంత్రి లోకేశ్‌కూ మార్కులు తగ్గిస్తానని చమత్కరించారు. ప్రభుత్వ బడులకు త్వరలో సోలార్‌ ప్యానెల్స్‌ ఉచితంగా ఇస్తామని చెప్పారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ (పీటీఎం) ఆత్మీయ సమావేశానికి సీఎం చంద్రబాబు, విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తానేప్పుడూ ఉపాధ్యాయులకు సముచితమైన గౌరవం ఇచ్చానని తెలిపారు. ‘‘మీ అమ్మ నాన్న ఎంత ఆస్తి ఇచ్చారనేది కాదు ముఖ్యం. చదువే మీకు ఆస్తి. చదువుకుంటే ప్రపంచంలో ఎక్కడైనా రాణిస్తారు. మీరు ఇష్టపడి చదివితే కష్టమనేది లేదు. ఆడుతూ పాడుతూ చదువుకోండి. 5, 10 ఏళ్లు మీరు కష్టపడితే శాశ్వతంగా సుఖపడతారు. మీ తల్లిదండ్రులూ గర్వపడతారు.’’ అంటూ విద్యార్థులను సీఎం ఉత్సాహపరిచారు. ప్రపంచంలో ఉండే టెక్నాలజీలన్నీ తీసుకొస్తున్నామని, డేటా సెంటర్లు వస్తున్నాయని వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


ఆదివాసీలకు అండగా..

‘‘హైస్కూల్స్‌ నుంచి ఏఐ నేర్పిస్తాం. క్వాంటం కంప్యూటర్‌ వస్తుంది. మూడు నెలలల్లోపు ప్రతి ఇంటికీ ఫోన్‌ ఉండాలని, వైఫై ఉండాలని ఇక్కడి కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చాను. దానివల్ల మీరెవ్వరూ ఎక్కడికో పోయే పనిలేదు. అకౌంట్లో పడిన డబ్బుల సమాచారం తెలుసుకోవచ్చు. త్వరలోనే టీచర్లకు సమానంగా ఏఐ ట్యూటర్లను తీసుకొస్తాం. 2000లో, జీవో 3 తీసుకొచ్చి స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలని అనుకుంటే 2020లో సుప్రీంకోర్టు దానిని రద్దు చేసే పరిస్థితిని గత ప్రభుత్వం తెచ్చింది. దానిపైన కూడా చర్చిస్తున్నాం. ప్రభుత్వం గిరిజనులకు అండగా ఉంటుంది. ఇక్కడి పిల్లలను వచ్చే 20 ఏళ్లలో ప్రపంచాన్ని శాసించే శక్తివంతమైన జాతిగా తయారు చేసే బాధ్యత తీసుకుంటా.’’

చెడును ఖండిస్తేనే జీవితంలో వెలుగు

‘‘రాజకీయ నాయకులుగానీ, అధికార యంత్రాంగంగానీ... ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకోను. వారి పట్ల గట్టిగా ఉంటాను. ఒక దళిత డ్రైవర్‌ను చంపి గత ప్రభుత్వంలో డోర్‌ డెలివరీ చేశారు. అలాంటి నేతలూ, పార్టీలనూ నాడు చూశాం. చెడును ఖండించాలి. మంచిని ప్రోత్సహించాలి. అప్పుడే జీవితాల్లోకి వెలుగు వస్తుంది.’’


బాధ్యత తల్లులదేనా.. తండ్రులెక్కడ?

‘‘రంపచోడవరం కొత్తగా జిల్లాగా ఏర్పడిన తర్వాత మొదటిగా వచ్చాను. మీ ఉత్సాహం చూస్తుంటే నా ఆనందానికి హద్దులే లేవు. నేను కూడా ఈరోజు టీచర్‌నయ్యాను. నేర్చుకోవడానికి విద్యార్థిని అయ్యాను. తల్లిదండ్రులకు చెప్పడానికి మెంటర్‌గా తయారయ్యాను. ఇవి వినూత్నమైన అనుభవాలు. ఇక్కడున్న తల్లిదండ్రుల అందరి దగ్గరా ఫోన్లు ఉన్నాయి. మెసేజ్‌లు కూడా పంపిస్తున్నాం. తల్లిదండ్రులిద్దరినీ అడుగుతున్నాం. తల్లిని అడిగితే తండ్రులు తప్పించుకుంటున్నారు. పిల్లలను పెంచే బాధ్యత తల్లిది, తండ్రిది కూడా. పిల్లల పెంపకం ఇద్దరూ సమానంగా చూసుకోవాలి. సభలో తల్లులకంటే తం డ్రులు తక్కువగా ఉన్నారు. ఇంకోసారి నేను వచ్చినప్పుడు తండ్రులు హాజరు ఇలాగే ఉంటే మీకు (స్కూలు యాజమాన్యం) తప్పకుండా ఫైన్‌ వేస్తా. పనిష్మెంట్‌ ఇస్తా (నవ్వుతూ).’’

అందరికీ ఫోన్లు ఉండాలని ఆదేశించా..

‘‘అందరికీ ఫోన్లు ఉన్నాయా? అందరూ చెక్‌ చేసుకున్నారా? ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ డబ్బులు (తల్లికి వందనం) పడ్డాయా? పడ్డాయి అంటే గట్టిగా చప్పట్లు కొట్టి రంపచోడవరం మొత్తం వినిపించేలా చేయండి. ఈరోజు నాక్కూడా ఒక నమ్మకం వచ్చింది. తప్పకుండా విద్యావ్యవస్థలో మార్పులు ప్రారంభమయ్యాయి. తప్పకుండా దీనిని ముందుకు తీసుకుపోతాం.’’

రెండేళ్లలోనే మార్పు కనిపిస్తోంది

‘‘రోజురోజుకూ ప్రభుత్వ పాఠశాలలు బలహీనపడటం గతంలో చూశాం. అలాంటిది రెండేళ్లలోనే మార్పును చూపించాం. ఒక లక్షా 10 వేల మంది ప్రైవేట్‌ నుంచి గవర్నమెంట్‌ స్కూళ్లకు మారారు. ప్రభుత్వ బడుల్లో చేరతామంటే కొన్ని ప్రైవేటు స్కూళ్లు టీసీలు కూడా ఇవ్వడం లేదని నాకు ఫిర్యాదులు వస్తున్నా యి. ఆ స్థాయిలో ప్రభుత్వ బడులు మెరుగుపడ్డాయి. చదువు మన జీవితాలు మారుస్తుందనేందుకు రాష్ట్రపతి ద్రౌపదిముర్మునే నిదర్శనం.’’


మీ పిల్లల బాధ్యత తీసుకుంటా

‘‘ఈరోజు జనాభా తగ్గిపోతోంది. చాలామందిని అడిగితే... ఎక్కువ పిల్లలు ఉంటే వారిని ఎట్లా పెంచాలని అడుగుతున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుని ఎవరైనా పిల్లలు ఉంటే అంగన్వాడీకి పంపిస్తాం. 12వ తరగతి వరకూ మీకందరికీ నాణ్యమైన చదువు ఇప్పించడమే కాకుండా సంవత్సరానికి 13 వేలు మీ ఖాతాకు వేస్తాం. మేం సూపర్‌ 6 ఇచ్చాం. మొదటి తేదీనే పింఛన్లు ఇస్తున్నాం. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించాం. దీపం కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఉచితంగా ఇస్తాం మీరందరూ ఇంటిపై సోలార్‌ పెట్టుకోండి. ఈరోజు పీ4 తీసుకొచ్చాం’’

మీ చెంతకే టెక్నాలజీ తెస్తున్నాం

‘‘పది లక్షల కోట్ల రూపాయల అప్పులతో పాలన ప్రారంభించాం. వడ్డీ కూడా 13, 14 శాతం. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆస్తులనూ తాకట్టు పెట్టారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు నుంచి వదలించి 13 శాతం ఉండే వడ్డీని 9, 8.5, 8కి కూడా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడిప్పుడు జీతాలు సకాలంలో ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను బ్యాలెన్స్‌ చేసు ్తన్నాం. రాష్ట్రంలో రూ.22 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. మీరు ఎక్కడికో పోయే పనిలేదు. ఇక్కడికే విశాఖపట్నం డేటా సెంటర్లు, ఏఐ వస్తున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాం. చాలామంది 60 ఏళ్లు వస్తే ఇంట్లో పడుకుంటారు. కానీ, నేను 76 ఏళ్లు పూర్తయినా పడుకునే సమయం తప్ప ఎప్పుడూ పనిచేస్తూ ఉంటా. నాది రేపటి ఆలోచన. ఒక పక్క సంపద సృష్టిస్తున్నాం. ఆదాయాన్ని పెంచే మార్గాలు అనేషిస్తున్నాం.’’ అని చంద్రబాబు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా...

మెగా పేరెంట్‌- టీచర్స్‌ సమావేశాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, దాతలు, ఇతరులు కలిపి 71లక్షల మందికిపైగా పాల్గొన్నారని సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 44,076 పాఠశాలల్లో సమావేశాలు జరిగాయన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 04:36 AM