12 ఏళ్లయినా విభజన అసంపూర్ణమే: బాబు
ABN , Publish Date - Aug 21 , 2026 | 05:09 AM
రాష్ట్ర విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలను చంద్రబాబు సమావేశం దృష్టికి తెచ్చారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడచినా షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన పూర్తి కాలేదన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్ర విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలను చంద్రబాబు సమావేశం దృష్టికి తెచ్చారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడచినా షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన పూర్తి కాలేదన్నారు. ఆస్తులు, అప్పులు, సంస్థల విషయంలో సమన్యాయం జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏపీ అభివృద్ధిలో కేంద్రం అందిస్తున్న సహకారానికి, రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. హామీ ఇచ్చిన 11 జాతీయ సంస్థల్లో 10 ఇప్పటికే ఏర్పాటు కావడం సంతోషదాయకమన్నారు. పోలవరం, దక్షిణ కోస్తా రైల్వే జోన్, అమరావతి నిర్మాణంలో కేంద్ర సహకారం కీలకమని తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. చట్టంలోని షెడ్యూల్-13 కింద ఉన్న ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వాలని కోరారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, మూడు విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త రాజధానికి రైలు అనుసంధానం వంటి పనులు వేగంగా పూర్తి చేయాలని కోరారు. దుగరాజపట్నం పోర్టు, బీపీసీఎల్ రిఫైనరీ, విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు, కడపలోని జిందాల్ స్టీల్‌కు రైలు అనుసంధానంపై అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.