విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే గాడిలోకి!
ABN , Publish Date - Feb 15 , 2026 | 03:39 AM
కేంద్ర సహకారంతో మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని, ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రంగాలకు న్యాయం చేస్తూ సమతుల్యమైన బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
కేంద్ర సహకారంతో మెరుగైన బడ్జెట్: సీఎం
ప్రస్తుత పరిస్థితుల్లో సమతౌల్యం
అన్ని రంగాలకూ న్యాయం
ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువ
సమస్యలు ఇంకా చాలా ఉన్నాయ్
వ్యవసాయం నుంచి రాబడి పెరగాలి
సేవల ఆదాయమూ పెరగాలి
2-3 ఏళ్లలో అమరావతికో రూపు
రాజధాని దారుల్ని హైవేకు సంధానిస్తున్నాం
సీమ ముఖచిత్రం మార్చింది మేమే: సీఎం
అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): కేంద్ర సహకారంతో మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని, ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రంగాలకు న్యాయం చేస్తూ సమతుల్యమైన బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీ లాబీలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందని, ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నామని అన్నారు. సమస్యలు ఇంకా చాలా ఉన్నాయని, ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువ.. ఇది వారసత్వంగా వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. ‘వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలి. సేవల రంగంలోనూ ఆదాయం పెరగాలి. వచ్చే 2-3 ఏళ్లలో మరింత మెరుగైన బడ్జెట్ ప్రవేశపెడతాం’ అని చెప్పారు. ఒంగోలు పాలకు.. అనంతపురం పండుకు.. ఎంతో డిమాండ్ ఉందని. ఈ రెండింటి రుచీ మరెక్కడా రాదన్నారు. రెండు మూడేళ్లలో అమరావతికి ఒక రూపం వస్తుందని, రాజధాని దారులను జాతీయ రహదారికి అనుసంధానిస్తున్నామని.. అమరావతికి రాకపోకలు పెరిగి రాబడి కూడా వస్తుందని చెప్పారు. ‘రాయలసీమ ముఖచిత్రం మార్చింది మేమే.. సీమ ఉద్యాన హబ్‌కు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ఎమ్మెల్యేలు సంతోషంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు పశువులకు నీరు కూడా దొరికే పరిస్థితి లేదు. 2014-19 మధ్య కూడా రెయిన్ గన్స్‌తో పంటలను కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే హంద్రీ-నీవా సుజల స్రవంతిని సీరియ్‌సగా తీసుకున్నాం. ఆ ఫలితాలు ఇప్పుడు చూస్తున్నాం’ అని వివరించారు.
మూడోసారి గేట్స్‌ను తీసుకొస్తున్న
బిల్ గేట్స్ సోమవారం అమరావతికి వస్తున్నారని సీఎం చెప్పారు. ఆయన్ను రాష్ట్రానికి మూడుసార్లు తీసుకొచ్చిన ఘనత తనదేనన్నారు. ‘తొలిసారి హైటెక్ సిటీ, రెండోసారి విశాఖ అగ్రిటెక్ కోసం వచ్చారు. ఇప్పుడు సంజీవని పథకం కోసం వస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్టీజీఎ్‌సలో కార్యక్రమం రూపొందించాం’ అని తెలిపారు. ‘హైదరాబాద్‌లో ఒకప్పుడు జూబ్లీహిల్స్ దాటితే మొత్తం అడవిలా ఉండేది. 1982లో జూబ్లీహిల్స్‌లో ఇప్పుడు బాలకృష్ణ ఉంటున్న ఇంటి స్థలంలో నాకు ఇల్లు కట్టిస్తానని ఎన్టీఆర్ చెప్పారు. అప్పుడు నేను స్థలం చూడడానికి వెళ్తే.. మొత్తం అడవిలా ఉంది.. అక్కడకు ఆటోలు కూడా రావని.. పెద్దాయనతో సున్నితంగా వద్దని చెప్పా. ఆ తర్వాత అక్కడ బాలకృష్ణకు ఇల్లు కట్టించి ఇచ్చారు. నాలుగేళ్లలోనే అక్కడి పరిస్థితులు మారిపోయాయి. బాలకృష్ణ చెన్నైలో ఉంటే నేను 4 ఏళ్లు అదే ఇంట్లో ఉన్నా. జూబ్లీహిల్స్‌లోనే అక్కడకు సమీపంలో నా ఇల్లు పూర్తయ్యాక అక్కడకు మారాను. అమరావతి అభివృద్ధిలోనూ ఇలాంటి గణనీయ మార్పులే ఉంటాయి’ అని సీఎం స్పష్టంచేశారు.
ఇకపై నిక్కచ్చిగా ఉంటా..
ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్‌లో ఇచ్చే నివేదిక ద్వారా వారిని వారికి అద్దంలో చూపిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. 1995-96లో మాదిరిగానే ఇప్పుడూ నిక్కచ్చిగా ఉంటానని.. మారకపోతే వాళ్లకే నష్టమని స్పష్టంచేశారు. ‘మొత్తం 9 పారామీటర్లలో సర్వే చేయించి నివేదిక ఇస్తున్నా. వారికి తెలియని ఇంకొన్ని పారామీటర్లు కూడా నా వద్ద ఉన్నాయి. లోకేశ్ పని లోకేశ్ చేస్తున్నారు. నా పని నేను చేస్తున్నా. నేతలతో మానం సంబంధం, మోటివేషన్.. రెండూ భయం-భక్తిలా ఉండాలి’ అని వ్యాఖ్యానించారు.