Share News

భవిష్యత్తు పీపీపీలదే

ABN , Publish Date - Jul 17 , 2026 | 04:25 AM

భవిష్యత్తులో వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌(వీజీఎఫ్ )తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో ఆర్థిక సంస్కరణలు కీలకమయ్యాయని..

భవిష్యత్తు పీపీపీలదే

  • ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వేగంగా అభివృద్ధి.. వీజీఎ్‌ఫ ప్రాజెక్టులు కీలకం

  • ప్రతి శాఖకూ ఓ ఆర్థిక ప్రణాళిక

  • ప్రభుత్వ నిరర్థక ఆస్తుల సద్వినియోగం

  • పీపీపీ ప్రాజెక్టులు, పీపీపీ విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో వయబులిటీ గ్యాప్‌ ఫండింగ్‌(వీజీఎఫ్ )తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో ఆర్థిక సంస్కరణలు కీలకమయ్యాయని, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు చేపట్టి వేగంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై గురువారం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. పోర్టులు, షిప్‌యార్డులు, ఎయిర్‌పోర్టులు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్లు ఆర్థిక శాఖ అధికారులు వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పురపాలక, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్‌ లాంటి రంగాల్లో రూ.1,23,229 కోట్ల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి అన్ని పీపీపీ ప్రాజెక్టులనూ సుస్థిరమైన విధానంలో అభివృద్ధి చేయాలని, ప్రతి ప్రాజెక్టు వద్దా ఆర్థిక కార్యకలాపాలకు అవకాశం ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చే అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ లాంటి వాటిని కూడా సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. విజయవాడ, తిరుపతిలోని వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్లకు రూ.178 కోట్ల వీజీఎఫ్‌ కేంద్రం ఇస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మెడికల్‌ కాలేజీలకు రూ.1468 కోట్ల వీజీఎఫ్‌ వస్తుందని, ఈ ప్రాజెక్టులు చేపట్టిన విధానంపై కేంద్ర ఆర్థిక శాఖ ప్రశంసించిందని అధికారులు తెలిపారు.


వచ్చే క్యాబినెట్‌కు వీజీఎఫ్‌ నూతన విధానం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం-వీజీఎఫ్‌ పాలసీ 1.0ను వచ్చే క్యాబినెట్‌ సమావేశంలో చర్చకు పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వేర్వేరు విధానాలను కూడా అధ్యయనం చేయాల్సిందిగా సూచించారు. స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యాల మేరకు ప్రతి ఏటా పీపీపీ కింద రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనమిక్‌ రీజియన్లలో భారీస్థాయిలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కింద వీటిని చేపట్టాల్సి రావొచ్చని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం.. స్వర్ణాంధ్ర విజన్‌ సూక్ష్మ, స్థూల లక్ష్యాలకు అనుగుణంగా ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో పరిశ్రమలకు సరఫరా చేసే నీటి ద్వారా జలవనరుల శాఖకు ఆదాయం వస్తుందని, సాగునీటి సంఘాలు కూడా ఈ ప్రక్రియలో కీలకంగా ఉంటాయని అన్నారు. ప్రతీ ప్రభుత్వ శాఖ ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకోవాలని స్పష్టం చేశారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా ఆదాయ మార్గాలను నిర్దేశించుకోవాలన్నారు. ప్రభుత్వ శాఖలు పెట్టుబడిదారులకు విశ్వాసాన్ని కలిగించేలా పీపీపీ ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు.


ప్రభుత్వ భూములను వాణిజ్య పరంగా..

ప్రభుత్వం వద్ద నిరర్థకంగా ఉన్న ఆస్తులను అవకాశాలుగా మలచుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్ల వద్ద ప్రభుత్వానికి ఉన్న భూములను వాణిజ్య పరంగా వినియోగించుకునే అవకాశాన్ని పరిశీలించాలని స్పష్టం చేశారు. పంప్డ్‌ స్టోరేజీ, సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు కూడా పీపీపీ కింద చేపట్టేందుకు చర్యలు చేపట్టాలన్నారు. గనులు, నెడ్‌క్యాప్‌, పర్యాటకం, లాజిస్టిక్స్‌ రంగాల్లో భారీగా ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్‌ హాస్టళ్లలో ఉన్న విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేసేందుకు ఆలోచన చేస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతాల్లో రెసిడెన్షియల్‌ స్కూళ్లను మినీ టౌన్‌షిప్‌లా ఏర్పాటు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులను నైపుణ్యం ఉన్న మానవ వనరులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని సీఎం స్పష్టం చేశారు. ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లోనూ చదివేలా వీరిని తీర్చిదిద్దాలని అన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 04:27 AM