గడువులోగా ప్రాజెక్టులన్నీ పూర్తి
ABN , Publish Date - May 19 , 2026 | 04:12 AM
జల క్యాలెండర్ ప్రకారం నిర్ణీత కాలవ్యవధిలోగా ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలని జల వనరులశాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
సాగునీటి క్యాలెండర్‌లోకి మరో 11 ప్రాజెక్టులు.. నీళ్లను చూస్తే మనపై ప్రజల్లో నమ్మకం కలుగుతుంది
పోలవరం ఎడమ కాలువ-చంపావతి లింక్‌పై ఫోకస్.. పోలవరం స్పిల్‌వేకు ముందు ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం
వచ్చే ఏప్రిల్ నాటికే నిర్వాసితుల తరలింపు.. మడకశిర లాంటి శివారు ప్రాంతాలకూ హంద్రీనీవా నీళ్లు
‘జలధార - జలహారతి’కి అధిక ప్రాధాన్యత ఇవ్వండి.. జలవనరుల శాఖ సమీక్షలో చంద్రబాబు ఆదేశాలు
అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): జల క్యాలెండర్ ప్రకారం నిర్ణీత కాలవ్యవధిలోగా ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలని జల వనరులశాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం జల ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్య క్రమంలో క్యాలెండర్ జాబితాలోని ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో 25 ఇరిగేషన్ ప్రాజెక్టులతో కూడిన ఇరిగేషన్ క్యాలెండరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్యాలెండర్‌లో కొత్తగా మరో 11 ప్రాజెక్టులను చేర్చుతున్నట్లుగా అధికారులకు సీఎం తెలిపారు. వాటికి అవసరమైన భూసేకరణ, సివిల్ వర్క్స్ వంటి వాటికి ఎలాంటి నిధుల కొరత లేకుండా చూడాలన్నారు.
బెస్ట్ టూరిజం స్పాట్‌గా పోలవరం..
పోలవరం స్పిల్‌వేకు దిగువన ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. బెస్ట్ టూరిజం స్పాట్‌గా పోలవరం ప్రాజెక్టు ఉండాలన్నారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పోలవరం తొలిదశ పనులు పూర్తవుతున్న తీరుపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. పోలవరం పనుల పురోగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ‘‘సివిల్‌వర్క్స్ 88 శాతం, భూసేకరణ 93 శాతం, నిర్వాసితుల తరలింపు పనులు 45 శాతం పూర్తయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ రెండో తేదీనాటికి సమాంతర డయాఫ్రమ్‌వాల్ పూర్తయింది. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ పనులు ప్రారంభమయ్యాయి. గ్యాప్-1, గ్యాప్-2 పనులు 2027 మార్చి నెలాఖరులోగా పూర్తవుతాయి. పోలవరం కుడికాలువకు సంబంధించిన ట్విన్ టన్నెల్స్ పనులు 85 శాతం పూర్తయ్యాయి. ఎడమ కాలువ అప్రోచ్ టన్నెల్ పనులు వేగంగా జరుగుతున్నాయి.’’ అని అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణానికి పెట్టిన డెడ్‌లైన్ సమీపించినందువల్ల, ఇకపై ప్రతినెల పోలవరం పనుల ప్రగతిపై సమీక్షిస్తానని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు. ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్-1, గ్యాప్-2 పనులు నిర్దేశిత సమయానికి పూర్తి చేయాల్సిందేనని సీఎం ఆదేశించారు. జూలై నెల నుంచి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఎడమ కాలువ నుంచి నీళ్లు అందించాలన్నారు. పోలవరం ఎడమ కాలువ నుంచి మేఘాద్రిగెడ్డ మీదుగా చంపావతి వరకు నీళ్లు వెళ్లేలా కార్యాచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. మేఘాద్రిగెడ్డ-చంపావతి అనుసంధానానికి ఎంత వ్యయమవుతుందో అధ్యయనం చేయాలని సూచించారు. పోలవరం భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలకు పరిహారం చెల్లింపులో చట్టప్రకారం నడుచుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
వెలిగొండ పనుల్లో వేగం పెంచండి..
వెలిగొండ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘‘వెలిగొండ హెడ్‌వర్క్స్, డిస్ట్రిబ్యూటరీ చానళ్లు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూసేకరణ తదితర పనులకు రూ.2019 కోట్లు అవసరం. టీబీఎంను తొలగించి అడ్డంకులు లేకుండా నిర్దేశిత లక్ష్యం మేరకు ప్రాజెక్టును జాతికి అంకితమివ్వాల్సి ఉంది.’’ అని సీఎం తెలిపారు. హంద్రీనీవా ఫేజ్-1లో భాగంగా కాలువల వెడల్పు పనులు 92 శాతం పూర్తయ్యాయని సీఎంకు అధికారులు తెలిపారు. ‘‘ఫేజ్-2 కుప్పం - పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులు పూర్తయ్యాయి. మల్యాల ఎత్తిపోతల నుంచి రాయలసీమ ప్రాంతానికి తొలిసారిగా 52 టీఎంసీల నీటిని తరలించాం. మొత్తంగా 432 చెరువులు పూర్తిగా నింపాం. జూన్ 2024 నుంచి ఇప్పటిదాకా రూ.2123 కోట్లు ఈ పనుల కోసం ఖర్చుచేశాం.’’ అని వివరించారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. పుంగనూరు-కుప్పం బ్రాంచ్ కెనాల్ బ్యాలెన్సు పనులు వేగంగా పూర్తి చేయాలి. అడవిపల్లి, శ్రీనివాసపురం నుంచి నివా కాలువ ద్వారా చిత్తూరుకు నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. హంద్రి నుంచి నివా దాకా నీళ్లు తీసుకువెళ్లేలా పనులు పూర్తి చేయాలి.’’ అన్నారు.