360 డిగ్రీస్ స్కానింగ్!
ABN , Publish Date - Feb 19 , 2026 | 05:29 AM
ఏ ఎమ్మెల్యే ఎన్నిసార్లు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు? స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ఎన్నిసార్లు చేపట్టారు? ఎన్ని ప్రజాదర్బార్లు పెట్టారు? ప్రెస్‌మీట్లు ఎన్ని నిర్వహించారు? సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉన్నారు?..
ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం వరుస సమీక్షలు
జిల్లా ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్, ఎస్పీతో భేటీలు
రోజూ అసెంబ్లీ అనంతరం క్యాంపు కార్యాలయంలో నిర్వహణ
సమస్యలపై చర్చ... అప్పటికప్పుడే పరిష్కారం దిశగా చర్యలు
అద్దంలో మా ముఖాన్ని మాకే చూపుతున్నట్టుంది: ఎమ్మెల్యేలు
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ఏ ఎమ్మెల్యే ఎన్నిసార్లు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు? స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ఎన్నిసార్లు చేపట్టారు? ఎన్ని ప్రజాదర్బార్లు పెట్టారు? ప్రెస్‌మీట్లు ఎన్ని నిర్వహించారు? సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉన్నారు?.. తదితర అంశాలపై స్పష్టమైన సమాచారం ఉన్న నివేదికలతో ఎమ్మెల్యేల పనితీరును సీఎం చంద్రబాబు సమగ్రంగా సమీక్షిస్తున్నారు. కేవలం ఒక్క నివేదికపైనే ఆధారపడకుండా ఆరేడు నివేదికలు, సర్వే రిపోర్టుల ఆధారంగా తమ పనితీరును ఆయన విశ్లేషిస్తున్న తీరు ఎమ్మెల్యేలనే ఆశ్చర్యపరుస్తోంది. అద్దంలో తమ ముఖాన్ని తమకే చూపుతున్నట్లు ఈ సమీక్షలు ఉంటున్నాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నెల 12 నుంచి ఇప్పటివరకు కృష్ణా, చిత్తూరు, కడప, అరకు, రాజంపేట పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమీక్షలు నిర్వహించారు. రోజూ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గ స్థితిగతులు, అధికారుల పనితీరు, జిల్లాలో పరిస్థితులపై నివేదికల ఆధారంగా 360 డిగ్రీల్లో సమగ్రంగా.. సూక్ష్మంగా సీఎం సమీక్షిస్తున్నారు. మండల స్థాయి సమస్యలు, తాగు, సాగునీటి ప్రాజెక్టులు, పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలు, రోడ్లు, మున్సిపాలిటీల్లో సమస్యలు తదితరాలపై చర్చ, పరిష్కారం దిశగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
ఇన్‌చార్జి మంత్రుల తీరుపైనా..
జిల్లా ఇన్‌చార్జి మంత్రుల పనితీరుపైనా సీఎం విశ్లేషిస్తున్నారు. ఎమ్మెల్యేలు, అధికారులతో ఎన్నిసార్లు సమావేశాలు నిర్వహించారని ఓ ఇన్‌చార్జి మంత్రిని ఆయన ప్రశ్నించగా.. ఆ మంత్రి రెండుసార్లు అని చెప్పడంతో.. మీ పనితీరుకు ఆ సంఖ్యే సమాధానమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇన్‌చార్జి మంత్రులు మరింత బాధ్యతతో పనిచేయాలని, సమస్యల పరిష్కారం, పనిచేసిన వారికి గుర్తింపు వంటి విషయాల్లో క్రియాశీలంగా పనిచేయాలని సూచిస్తున్నారు.
వారికి చురకలు.. వీరికి ప్రశంసలు
బాగా పనిచేసే వారిని ప్రశంసిస్తూనే వెనుకబడి వారికి చంద్రబాబు సుతిమెత్తగా చురకలు అంటిస్తున్నారు. వారు ఏయే విభాగాల్లో వెనుకబడి ఉన్నారో వివరంగా చెబుతూ మరింత బాగా పనిచేయాలని సూచిస్తున్నారు. జిల్లా అధికారులనూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ విభాగాల పనితీరు, సిబ్బంది కొరత, సంక్షేమ హాస్టళ్ల నిర్వహణ, బస్సు సౌకర్యం, పారిశుద్ధ్యం వంటి పలు అంశాలపై సర్వేల ఆధారంగా వారి పనితీరుపై సమగ్రంగా సమీక్షిస్తున్నారు. ఎమ్మెల్యేలు, అధికారులతో ఒకేసారి సమావేశం కావడం ద్వారా జిల్లాలో ఉన్న ప్రధాన సమస్యలపై సవివరమైన చర్చ జరగడమే కాకుండా అక్కడికక్కడే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే వెసులుబాటు కలుగుతోంది. చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ వాటికి అవసరమైన నిధుల విడుదలకు సీఎం అక్కడికక్కడే ఆదేశాలు ఇస్తున్నారు. తక్కువ ఖర్చుతో పూర్తిచేసి అందుబాటులో తెచ్చే ప్రాజెక్టులకు వెంటనే నిధులు విడుదల చేయాలని చెబుతున్నారు.
ఎమ్మెల్యేల్లో సంతోషం
సీఎంతో జరుగుతున్న సమావేశాలపై ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంత ఎక్కువగా జనాల్లో ఉంటే అంత ఎక్కువగా నిధులు ఇస్తానని సీఎం చెప్పడంపై ఓ ఎమ్మెల్యే స్పందిస్తూ.. పనిచేసే వారికి ఇలాంటివి మరింత ఉత్తేజాన్ని కలిగిస్తాయని వ్యాఖ్యానించారు. పనిచేయని, సమస్యలు సృష్టిస్తున్న అధికారులను భరించాల్సిన అవసరం లేదని, పనితీరు మార్చుకోకపోతే వారి స్థానంలో వేరే వారిని నియమించాలని ఎమ్మెల్యేల సమక్షంలోనే కలెక్టర్, ఎస్పీని సీఎం స్పష్టంగా ఆదేశిస్తున్నారు. ఇది అధికారులపై చాలా ప్రభావం చూపిస్తుందని, వారు మరింత వేగంగా.. జవాబుదారీతనంతో పనిచేసేందుకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు.