రాజధాని పనుల్లో వేగం పెంచాలి
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:18 AM
యావద్దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నిర్మాణ పనుల వేగంతో పాటు నాణ్యతపై కూడా ఎక్కడా రాజీ..
నిర్దేశిత గడువులోగా నిర్మాణాలు పూర్తిచేయాలి
నాణ్యతపై ఎక్కడా రాజీపడొద్దు
కాంట్రాక్టు సంస్థలకు సీఎం నిర్దేశం
పనులయ్యాక ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తాం
అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం ఐకానిక్ నిర్మాణాలుగా ఉండాలి
రెండు నెలలకోసారి సమీక్షిస్తా: సీఎం
అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): యావద్దేశం గర్వించే రాజధాని నగరంగా అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నిర్మాణ పనుల వేగంతో పాటు నాణ్యతపై కూడా ఎక్కడా రాజీ లేకుండా చేపట్టాలని కాంట్రాక్టు సంస్థలకు స్పష్టం చేశారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాలు ఐకానిక్ నిర్మాణాలుగా ఉండాలని.. అమరావతికి పేరు తెచ్చేలా వీటిని నిర్మించాలన్నారు.
అమరావతిలో నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో కాంట్రాక్టు సంస్థలతో ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్లస్‌గా అమరావతి నిర్మాణం జరగాలన్నారు. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ నగర నిర్మాణంలో కాంట్రాక్టు సంస్థలు కూడా భాగస్వాములు కావాలని పిలుపిచ్చారు. రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని.. నిర్దేశిత గడువు కంటే ముందే నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం రూ.50,999 కోట్ల విలువైన పనులు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హౌసింగ్, ట్రంక్ ఇన్‌ఫ్రా, ఎల్పీఎస్ ఇన్‌ఫ్రా, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లు లాంటి ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రాజెక్టులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పనులు వేగంగా చేసేందుకు అవసరమైన మానవ వనరులు, యంత్రాలు, ఇతర సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం 26,924 మంది కార్మికులు, 5140కి పైగా భారీ యంత్రాలు నిర్మాణ పనుల్లో నిమగ్నమైనట్లు పురపాలక మంత్రి నారాయణ వివరించారు. పనులకు ఆటంకం లేకుండా కొండవీటి వాగు, పాలవాగు ప్రవాహాలు సజావుగా సాగేందుకు వాటిని వెడల్పు చేస్తున్నామని తెలిపారు.
దీనిపై స్పందించిన సీఎం.. భవిష్యత్ నగరంగా నిర్మిస్తున్న అమరావతి నిర్మాణంలో పనిచేశామన్న బ్రాండ్‌ను సంపాదించేలా కాంట్రాక్టర్లు పనులు చేపట్టాలని సూచించారు. కొందరు వ్యక్తులు కావాలని లిటిగెంట్లుగా మారి రాజధాని పనులను అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకెళ్లాలని స్పష్టం చేశారు. కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల నివాసాలు, రహదారులు, మౌలిక సదుపాయాలతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్ల నిర్మాణాలపై పలు సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా వివిధ పుణ్యక్షేత్రాలు, నదుల నుంచి పవిత్రమైన మట్టి, నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశామని, గత పాలకులు ఐదేళ్లపాటు రాజధాని నిర్మాణాన్ని ఆపేశారని సీఎం అన్నారు. గడచిన రెండేళ్లుగా మళ్లీ గాడిలో పెట్టామన్నారు. ‘అత్యుత్తమ నివాసయోగ్య నగరంగా అమరావతి పనుల్లో భాగస్వాములయ్యామన్న ఆలోచనలతో కాంట్రాక్టు సంస్థలు పనిచేయాలి. పనులు పూర్తయ్యాక రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తాం. చిన్నపాటి ఇబ్బందులు కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి 2 నెలలకోసారి నిర్మాణాల పురోగతిపై సమీక్షిస్తా’ అని పేర్కొన్నారు. ఎల్‌అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ, మేఘా ఇంజనీరింగ్, ఎన్‌సీసీ, బీఎ్‌సఆర్, కేఎంపీ సహా వేర్వేరు కాంట్రాక్టు సంస్థలు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆయా సంస్థల ప్రతినిధులకు సీఎం దిశానిర్దేశం చేశారు.