Share News

1.49 లక్షల కోట్ల సంక్షేమం

ABN , Publish Date - Aug 05 , 2026 | 03:08 AM

‘‘రాష్ట్ర విభజన తర్వాత ఎక్కువ జనాభాతో తక్కువ వనరులతో రాజధాని లేకుండా ఏపీ ఏర్పడింది. అంతేకాదు, వారసత్వ అప్పులతో వచ్చిన కష్టాల్లో ఉన్న రాష్ట్రం తొలి ఐదేళ్లలో బలంగా నిలదొక్కుకుంది.

1.49 లక్షల కోట్ల సంక్షేమం

  • విధ్వంసం నుంచి వికాసం దిశగా.. రెండేళ్లలో నవ్యాంధ్ర పరుగు

  • అభివృద్ధి, సంపద సృష్టి, సమతుల్యత, సంక్షేమం.. నాలుగు సూత్రాలతో పాలన

  • పెట్టుబడులకు 28 అనుకూల విధానాలు

  • ఉద్యోగుల బకాయిలు 30,849 కోట్లు జమ

  • వైసీపీ పాలనలో చేసిన భారీ రుణాలపై వడ్డీ తగ్గింపుతో రూ.8,629 కోట్లు ఆదా

  • కొత్త పెట్టుబడులతో ప్రతి కుటుంబానికీ రూ.50,000 మేరకు అదనపు ఆదాయం

  • జగన్‌ పాలనలో అప్పుల కుప్పగా రాష్ట్రం

  • ప్రతి ఒక్కరికీ రూ.51,816 ఆదాయం నష్టం

  • రుణాల వినియోగంలో ఏపీ మహిళలే టాప్‌

  • ఆర్థికంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం

అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర విభజన తర్వాత ఎక్కువ జనాభాతో తక్కువ వనరులతో రాజధాని లేకుండా ఏపీ ఏర్పడింది. అంతేకాదు, వారసత్వ అప్పులతో వచ్చిన కష్టాల్లో ఉన్న రాష్ట్రం తొలి ఐదేళ్లలో బలంగా నిలదొక్కుకుంది. ఆ తర్వాత వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్‌ ఘోరంగా పతనమైంది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వ హయాంలో ‘బ్రాండ్‌’ను తిరిగి సొంతం చేసుకుని పరుగులు పెడుతోంది.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ ఐదేళ్లలో చేసిన విధ్వంసాన్ని దాటుకుని ఎలా ముందుకెళ్తున్నామనే అంశాలను ఆయన గణాంకాలతో సహా వివరించారు.

శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలు

  • 2014లో రాష్ట్ర విభజన బాధాకరం. ఆర్థిక వ్యవస్థ నిర్మాణం వ్యవసాయ ఆధారంగా మారింది. ఉమ్మడి రాష్ట్ర జనాభాలో 58 శాతం వాటా ఏపీకి వచ్చింది. వనరులు మాత్రం 46 శాతం మాత్రమే దక్కాయి. రాజధానిని కోల్పోవడం వల్ల ఆదాయం దెబ్బతింది.

  • 2019లో ప్రభుత్వం మారడంతో విధ్వంసం ప్రారంభమైంది. వ్యవస్థల పతనం, దుష్పరిపాలన జరిగాయి. చట్టం, శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. ‘బ్రాండ్‌ ఏపీ’ ప్రతిష్ఠ మసకబారింది.

  • 2024 ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ‘బ్రాండ్‌ ఏపీ’ పునరుద్ధరణ, సంక్షేమ హామీల అమలు, సమానంగా ప్రాంతీయ అభివృద్ధి, రాజధాని ప్రాజెక్టులకు ఊతమిస్తున్నాం.


జగన్‌ పాలనతో ప్రతి ఒక్కరికీ నష్టం

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం రూ.95,231 కోట్లు. విభజన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,110కి పెరగ్గా, ఏపీలో రూ.93,903కి తగ్గింది. లోటు రూ.30,201 కోట్లు.

  • 2014-19లో ఏపీ వృద్ధిరేటు 13.5 శాతం కాగా, తెలంగాణ వృద్ధిరేటు 13.7 శాతం. 2019-24 రాష్ట్ర వృద్ధిరేటు 10.3 శాతానికి పడిపోయింది. 2024-26లో ఏపీ వృద్ధిరేటు 11.3 శాతానికి పెరిగింది. 2019-24 మధ్య రాష్ట్రానికి సుమారు రూ.6.94 లక్షల కోట్ల జీఎ్‌సడీపీ నష్టం వాటిల్లింది. ఒకవేళ 13.5 శాతం వృద్ధి కొనసాగి ఉంటే అదనంగా రూ.76,195 కోట్ల ఆదాయం వచ్చి ఉండేది.

  • ఒకవేళ 2014-19 నాటి సగటు వృద్ధిరేటు కొనసాగి ఉంటే 2025-26 నాటికి తలసరి ఆదాయం రూ.3,67,115కి చేరేది. కానీ, ప్రస్తుతం అది కేవలం రూ.2,94,507గా అంచనాలు ఉన్నాయి. జగన్‌ పాలనలో తప్పులతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ రూ.51,816 తలసరి ఆదాయ నష్టం వాటిల్లింది.

తప్పులు సరిదిద్దుతున్నాం

  • 2019-24 మధ్య పెరిగిన అప్పులు.. వారసత్వంగా వచ్చిన అప్పులు కలిపి రూ.9.74 లక్షల కోట్లకు చేరాయి. ఉత్పాదకత లేని పెట్టుబడులు, మూలధన వ్యయం తగ్గడంతో రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది.

  • ఇప్పుడు ఈ తప్పులన్నీ సరిదిద్దడం కోసం బకాయిల భారాన్ని తగ్గించి, వడ్డీరేట్లను తగ్గించారు. ఆర్థిక క్రమశిక్షణ కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలాగే, సంక్షేమం, ఇచ్చిన హామీలు నెరవేర్చడం, అభివృద్ధి, పెట్టుబడులు, సుపరిపాలనపై దృష్టి సారిస్తోంది.


ఉద్యోగుల బకాయిలు విడుదల

  • 2024 జూన్‌ నాటికి రూ.48,616 కోట్లుగా ఉన్న ఉద్యోగుల బకాయిలను మార్చి 2025 నాటికి రూ.33,366 కోట్లకు, మార్చి 2026 నాటికి రూ.29,259 కోట్లకు తగ్గించారు. గ్రాట్యుటీలు, సీపీఎస్‌ కంట్రిబ్యూషన్‌, పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ పథకాలు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ వంటి వాటికి రూ.30,849 కోట్ల నిధులు విడుదల చేశారు.

  • రుణాల పునఃసమీక్ష ద్వారా రూ.1.5 లక్షల కోట్ల విలువైన 370 రుణాలపై బ్యాంకర్లు, ఆర్థిక సంస్థల ప్రతినిధులతో చర్చించి వడ్డీరేట్లు తగ్గించారు. 2024కి ముందు గరిష్ఠ వడ్డీరేటు 13 శాతం, కనిష్ఠ వడ్డీరేటు 8 శాతం. సగటు 9.9 శాతం ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చాక గరిష్ఠ రేటుని 10.9 శాతానికి, కనిష్ఠరేటును 7.7 శాతానికి, సగటును 9.1 శాతానికి తగ్గించారు.

  • దీనివల్ల ఏడాదికి రూ.1,100 కోట్ల వార్షిక పొదుపు చొప్పున, అప్పులపై వడ్డీ రూ.8,629 కోట్లు ఆదా అవుతుంది.

  • రాష్ట్ర ఆదాయంలో మానవనరుల సగటు వ్యయం 2014-15 నుంచి 2018-19 వరకు 87 శాతం ఉండగా, 2019-20 నుంచి 2023-24 మధ్య అది 110 శాతానికి పెరిగింది. మితిమీరిన నియామకాల వల్ల ఈ భారం పెరిగిందని శ్వేతపత్రంలో పేర్కొన్నారు.

రాజీలేని సంక్షేమం

2024, జూన్‌ నుంచి సంక్షేమ పథకాల కోసం మొత్తం రూ.1,49,401 కోట్లు ఖర్చు చేశారు. వివిధ విభాగాల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టారు. మెగాడీఎస్సీ ద్వారా 15,941 టీచర్‌ పోస్టులు, 5,757 కానిస్టేబుల్‌ పోస్టులు, మిగిలినవి ఇతర కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పోస్టులు ఇచ్చారు. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి ‘కుటుంబ సాధికారత మిషన్‌’ అవలంభిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు సులభంగా అందేలా చూస్తున్నారు.


రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు

అమరావతి మొత్తం ప్రతిపాదిత పెట్టుబడులు రూ.41,188 కాగా, ఇప్పుడు జరుగుతున్న పనుల అంచనా 2014-19లో ఉన్న రూ.323 కోట్ల నుంచి రూ.10,057 కోట్లకు పెరిగింది. పోలవరం ప్రాజెక్టు అంచనా రూ.4,168 కోట్ల నుంచి రూ.8,323 కోట్లకు పెరిగింది. ఓడరేవుల అంచనా వ్యయం రూ.3,863 కోట్ల నుంచి రూ.5,437 కోట్లకు, జల్‌జీవన్‌మిషన్‌ అంచనా రూ.948 కోట్ల నుంచి రూ.1,142 కోట్లకు పెరిగింది. విమానాశ్రయాల ప్రస్తుత కేటాయింపు రూ.2,302 కోట్లు కాగా, ఈ విభాగంలో మొత్తం పెట్టుబడి రూ.21,372 కోట్లు. రాష్ట్ర రహదారుల సగటు వ్యయం రూ.1,561 కోట్ల నుంచి రూ.3,439 కోట్లకు పెరిగింది. మరోవైపు రైల్వేల పరిధిలో రూ.64,417 కోట్ల విలువైన పనులు ప్రస్తుతం సాగుతుండగా, రూ.2,60,944 కోట్ల పనులు ప్రతిపాదన దశలో ఉన్నాయి. ఇక, జాతీయ రహదారుల కింద రూ.38,800 కోట్ల పనులు కొనసాగుతుండగా, రూ.1,03,667 కోట్ల పనులు ప్రతిపాదనలో ఉన్నాయి.

జగన్‌ చేసిన అప్పుల వల్లే..

2014-19లో జీఎస్‌డీపీలో అప్పుల శాతం 28.37 సగటుతో స్థిరంగా సాగింది. జగన్‌ పాలనలో అప్పుల శాతం వేగంగా పెరిగి సగటు 33.83 శాతానికి చేరింది. వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన వ్యయాల భారం వల్ల 2024 తర్వాత ఈ అప్పులు 2.37 శాతం మేరకు పెరిగింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం.. 2024-25 నుంచి ఏపీకి ఎలాంటి రెవెన్యూ లోటు గ్రాంట్లు అందలేదు. 2019-24 మధ్య రాష్ట్రానికి మొత్తం రూ.50,991 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంటు లభించింది. సగటున ఏడాదికి రూ.10,198 కోట్లుగా ఉంది.


ప్రజా రాజధాని అమరావతి

ప్రజా రాజధాని అమరావతికి 2014-19లో 29,966 మంది రైతులు 34,400 ఎకరాల భూమి ఇచ్చారు. రైతులకు తిరిగి ఇచ్చేందుకు 63,410 ప్లాట్లు కేటాయించారు. మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.51,687 కోట్లుగా అంచనా వేశారు. 2019-24లో జగన్‌ ప్రభుత్వం పనులు నిలిపివేయడంతో అమరావతికి ప్రపంచబ్యాంకు నిధులు నిలిచిపోయాయి. రైతులు 1,631 రోజుల పాటు ఉద్యమించారు. అమరావతి పనులపై ఆ సమయంలో కేవలం రూ.323 కోట్లు ఖర్చు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అమరావతి కోసం రూ.40,887 కోట్ల ఆర్థిక సాయం ఖరారైంది. 2030 నాటికి 2.5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా అమరావతి క్వాంటం వ్యాలీ నిర్మిస్తున్నారు. 24 సంస్థల కోసం 781 ఎకరాల కేటాయించారు. 7సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం 108 ఎకరాలు కేటాయించారు. 15 బ్యాంకు కార్యాలయాలు, 4 అంతర్జాతీయ హోటళ్లు వచ్చాయి.

ప్రతి కుటుంబానికీ లబ్ధి

ఇప్పటికే కుదిరిన రూ.23 లక్షల కోట్ల విలువైన ఒప్పందాల ద్వారా 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే కార్యరూపం దాల్చాయి. వీటిద్వారా 10 లక్షల ఉద్యోగాలు లభిస్తాయి. కొత్త పెట్టుబడుల ద్వారా ఒకటి రెండు సంవత్సరాల్లో రూ.3.75 లక్షల కోట్ల అదనపు జీవీఏ వస్తుంది. ఆరేడేళ్లలో అది రూ.39.78 లక్షల కోట్లకు చేరుతుంది. దీనిద్వారా ప్రతి కుటుంబానికీ ఏడాదికి రూ.50,000 అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా.(తలసరి రూ.5 లక్షలున్న కుటుంబాలకు). మరోవైపు పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.29,400 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుంది.


వీటిలో రాష్ట్రం నంబర్‌ 1

  • బ్యాంక్‌ రుణాలను వినియోగించుకుంటున్న గ్రామీణ మహిళలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ దేశంలోనే 1వ స్థానంలో నిలిచింది. సుమారు 97 శాతం సంఘాలు రుణ సదుపాయం పొందాయి.

  • పీఎంఎఫ్ఎంఈ ద్వారా 35,934 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలను సులభతరం చేయడంలో దేశంలోనే అగ్రస్థానం.

  • పొదుపుసంఘాల రుణ ప్రక్రియను డిజిటలైజేషన్‌ చేయడంలో దేశానికి ఏపీ రోల్‌మోడల్‌గా నిలిచింది.

మహిళలే మహరాణులు!

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో(సెర్ప్‌) 8,31,439 సంఘాలు, పట్టణ ప్రాంతాల్లో(మెప్మా) 2,74,797 సంఘాలు ఉన్నాయి. సెర్ప్‌, మెప్మాల్లో కలిపి 1,80,170 మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. బ్యాంక్‌ క్రెడిట్‌ లింకేజీ ద్వారా రూ.43,219 కోట్ల కంటే ఎక్కువ నిధులు అందాయి. 2026-27లో బ్రాండింగ్‌, మార్కెట్‌ లింకేజీల ద్వారా మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించారు. పొదుపు సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేయడానికి ‘స్వయం-ఏపీ’ అనే ప్రత్యేక అంబ్రెల్లా బ్రాండ్‌ ప్రారంభించారు. ‘సీఎం స్వనిధి’ కింద పట్టణ వీధి వ్యాపారులకు రూ.267 కోట్ల రుణాలను మెప్మా అందించింది. దేశంలో ఇది రెండోస్థానంలో నిలిచింది. పొదుపు సంఘాల రుణాల డిఫాల్డ్‌ రేటు కేవలం 0.67 శాతం మాత్రమే. ఇది దేశంలోనే అత్యల్పం. ‘పీ4’ పథకం కింద 21 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించి పేదరిక నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నారు.


వర్గాల వారీ మేళ్లు

ఎస్సీ సంక్షేమం: 43 లక్షల మంది లబ్ధిదారులకు రూ.19,100 కోట్ల ఆర్థిక సహాయం చేశారు. 1047 సంక్షేమ సంస్థలను నెట్‌ జీరో హెల్తీ క్యాంప్‌సలుగా మార్చారు. హాస్టళ్ల మౌలిక సదుపాయాల మెరుగుదలకు రూ.204 కోట్లు, కొత్త హాస్టల్‌ భవనాలకు రూ.106 కోట్లు, ఐఐటీ/నీట్‌, యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్‌, 5,687 మంది మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.63 కోట్లతో ఉపాధి అవకాశాలు కల్పించారు.

ఎస్టీ సంక్షేమం: 9 లక్షల మంది లబ్ధిదారులకు రూ.5,730 కోట్ల ఆర్థిక సాయం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాఫీతోటల విస్తరణకు నిధులు, గిరిజన సంక్షేమ సంస్థల్లో టాయిలెట్లు, ఆర్‌వో ప్లాంట్ల కోసం రూ.60 కోట్లు, 4,030 మంది గిరిజన మహిళల ఉపాధి కోసం రూ.40 కోట్ల నిధులు అందుబాటులోకి తెచ్చారు. 341 పీవీజీటీ గిరిజన గ్రామాలకు రోడ్డు కనెక్టివిటీ కోసం రూ.914 కోట్లు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న సికిల్‌ సెల్‌ ఎనీమియా వ్యాధి స్ర్కీనింగ్‌, చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌లో రూ.3.75 కోట్లతో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు.

బీసీ సంక్షేమం: 118 లక్షల మంది లబ్ధిదారులకు రూ.32,534 కోట్ల ఆర్థికసాయం అందించారు. వడ్డెర సహకార సంఘాల కోసం మైనర్‌ ఖనిజ క్వారీ కేటాయింపుల్లో 33 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. సీనరేజీ, ప్రీమియంలో 50 శాతం రాయితీ ఇచ్చారు. కొత్తగా 10 బీసీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేశారు. మద్యం దుకాణాల కేటాయింపుల్లో గీత కార్మికులు, శొండి వర్గానికి 10 శాతం రిజర్వేషన్‌ ఇచ్చారు. చేనేత కార్మికుల మగ్గాలకు, నాయిబ్రాహ్మణ సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు.

మైనారిటీ సంక్షేమం: 17 లక్షల మంది మైనారిటీ లబ్ధిదారులకు రూ.4,856 కోట్ల ఆర్థిక సాయం చేశారు. ఇమామ్‌లు, మౌజన్‌, పాస్టర్లకు గౌరవ వేతనం పెంచారు. హజ్‌ యాత్రికులకు మెరుగైన సాయం అందిస్తున్నారు. వక్ఫ్‌బోర్డు పాలనలో డిజిటల్‌ సంస్కరణలు తెచ్చారు. పీఎంజేవీకే, పీఎం వికాస్‌ పథకాల ద్వారా మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన, ఖాజీల నియామకాలు, వివాహ లైసెన్స్‌ సంస్కరణలు సరళీకరించారు.

Updated Date - Aug 05 , 2026 | 04:15 AM