Share News

అన్నదాతకు అండ

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:18 AM

రాష్ట్రంలో రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విత్తన సరఫరా దగ్గర నుంచి మార్కెటింగ్‌ వరకు ఎక్కడా రైతులు నష్టపోకుండా గత రెండేళ్లుగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.

అన్నదాతకు అండ

  • విత్తన సరఫరా నుంచి మార్కెటింగ్‌ దాకా..

  • అడుగడుగునా రైతులకు సర్కారు సాయం

  • మాటిచ్చినట్టే ‘అన్నదాత-సుఖీభవ’ అమలు

  • 46.86 లక్షల ఖాతాల్లో 3,125 కోట్లు జమ

  • యుద్ధం వేళ ఆక్వా రైతులను ఆదుకున్నాం

  • తోతాపురి టన్నుకు రూ.4,000 సాయం

  • ఎరువుల విపరీత వాడకంతో అనర్థాలెన్నో..

  • ప్రకృతి సాగుతో ఖర్చు తక్కువ.. ఆరోగ్యమూ..

  • చిలకలూరిపేటలోని లింగంగుంట్లలో సీఎం

  • ‘వేస్ట్‌ టు ఎనర్జీ’ ప్లాంట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన

‘‘భూమి మన తల్లితో సమానం. అలాంటి భూమిలో తాత్కాలిక లాభాల కోసం ఎక్కువ యూరియా వేయడం మొదలు పెట్టాం. దీంతో ఎన్నో అనర్థాలు వస్తున్నాయి. కన్న తల్లితో సమానమైన భూమిని కాపాడుకోవడం రైతుల బాధ్యత. ప్రకృతి వ్యవసాయంతో ఖర్చు తక్కువ, ఎక్కువ ఆరోగ్యకరం. శాస్త్రవేత్తలు సూచించిన విధంగా రైతులు ఎకరాకు ఎంత ఎరువు వాడాలో, అంతే వాడితే ఖర్చు తగ్గుతుంది. ఆదాయమూ పెరుగుతుంది.’’

- సీఎం చంద్రబాబు

చిలకలూరిపేట, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విత్తన సరఫరా దగ్గర నుంచి మార్కెటింగ్‌ వరకు ఎక్కడా రైతులు నష్టపోకుండా గత రెండేళ్లుగా పలు కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో శనివారం జరిగిన అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ పథకం నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. బటన్‌ నొక్కి 46.86 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.3,125 కోట్లు జమ చేశారు. ‘నా జీవితంలోనే అత్యంత ఆనందకరమైన రోజు ఇది’ అని ఈ సందర్భంగా చంద్రబాబు సంతృప్తి వ్యక్తం చేశారు. పీఎం కిసాన్‌ కింద రూ.2,000, అన్నదాత సుఖీభవ కింద రూ.5,000...మొత్తం రూ 7,000 రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఇందులో కేంద్రం వాటా రూ.782 కోట్లు, రాష్ట్రం వాటా రూ.2,343 అని, రెండూ కలిపి రూ.3,125 కోట్ల కోసం బటన్‌ నొక్కాం.’’ అని ఆయన వివరించారు.


కూటమి చేస్తున్న ఇలాంటి మంచి కార్యక్రమాలతో పాటు గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్నీ ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కోరారు. ఆ రోజు 12,500 ఇస్తామని చెప్పి.. రూ.7,500 మాత్రం రైతులకు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని వైసీపీపై ఆయన ధ్వజమెత్తారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకెళుతున్నామని తెలిపారు. ‘‘ఒకప్పుడు ధాన్యం అమ్మితే ఆరు నెలలకు కూడా డబ్బులిచ్చేవారు కాదు. ఈ రోజు ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి.’’ అని తెలిపారు. లేబర్‌ ఖర్చు, వ్యవసాయం ఖర్చులు పెరుగుతుండగా, ఆదాయం తగ్గుతోందని, అందుకే యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రైతులు బాగుంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటుందని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో అనేక సమస్యలను రైతులు ఎదుర్కొన్నారని, ఇప్పుడు తాము ప్రతి సమస్యపైనా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ‘గుంటూరు నుంచి మూడు కంటెయినర్ల మిర్చి ఇతర దేశాలకు పంపితే, తిరిగి వచ్చింది. పురుగు మందులు ఎక్కువగా వినియోగించినట్టు గుర్తించి, వినియోగానికి ఆమోదయోగ్యం కాదని తిప్పి పంపించారు. రాయలసీమ మొత్తం హార్టికల్చర్‌ హాబ్‌గా తయారైంది. ఎన్టీఆర్‌ మొట్టమొదటిసారిగా పామాయిల్‌ సాగు తీసుకొచ్చారు. 60శాతం పామాయిల్‌ ఉత్పత్తి రాష్ట్రంలోనే ఉంది.’’ అని చంద్రబాబు వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


ప్రకృతి సేద్యానికి మారాలి..

‘‘ఇక్కడ రైతు నాగభూషణం ఆరు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 2 ఎకరాల్లో కూరగాయలు వేశారు. గానుగ ద్వారా నూనె ఉత్పత్తి చేస్తున్నారు. ఇదీ మార్పంటే. ప్రకృతి సేద్యానికి అంతా మారాలి. వరి అధికంగా పండిస్తున్నారు. ఎన్టీఆర్‌ కిలో రూ.2 బియ్యం అందించారు. బియ్యానికి అలవాటు పడటం తో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కార్బో హైడ్రేడ్స్‌ వలన షుగర్‌ బారిన పడుతున్నారు.’’

యోగా చేయండి

‘‘ప్రొటీన్‌ ఆహారం తిని ఆరోగ్యం కాపాడుకోవాలి. అందరూ యోగా చేయాలి. సంజీవని ప్రాజెక్టు ద్వారా అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రపంచంలో పరిస్థితులు మారాయి. ఆహార ఉత్పత్తులు పెరిగాయి. రెండు, మూడు సంవత్సరాలకు సరిపడా ఆహార ధాన్యాలు ఉన్నాయి. గోదాములు నిండిపోయాయి. భవిష్యత్‌లో నిల్వలు ఇంకా పెరుగుతాయి. ఎక్కువ దిగుబడులు ఇచ్చే వంగడాలు వస్తున్నాయి. నీటి సరఫరా పెరిగింది. ఎక్కడికక్కడ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఒకప్పుడు ఆంధ్రా అంటే వరి, తెలంగాణ అంటే మెట్టపంటలు. ఇప్పుడు ఆంధ్రాను డామినేట్‌ చేసి తెలంగాణ మొత్తం వరి వేస్తున్నారు. భవిష్యత్‌లో వరికి ఇబ్బందులు వస్తాయని భావించి సీమలో హర్టి కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నాం. ఇరాన్‌లో యుద్ధం జరిగితే మన మామిడి వెలవెలబోయింది. అరటి దెబ్బతింది. రొయ్య గిజగిజలాడే పరిస్థితి వచ్చింది. ధరలు పడిపోయాయి. రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్కించలేం. అక్వా రైతులకు ఒకేసారి ఫీడ్‌ ధర రూ.112కు పెంచగా, రూ.108కే విక్రయించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. తోతాపూరి మామిడి టన్నుకు రూ.4,000 సాయం అందించాం. గతేడాది 295 కోట్లు ఖర్చుపెట్టి బర్లీ పొగాకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఏడాది కూడా పొగాకు ఉత్పత్తి పెరిగింది. ధరలు తగ్గాయి. కిలో రూ.200కంటే తక్కువ కొనుగోలు చేయడానికి వీలులేదు. రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తం కొనుగోలు చేస్తాం. కేంద్రంతోనూ మాట్లాడతాం.’’


సాగు నీటిపై దృష్టి పెట్టాం

‘‘36 ప్రాజెక్టులను నిర్దిష్ట కాల పరిమితితో పూర్తి చేస్తామని ఇక్కడి రైతుల సమక్షంలో హామీ ఇస్తున్నాను. 2027 మార్చి-ఏప్రిల్‌ లోపు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. పోలవరం పూర్తయితే కృష్ణానదికి నీరు వస్తుంది. గుంటూరు చానల్‌ ద్వారా చిలకలూరిపేటకు నీరు వస్తుంది. నీటి కొరత లేదు. నాగార్జున సాగర్‌ కుడి కాలువలకు నీరు తరలించాలి. నల్లమల సాగర్‌, వంశధార ప్రాజెక్టు, పెన్నా అనుసంధానం, బనకచర్ల దాకా.... నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రానికి తిరుగుండదు. ఇదే నా జీవితాశయం. ఇది ఎన్టీఆర్‌ సంకల్పం. ఎన్డీఏ పాలనలో ఇది జరగడం తఽథ్యం. వరికపూడిశెల పల్నాడుకు ఒక వరం. 20 లక్షలమంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేసే ప్రపంచంలోనే ఏకైక రాష్ట్రం మనదే. ప్రకృతి వ్యవసాయంతో ఖర్చు తక్కువ, ప్రజలకు ఆరోగ్యం ఉంటుంది. స్విట్జర్లాండ్‌ ప్రభుత్వం ఏపీకి అవార్డు కూడా ఇచ్చింది. శాస్త్రవేత్తలు సూచించిన విధంగా ఎకరాకు ఎంత ఎరువు వాడాలో, అంతే వాడితే ఖర్చు తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. దీంతో పాటు పండించిన పంటకు గిట్టుబాటు ధరతోపాటు గిరాకీ ఉంటుంది.’’ అని చంద్రబాబు తెలిపారు.


స్వచ్ఛాంధ్ర కోసం..

స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఇకపై ఉద్యమంలా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ‘‘పరిశుభ్రతతో పర్యావరణాన్ని పరిరక్షించుకుంటే వర్షాలు సకాలంలో కురుస్తాయి. రాష్ట్రంలో ఎల్‌ నినో ప్రభావం కనిపిస్తోంది. పడితే ఆధిక వర్షాలు....పడకపోతే మూడు నెలలు వర్షాలు ఉండవు. 30 శాతం గ్రీన్‌ కవర్‌ను 50 శాతానికి పెంచాలన్నదే లక్ష్యం. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలి. మేం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో 130 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది. రూ. 13,00 కోట్లు ఖర్చు పెట్టి దాన్నంతా తొలగించాం. చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నాం. జపాన్‌ సంస్ధ మన దగ్గర ‘వేస్ట్‌ టు ఎనర్జీ’కి సంబంధించిన రెండు ప్లాంట్లను పెట్టింది. గ్రామాల్లో 22 రకాల కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. స్వచ్ఛ రఽథాలు ఏర్పాటు చేసి వ్యర్థాలను సేకరించి సరుకులు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం.’’ అని చంద్రబాబు తెలిపారు. అనంతరం ప్రజా వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన సందర్శించారు. కర్నూలు, కడపలో రూ.330 కోట్లతో 13 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించే ‘వేస్ట్‌ టు ఎనర్జీ’ ప్లాంట్‌లకు వేదిక వద్దనే శంకుస్థాపన జరిపారు.

Updated Date - Jun 21 , 2026 | 04:21 AM