జగన్.. ఆ అరాచకాలకు బదులివ్వు!
ABN , Publish Date - Aug 20 , 2026 | 02:55 AM
చరిత్రలో చూడనన్ని అక్రమాలు గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 నియామకాల్లో జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఊహకే అందనంతగా ఆ వ్యవహారం సాగిందన్నారు.
బయట కుట్రలు చేయడం కాదు
సభకు వచ్చి గ్రూప్-1పై వివరణ ఇవ్వాలి
ఎదురు దాడులతో వాస్తవాలు దాచలేరు
చరిత్రలో లేనన్ని అక్రమాలు, అరాచకాలు
చివరకు కోర్టులనూ మోసపుచ్చే యత్నం
గ్రూప్-1 అక్రమాలు దాచేందుకే తెరపైకి డీఎస్సీ
సీఎం సీట్లో కూర్చొని నేరాలు చేసిన వ్యక్తి సమాధానం చెప్పేందుకు సభకు రాడు
ప్రొఫెసర్లు దిద్దాల్సిన పేపర్లకు కూలీలతో ఎవాల్యూయేషన్
అభ్యర్థినితోనూ మూల్యాంకనం
ప్రైవేటు వ్యక్తుల చేతికి జవాబు పత్రాలు
బాధ్యులపై కఠిన చర్యలు..
ఇలాంటివి జరక్కుండా ఏపీపీఎస్సీ ప్రక్షాళన
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
విద్యార్థులు రాసే పదోతరగతి పరీక్షా జవాబు పత్రాలను పోలీసు ఎస్కార్టుతో తరలిస్తారు. మరి..రాష్ట్రాన్ని పాలించే అధికారులను ఎంపిక చేసే పరీక్షల విషయంలో ఇంకెంత అప్రమత్తంగా ఉండాలి! కానీ, గ్రూపు-1 జవాబు పత్రాల భద్రతను గాలికి వదిలేశారు. నాడు ఇష్టానుసారం వ్యవహరించారు. అర్హత లేని ప్రైవేటు వ్యక్తులతో వాటిని దిద్దించారు. డిజిటల్ మూల్యాంకనాన్ని పక్కనపెట్టి మాన్యువల్ ఎవాల్యూయేషన్ చేయాలన్న కోర్టును సైతం తప్పుదోవ పట్టించేలా అఫిడవిట్లు దాఖలు చేశారు. న్యాయస్థానం ఆదేశాలు అమలులో ఉండగానే, ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగ నియామకాలను జరిపారు.
- సీఎం చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): చరిత్రలో చూడనన్ని అక్రమాలు గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 నియామకాల్లో జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఊహకే అందనంతగా ఆ వ్యవహారం సాగిందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు చేసేందుకు భయపడేలా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. ఏపీపీఎస్సీ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని పోగొట్టారని, చివరకు న్యాయస్థానాన్ని కూడా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. సీఎం సీట్లో కూర్చొని నాడు నేరాలు చేసిన వ్యక్తి నేడు సమాధానం చెప్పేందుకు అసెంబ్లీకి రాలేదన్నారు. బుధవారం అసెంబ్లీలో స్పల్పవ్యవధి చర్చలో భాగంగాను, మీడియాతో చిట్‌చాట్ సందర్భంగాను ముఖ్యమంత్రి గ్రూపు-1 అక్రమాలు, జగన్ అరాచకాలపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన గురువారం అయినా అసెంబ్లీకి వచ్చి బాధ్యతగా గ్రూప్-1 పరీక్షపై సంజాయిషీ చెప్పే ధైర్యం ఉందా.. అని జగన్‌ను ఉద్దేశించి సవాల్ చేశారు. ‘‘సీఎంకు కళ్లు, చెవుల్లాంటి ఇంటెలిజెన్స్ చీఫ్ నేరాలు చేస్తుంటే తెలియదా? పైగా ఆయనకు ఏపీపీఎస్సీ సెక్రటరీ, ట్రాన్స్‌పోర్టు కమిషనర్ బాధ్యతలూ అప్పగిస్తారా? బరితెగించి మరీ గ్రూప్-1లో అరాచకాలు .. అక్రమాలకు వొడిగట్టారు. గ్రూప్-1 అభ్యర్థుల ప్రశ్నపత్రాలను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, గృహిణులు, రోజువారీ కూలీలు దిద్దారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి గ్రూప్-1 జవాబు పత్రాలు వెళ్లాయని సిట్ తేల్చింది. గ్రూప్-1 పరీక్ష జవాబు పత్రాలను ఏపీపీఎస్సీ కార్యాలయంలోనే మూల్యాంకనం చేయాలి. కానీ, అగ్రిగోల్డ్ కేసులో అటాచ్‌మెంట్‌లో ఉన్న హాయ్‌లాండ్‌లో 84 రోజులపాటు అక్రమంగా గ్రూప్-1 పేపర్లు ఉంచారు’’ అని ఆగ్రహించారు. భవిష్యత్తులో అక్రమాలకు తావు లేకుండా ఏపీపీఎస్సీలో ప్రక్షాళన చేపడతామని ప్రకటించారు. ఈ అక్రమాలపై యువత, ప్రజలు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి చెప్పాలని సీఎం కోరారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
అక్రమాల గని..
‘‘ప్రొఫెసర్లతో చేయించాల్సిన మూల్యాంకనం అర్హత లేనివారితో చేయించారు. ఇది తీవ్ర ఉల్లంఘన. మొత్తంగా 159 మందితో కూడిన ప్యానల్‌ను ఎంపిక చేసి అందులో 72 మందికి మూల్యాంకన బాధ్యతలు అప్పగించారు. వారిలో 25 మందిని అనధికారికంగా నియమించారు. మరో 66 మంది ఎ వాల్యూయేటర్లు అనధికారికంగా పరీక్షా పత్రాలు దిద్దారు. ఎ వాల్యూయేటర్ల వివరాలను రహస్యంగా ఉంచాల్సింది పోయి, వాట్సాప్ గ్రూప్‌లో వారి పేర్లను కూరగాయల మార్కెట్లో పెట్టినట్లు పెట్టారు. మూల్యాంకనం చేశాక, అనధికారికంగా గూగుల్ డ్రైవ్, ఇ-మెయిల్, పీడీఎఫ్, ఇతర మార్గాల ద్వారా ప్రైవేటు వ్యక్తులకు పంపారు. ఏపీపీఎస్సీ స్ట్రాంగ్‌రూమ్ నుంచి జవాబుపత్రాలను అనధికారికంగా అగ్రిగోల్డ్ కేసులో జప్తు చేసిన హాయ్‌లాండ్‌కు తరలించారు. మొదట హైదరాబాద్‌లో, ఆ తర్వాత హాయ్‌లాండ్‌లో పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేశారు. హాయ్‌లాండ్‌లో మూల్యాంకనం జరగలేదని హైకోర్టుకు అఫిడవిడ్ ఇచ్చిన సమయంలోనే.. లాజిస్టిక్స్ కోసం రూ.1.14 కోట్లు ఖర్చు చేశారు. అక్రమాలు చేసి, వాటి నుంచి తప్పించుకోడానికి 24 గంటలూ ఎదురుదాడి చేయాలని చూడటం, కుట్రలు చేయడం కాదు. బాధ్యతగా శాసనసభకు వచ్చి జగన్ సమాధానం చెప్పాలి.’’
డూప్లికేట్ ఓఎంఆర్ స్లిప్పులు
‘‘కొత్త చైర్మన్‌గా గౌతం సవాంగ్ బాధ్యతలు స్వీకరించాక మాన్యువల్ ఎ వాల్యుయేషన్‌కు ఆదేశాలు ఇచ్చారు. 49వేల డూప్లికేట్ ఓఎంఆర్ స్లిప్‌లు ముద్రించారు. జవాబు పత్రాల్లో వేర్వేరు చేతిరాతలు, మార్పులూచేర్పులూ, ఓవర్ రైటింగ్ ఉన్నట్టు న్యాయస్థానం నియమించిన కమిటీ గుర్తించింది. 21 ఓఎంఆర్ స్లిప్‌లపై ఎవాల్యుయేటర్, చీఫ్ ఎ వాల్యుయేటర్ సంతకాలు లేవు. ఎ వాల్యుయేటర్ తిరస్కరించినా . చీఫ్ ఎవాల్యుయేటర్ మార్కులను సవరించారు. గ్రూప్-1 పరీక్షను రాసిన యువతి గిరిజతో పరీక్షాపత్రాలు మూల్యాంకనం చేయించారు. అక్కడ 17 రోజుల పాటు సీసీ కెమెరాలు లేవు. అత్యంత ఆధునికమైన మొబైల్ ఫోన్లను పరీక్షా పత్రాలు దిద్దే హాల్లోకి అనుమతించారు. ఈ ప్రశ్నపత్రాలను సెల్ కెమెరాల్లో తీసి బయటకు పంపారు. ఏపీపీఎస్సీ నిబంధనలకు విరుద్ధంగా వాల్యూయేషన్ స్లిప్‌లలో వైట్‌నర్‌ను వాడినట్లుగా గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా 21జవాబు పత్రాలను ఎగ్జామినర్ చీఫ్ ఎగ్జామినర్ సంతకాలు లేకపోయినా, సవరించారు. ఇది ఫోరెన్సిక్ ల్యాబ్‌ల్లో బయటపడింది..’’
యువత భవిష్యత్తు కోసమే..
‘‘2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. ప్రజావేదిక కూల్చివేత నుంచి రాష్ట్ర బ్రాండ్ వరకూ అన్నీ దెబ్బతీశారు. వ్యక్తులకోసం కాదు.. యువత భవిష్యత్తు కోసమే వ్యవస్థ ఉండాలి. గ్రూప్-1 పరీక్షలో జరిగిన అక్రమాలను పూర్తిగా విశ్లేషించి తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తాం. పారదర్శకమైన మూల్యాంకన విధానం, బలమైన భద్రతా ప్రమాణాలు ఏర్పాటుచేస్తాం. ప్రజలు,మేధావుల నుంచి అభిప్రాయాలు తీసుకుని సంస్కరణలు చేపడతాం.’’
గొడ్డలి పార్టీ నేతకు రాజకీయాలు అవసరమా?
‘‘ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న గొడ్డలి పార్టీ నేతకు రాజకీయాలు అవసరమా? దేవాలయం లాంటి అసెంబ్లీని బహిష్కరించడం చరిత్రలోనే లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ అత్యున్నత స్థానం. అలాంటి వేదికను ఓ పార్టీ పూర్తిగా బహిష్కరించడం నా రాజకీయ జీవితంలో చూడలేదు. అసెంబ్లీలో ప్రజాసమస్యలు చర్చిస్తే వాటికి ఓ విలువ, గుర్తింపు ఉంటాయి. బయట కూర్చుని ఎంత మాట్లాడినా, ఆ మాటలకు విలువేముంది? 1978లో జనతా పార్టీ ఎమ్మెల్యేలు వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి ఇద్దరే అసెంబ్లీని అల్లాడించారు. 1989-94లో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ అసెంబ్లీకి రాకపోయినా, నేను, మిగిలిన ఎమ్మెల్యేలందరం అసెంబ్లీలో ప్రజాసమస్యలపై బలంగా పోరాడాం. 2019-24 మధ్య వైసీపీ ఎన్ని అవమానాలకు గురి చేసినా...టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజల తరఫున అసెంబ్లీకి వెళ్లి వారి వాణిని వినిపించారు. అప్పట్లో అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు, టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన పోరాటాలు ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ప్రజాస్వామ్య విలువలంటే లెక్కలేని తనం, తనను గెలిపించిన ప్రజలంటే నిర్లక్ష్యం ఉన్న వ్యక్తి రాజకీయాలకు అనర్హుడు. ప్రజలు సభ్యుల్ని ఎన్నుకునేది తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కారం చూపుతారని. కానీ, గొడ్డలి పార్టీ నాయకులకు ప్రజలంటే లెక్కలేదు. అందుకే వారిష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
గ్రూప్-1 అక్రమాలు కప్పిపుచ్చేందుకే తెరపైకి డీఎస్సీ
గొడ్డలి పార్టీ హయాంలో జరిగిన గ్రూప్ -1 అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే ఆ పార్టీ నేతలు డీఎస్సీపై బురద చల్లుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. సభకు వచ్చి మాట్లాడితే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నా, బయటే కూర్చుని ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. గొడ్డలి పార్టీ బీసీల రాజకీయ హక్కులను కాలరాస్తూ. వారి రిజర్వేషన్లలో కోత పెట్టింది. ఆ తప్పును కూటమి ప్రభు త్వం సరిదిద్దింది అని చంద్రబాబు తెలిపారు.