ఆడపడుచులకు మేమే అండ!
ABN , Publish Date - May 31 , 2026 | 04:51 AM
‘మహానాడు’ సందర్భంగా తెలుగుదేశం ప్రకటించిన మహిళలకు 33 శాతం టికెట్ల అంశం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
33శాతం కోటాపై దేశవ్యాప్త చర్చ
మళ్లీ మహిళా కోటా, డీలిమిటేషన్ బిల్లులు
వీటిపై కేంద్రం పట్టుదలగా ఉంది
రెండూ ఆమోదం పొందాలి
నాడు వ్యతిరేకించిన పార్టీలూ మారొచ్చు
జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపుతో మనకు నష్టం
50 శాతం పెంచితే అందరికీ న్యాయం
జగన్‌లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది
అది గొడ్డలి పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారు
మీడియాతో చంద్రబాబు ఇష్టాగోష్టి
అమరావతి, మే 30 (ఆంధ్రజ్యోతి): ‘మహానాడు’ సందర్భంగా తెలుగుదేశం ప్రకటించిన మహిళలకు 33 శాతం టికెట్ల అంశం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇప్పుడు అన్ని పార్టీలూ ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘‘మహిళలకు మొదటి నుంచీ తెలుగుదేశం అండగా ఉంటోంది. 2011 లెక్కలైనా, తాజా లెక్కల ప్రకారమైనా... జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాష్ట్రానికి నష్టమే. అలాకాకుండా ఉన్న స్థానాలను 50 శాతం పెంచితే అందరికీ న్యాయం జరుగుతుంది. డీలిమిటేషన్ ద్వారా పెరిగిన స్థానాలను మహిళలకు కేటాయించవచ్చు’’ అని చంద్రబాబు వివరించారు. కేంద్రం పునర్విభజన బిల్లు, మహిళా బిల్లును మళ్లీ పార్లమెంటు ముందుకు తీసుకొచ్చేందుకు పట్టుదలగా ఉందని చెప్పారు. ఈ రెండు బిల్లులను వేర్వేరుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. రెండు బిల్లులు ఆమోదం పొందితేనే మహిళలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ రెండు బిల్లులు దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువస్తాయన్నారు. గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన వారి ఆలోచన కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మారవచ్చని చెప్పారు.
గొడ్డలి పార్టీయే...
వైసీపీ గొడ్డలి పార్టీ అని ప్రజలు బలంగా నమ్ముతున్నారని చంద్రబాబు అన్నారు. సైకో పార్టీ అనే దాన్ని మించి గొడ్డలి పార్టీ అన్నది ప్రజల్లోకి బాగా వెళ్లిందన్నారు. గొడ్డలి పార్టీ పేరు ప్రజల్లోకి వెళ్లే కొద్దీ జగన్‌లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందన్నారు. జగన్ విలేకరుల సమావేశం పెట్టి తన కుటుంబ చరిత్ర గొప్పలు చెప్పుకోవడంతో.. వైఎస్ కుటుంబ అరాచకాలన్నీ బయటకు వస్తున్నాయని అన్నారు. వైఎస్ కుటుంబం చేసిన అరాచకాలు చాలావరకు తనకూ తెలియవన్నారు. 30ఏళ్ల క్రితం పౌరహక్కుల సంఘం వేసిన కడప జిల్లాలో పాలెగాళ్ల రాజ్యం పుస్తకానికి ఇప్పుడు మళ్లీ డిమాండ్ పెరిగిందన్నారు. ఇప్పటి తరం కూడా వైఎస్ కుటుంబ హత్యా రాజకీయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. నక్సలైట్లు గన్‌తో రాజ్యాధికారం సాధించాలనుకుని విఫలమయ్యారని, అలాగే గొడ్డలితో వైసీపీ ప్రజాస్వామ్యంలో ఎలా విజయం సాధిస్తుందని ప్రశ్నించారు. వైసీపీలాంటి పార్టీలు ప్రజాస్వామ్యానికి పనికి రావన్నారు. వైఎస్ కుటుంబ బాధితుడు, టీడీపీ నేత పార్థసారథి రెడ్డిపై వైసీపీ నేతల విమర్శలను ప్రస్తావిస్తూ.. హత్యా రాజకీయాలు చేసినవారు రాష్ట్రాన్ని పాలించవచ్చు కానీ, బాధితులు జిల్లా రాజకీయాలు చేయకూడదా? అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత పోరాటంలో న్యాయం ఉందన్నారు. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు సునీతకు ఉందని, ఆమె పోరాటం కారణంగానే ఇన్నేళ్లయినా వివేకా హత్య కేసు సజీవంగా ఉందన్నారు.