సరిలేరు మీకెవ్వరు!
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:14 AM
ప్రధాని నరేంద్ర మోదీ అలసిపోవడం తానెప్పుడూ చూడలేదని, నిత్యం ఉత్సాహంగా ఉంటూ, మిగిలినవారిని కూడా ఉత్సాహపరుస్తారని సీఎం చంద్రబాబు అన్నారు.
మన కాలంలోని అత్యుత్తమ రాజకీయవేత్తల్లో మోదీ ఒకరు
ప్రపంచంలోని ఏ నాయకుడితోనైనా సమానంగా నిలబడగలరు
ప్రధాని అలసిపోవడం ఎప్పుడూ చూడలేదు
నిత్యం ఉత్సాహంగా ఉంటూ, మిగిలినవారినీ ఉత్సాహపరుస్తారు
ప్రజల మనోభావాలను అర్థం చేసుకున్న నాయకుడు
ఆయన నాయకత్వంలోనే నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారత్
ఎన్డీయే భేటీలో ప్రధానిపై సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు
ఏపీ అభివృద్ధికి మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు
న్యూఢిల్లీ, జూన్ 10(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ అలసిపోవడం తానెప్పుడూ చూడలేదని, నిత్యం ఉత్సాహంగా ఉంటూ, మిగిలినవారిని కూడా ఉత్సాహపరుస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో బుధవారం నిర్వహించిన ఎన్డీయే సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం గౌరవంగా భావిస్తున్నానని ప్రకటించారు. ప్రధాని మోదీ 12ఏళ్ల పాలన, దేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా సేవలు అందించడంపై ఆయనకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వ ప్రతిభ, పరిపాలనా సామర్థ్యం, ప్రపంచ స్థాయిలో దేశానికి తెచ్చిన పేరు ప్రఖ్యాతులపై ప్రశంసలు కురిపించారు. దేశాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే రాష్ట్రాల అభ్యున్నతికి, ముఖ్యంగా ఏపీ అభివృద్ధికి మద్దతుగా నిలిచినందుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ప్రతి భారతీయుడి మనోభావాలను అర్థం చేసుకున్న నాయకుడు మోదీ... మన కాలంలో అత్యుత్తమ రాజకీయవేత్తల్లో ఒకరని కొనియడారు. ప్రపంచంలోని ఏ నాయకుడితోనైనా ఆయన సమానంగా నిలబడగలరన్న విషయాన్ని ఎంతో స్పష్టంగా చెప్పగలనని పేర్కొన్నారు. ప్రపంచంలోనే నంబర్‌వన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలన్న లక్ష్యం మోదీ నాయకత్వంతోనే సాకారం అవుతుందని, ఆ రోజు తప్పకుండా వస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సరైన సమయంలో, సరైన స్థానంలో, సరైన నాయకుడిగా దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నారని కొనియాడారు. ఒకవైపు దేశానికి స్థిరత్వాన్ని ఇచ్చే మార్గదర్శిగా, మరోవైపు కొత్త ఆలోచనలకు, నవకల్పనలకు ప్రేరణనిచ్చే నాయకుడిగా పనిచేయడం ఆయన గొప్పతనమని చెప్పారు. మోదీ ఎప్పుడూ ‘నేషన్ ఫస్ట్’ అజెండాతో పనిచేస్తారన్నారు. 2001లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటినుంచీ నేటివరకూ గత 25ఏళ్లుగా మోదీ ప్రజా జీవితంలో విశేషంగా సేవలు అందించారని కొనియాడారు. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా నిలబడటం ఆయన నాయకత్వానికి ఉన్న ప్రత్యేకతగా చంద్రబాబు తెలిపారు.
ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని తెచ్చారు
నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, యుద్ధాలు, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు, ఇంధన మార్కెట్ల అస్థిరత, ప్రధాన ఆర్థిక వ్యవస్థల మందగమనంతో నెలకొన్న అనిశ్చితి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయని సీఎం అన్నారు. అయినప్పటికీ మోదీ సమర్థ పాలనతో దేశంలో ద్రవ్యోల్బణం సుమారు 3.5 శాతం వద్దే కొనసాగుతోందని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని తెచ్చారని ప్రశంసించారు. సీఎంగా సమర్థ పాలన అందించిన మోదీ, ప్రధానిగా కూడా అదే స్ఫూర్తి, సృజనాత్మకత, నూతనత్వాన్ని అనుసరించడం విశేషమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని సర్వేలు మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడని సూచిస్తున్నాయని, ఇది దేశానికే గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు.
దేశం కోసమే ఎన్డీయే కూటమి
సాధారణంగా రాజకీయ కూటములు ఎన్నికల కోసం ఏర్పడతాయని, కానీ ఎన్డీయే కూటమి దేశం కోసం ఏర్పడిందని సీఎం తెలిపారు. అధికారం కోసం కాకుండా దేశ ప్రయోజనాల కోసం ఎన్డీయే ప్రయాణం సాగిస్తోందని, దీనికి రాష్ట్రాల్లో వరుసగా సాధిస్తోన్న విజయాలే సాక్ష్యమన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు గాను 202 సీట్లలో గెలుపు ఎన్డీయేపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని చెప్పారు. అస్సాం, పుదుచ్చేరిల్లో వరుస గెలుపుల ద్వారా ఎన్డీయే ప్రజల ఆదరణను చాటుకుందన్నారు. ఇవి కేవలం ఎన్నికల ఫలితాలు కావని, సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఆయన అభివర్ణించారు. ‘‘ఒకప్పుడు ‘ఈరోజు బెంగాల్ ఆలోచిస్తే... రేపు భారత్ ఆలోచిస్తుంది’ అనే పేరు ఉండేది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బెంగాల్ దశాబ్దాల పాటు అభివృద్ధి ప్రధాన స్రవంతికి దూరమైంది. దేశం సంస్కరణలు, అభివృద్ధి వైపు సాగితే... బెంగాల్ పాత రాజకీయాల్లోనే చిక్కుకుపోయింది. తాజాగా అక్కడ జరిగిన మార్పుతో ఆ రాష్ట్రం మళ్లీ అభివృద్ధి దిశగా సాగనుంది. మారుతున్న దేశ ఆకాంక్షలకు అనుగుణంగా బెంగాల్ అడుగులు వేస్తోంది.’’ అని చంద్రబాబు తెలిపారు. భారతీయత పునరుజ్జీవం పొందడం గత 12ఏళ్లలో మోదీ నాయకత్వంలో వచ్చిన అతిపెద్ద మార్పుగా పేర్కొన్నారు. ‘వికాస్ భీ... విరాసత్ భీ’ నూతన భారత నిర్మాణానికి మార్గదర్శకమని అన్నారు. ప్రాచీన జ్ఞానం, డిజిటల్ పరిపాలన, ఆవిష్కరణల సమన్వయమే మన దేశ కొత్త బలమని సీఎం స్పష్టం చేశారు. ప్రధాని మోదీ అన్ని అడ్డంకులు తొలగించి, స్పష్టమైన విధానాలతో, లక్ష్యాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, వ్యవస్థను పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. ప్రధానిగా మోదీ 12ఏళ్ల ప్రయాణం... దేశ ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబమని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులకు, భారతదేశానికి గౌరవం లభిస్తోందంటే దానికి మోదీ నాయకత్వ పటిమే కారణమని తెలిపారు. ఆయన నాయకత్వంలో దేశం మరిన్ని విజయాలు సాధిస్తుందని, 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం సాధించాలన్న సంకల్పం నెరవేరుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.