కావూరు, హెచ్.జె.దొర కుటుంబాలకు సీఎం చంద్రబాబు పరామర్శ
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:42 AM
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాద్‌లో పర్యటించి, ఇటీవల మరణించిన కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు, ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్.జె.దొర కుటుంబ సభ్యులను పరామర్శించారు.
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాద్‌లో పర్యటించి, ఇటీవల మరణించిన కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు, ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్.జె.దొర కుటుంబ సభ్యులను పరామర్శించారు. తొలుత సాంబశివరావు నివాసానికి వెళ్లిన సీఎం, ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కావూరు కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేంద్ర మంత్రిగా, ప్రజాప్రతినిధిగా సాంబశివరావు అందించిన సేవలను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అనంతరం మాజీ డీజీపీ హెచ్.జె.దొర నివాసాన్ని సందర్శించిన సీఎం, దొర చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఉమ్మడి ఏపీలో పోలీస్ వ్యవస్థను ఆధునికీకరించడంలోనూ, ఆ శాఖను ఉన్నత శిఖరాలకు చేర్చడంలోనూ దొర చూపిన చొరవను కొనియాడారు. పోలీస్ విభాగంలో ఆయన పోషించిన బాధ్యతలు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, దొర కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన మద్దతును ప్రకటించారు.