పొగాకుకు ‘మద్దతు’ ఇవ్వాల్సిందే
ABN , Publish Date - Jul 09 , 2026 | 03:31 AM
రైతులకు నమ్మకం, భరోసా కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లను పెద్ద ఎత్తున చేపట్టాలని, వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు.
రైతుల్ని ఇబ్బందిపెడితే సహించం
కంపెనీలకు సీఎం హెచ్చరిక
అమరావతి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రైతులకు నమ్మకం, భరోసా కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లను పెద్ద ఎత్తున చేపట్టాలని, వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. పొగాకుకు కనీస మద్దతు ధర చెల్లించాల్సిందేనన్నారు. పొగాకు కొనుగోళ్ల ప్రస్తుత పరిస్థితి,పై అధికారులు, ట్రేడర్లతో బుధవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. మొత్తం 28 కంపెనీలు సమర్పించిన ఇండెంట్ వివరాలు, ప్రస్తుతం జరిగిన కొనుగోళ్ల శాతాన్ని సీఎం పరిశీలించారు. ఇండెంట్ ఇచ్చి కొనుగోలు చేయకుండా, ప్రభుత్వానికి సహకరించకపోతే సహించేది లేదని హెచ్చరించారు. ట్రేడర్లు కొనుగోళ్లను తగ్గించడం సరికాదని, కర్ణాటకలో రాని సమస్య ఇక్కడ ఎందుకొస్తోందని ఆయన ప్రశ్నించారు. పొగాకు బోర్డు పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. గుడ్‌విల్ పోగొట్టుకోవద్దని ట్రేడర్లకు హితవు పలికారు. రైతులను ఇబ్బంది పెట్టే కంపెనీలపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. పొగాకు రైతులు ప్రత్యామ్నాయ పంటలకు మళ్లితే, తలెత్తే పరిస్థితి గురించి పొగాకు కంపెనీలు ఆలోచన చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కిలో రూ.200కు తగ్గకుండా, పొగాకును కొనుగోలు చేయాలన్నారు. పలు కంపెనీలకు 95.50 మిలియన్ కిలోల పొగాకు కొనుగోలుకు ఇండెంట్ ఇవ్వగా, ఇప్పటి వరకు కేవలం 17.6మిలియన్ కిలోల పొగాకు మాత్రమే కొనుగోలు చేయడాన్ని తప్పుపట్టారు. అయితే రైతులు డిమాండ్‌కు మించి పొగాకు సాగు చేయడం ప్రస్తుత సమస్యకు కారణమని ట్రేడర్లు చెప్పారు. పొగాకుకు బహిరంగ మార్కెట్ లేకపోవడం సమస్యను తీవ్రం చేసిందని అధికారులు సీఎంకు వివరించారు. కంపెనీలు 142 మిలియన్ కిలోలకు ఇండెంట్ ఇవ్వగా, రైతులు 232 మిలియన్ కిలోల పొగాకును ఉత్పత్తి చేశారని తెలిపారు. దీంతోధర పతనమై, కొనుగోళ్లు తగ్గాయని చెప్పారు. సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులుపాల్గొన్నారు.