Share News

తక్కువ ధరకే విద్యుత్తు

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:18 AM

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, తక్కువ ధరకు విద్యుత్తు అందుబాటులోకి వచ్చేలా సమగ్ర ప్రణాళికలను తయారుచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

తక్కువ ధరకే విద్యుత్తు

  • డిమాండ్‌కు తగ్గట్లు ఉత్పత్తి పెంచాలి.. సమగ్ర ప్రణాళికలు రూపొందించండి

  • టారిఫ్‌లు పెంచకుండానే విద్యుత్‌ సంస్థలు బలపడాలి

  • విద్యుత్‌శాఖ సమీక్షలో సీఎం ఆదేశం

అమరావతి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, తక్కువ ధరకు విద్యుత్తు అందుబాటులోకి వచ్చేలా సమగ్ర ప్రణాళికలను తయారుచేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో విద్యుత్తు శాఖపై ఆయన సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్‌ స్టోరేజీ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలన్నారు. సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజీ వంటి వనరులను సమన్వయం చేసుకుని తక్కువ ధరకు నిరంతర విద్యుత్తు అందించే వ్యవస్థను రూపొందించాలని సూచించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో విద్యుత్తు ఉత్పత్తికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. విద్యుత్తు కొనుగోలు ధరను ఈ ఏడాది యూనిట్‌కు రూ.4.60కు, 2029 నాటికి రూ.4కు తీసుకురావాలని చెప్పారు. తక్కువ ధర విద్యుత్తు కొనుగోలుతోపాటు పవర్‌ స్వాపింగ్‌, కుసుమ్‌, పీఎం సూర్యఘర్‌, పునరుత్పాదక విద్యుత్తు, స్టోరేజీ వంటి వివిధ మోడళ్లను అనుసంధానం చేయాలన్నారు. సౌర విద్యుత్తు ఉత్పత్తిని వీలైనంత మేర పెంచాలని సీఎం ఆదేశించారు. పీఎం సూర్యఘర్‌ కింద 6 లక్షల సోలార్‌ కనెక్షన్లను సెప్టెంబరు నాటికి ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాన్‌ సూర్యఘర్‌ కింద మరో 3 లక్షల కనెక్షన్లను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. వీటితో పాటు మరో 10 లక్షల కనెక్షన్ల కోసం కేంద్రానికి దరఖాస్తు చేయాలని చెప్పారు.


విద్యుత్తు సంస్థలకు రేటింగ్‌..

రాష్ట్రంలోని ఆరు విద్యుత్తు సంస్థలకు పనితీరు ఆధారంగా రేటింగ్‌ విధానం తీసుకురావాలని సీఎం సూచించారు. సంస్థల పనితీరు, ఆర్థిక సామర్థ్యం, నిర్వహణ సామర్థ్యాలను నిరంతరం సమీక్షించాలన్నారు. విద్యుత్తు కొనుగోళ్లలో ఆప్టిమైజేషన్‌ ద్వారా రూ.234 కోట్లు, ప్రాంప్ట్‌ పేమెంట్‌ రిబేట్‌ కింద రూ. 100 కోట్లను ఆదా చేసినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం స్పందిస్తూ విద్యుత్తు సంస్థలపై రుణభారాన్ని తగ్గించాలన్నారు. రుణాలపై నిరంతరం సంప్రదింపులతో వడ్డీరేట్లను వీలైనంత మేర తగ్గేలా చూడాలన్నారు. టారిఫ్‌ పెంచకుండా.. కొనుగోలు వ్యయం, వడ్డీ భారం, పంపిణీ నష్టాలను తగ్గించడం ద్వారా సంస్థల ఆర్థికస్థితిని బలోపేతం చేయాలని ఆదేశించారు. విద్యుత్తు సంస్థల్లో డిజిటల్‌ ట్విన్‌ వ్యవస్థ, అసెట్‌ హెల్త్‌ ఇండెక్స్‌ విధానాలను అమలు చేస్తున్న అధికారులను సీఎం అభినందించారు. నాణ్యమైన విద్యుత్తును వినియోగదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో విద్యుత్తుశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌, విద్యుత్తుశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 14 , 2026 | 05:21 AM