Share News

క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే

ABN , Publish Date - Jun 18 , 2026 | 03:38 AM

అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అధికారులు, ఉద్యోగుల పనితీరుపై 360 డిగ్రీల విశ్లేషణ ఉంటుందని స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే

  • అధికారులకు సీఎం ఆదేశాలు

  • అధికారులు, ఉద్యోగుల పనితీరుపై 360 డిగ్రీల్లో విశ్లేషణ

  • ఫిర్యాదులను అర్జీదారులే ట్రాక్‌ చేసుకునే కొత్త వ్యవస్థ

  • ఆర్టీజీఎస్‌ సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అధికారులు, ఉద్యోగుల పనితీరుపై 360 డిగ్రీల విశ్లేషణ ఉంటుందని స్పష్టం చేశారు. ఫిర్యాదులను ఆర్జీదారులే ఏస్థాయిలో ఉన్నాయో ట్రాక్‌ చేసుకునే కొత్త వ్యవస్థను అమలు చేయాలని అధికారులను నిర్దేశించారు. బుధవారం రాత్రి రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌(ఆర్‌టీజీఎ్‌స)పై ఆయన సమీక్షించారు. ఉన్నతాధికారులు మొదలుకొని కిందిస్థాయి సిబ్బంది దాకా క్షేత్రస్థాయిలో వారంలో మూడ్రోజులు పర్యటనలు చేయాలని.. ఈ నెల నుంచే మొదలుపెట్టాలని తాను గతంలోనే ఆదేశించానని గుర్తుచేశారు. జిల్లా కలెక్టర్లు ప్రతి నియోజకవర్గంలో నెలలో నాలుగు సార్లు పర్యటించాలన్నారు.

దేవదాయ శాఖ పనితీరు మెరుగుపడాలి

దేవాలయాల్లో భక్తులకు మరింత సేవలు అందించేలా దేవదాయశాఖ మరింత ఫోకస్‌ పెంచాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఈ శాఖ ఉద్యోగులు పనితీరు మెరుగుపరచుకోవాలని స్పష్టంచేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించడంలో సింగపూర్‌ వినూత్నవిధానాలను అవలంబిస్తోందని చెప్పారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో మొత్తం 11,600 గుంతలు ఉన్నట్లు గుర్తించామని.. వీటిలో 79 శాతం పూడ్చామని అధికారులు వివరించారు.

Updated Date - Jun 18 , 2026 | 03:40 AM