Share News

ఎల్‌నినో సంక్షోభాన్ని రైతులకు వివరించండి

ABN , Publish Date - Aug 05 , 2026 | 03:24 AM

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సాగులో అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ ప్రణాళికలను ప్రతి రైతుకు వివరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఎల్‌నినో సంక్షోభాన్ని రైతులకు వివరించండి

  • సాగులో ప్రత్యామ్నాయ ప్రణాళికలు చెప్పండి

  • అధికారులు, ప్రజాప్రతినిధులకు సీఎం ఆదేశం

అమరావతి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సాగులో అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ ప్రణాళికలను ప్రతి రైతుకు వివరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎల్‌నినో సంక్షోభ నివారణ ప్రణాళికతో రాష్ట్రంలోని ప్రతి రైతు వద్దకు వెళ్లాలని సూచించారు. ఈనెల 7 నుంచి రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్దేశించారు. ఎల్‌నినో ప్రభావం, లోటు వర్షపాతం, పంటల సాగు, జలవనరులు, తదితర అంశాలపై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్‌ సాయిప్రసాద్‌, స్పెషల్‌ సీఎస్‌ రాజశేఖర్‌, వ్యవసాయ అనుబంధ శాఖల విభాగాధిపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఎల్‌నినో కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అక్టోబరు వరకు లోటు వర్షపాతం నమోదయ్యే సూచనలున్న నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రత్యేకించి పొడి నేలలో విత్తనాలు వేసే ప్రీ మాన్‌సూన్‌ డ్రై సోయింగ్‌ (పీఎండీఎస్‌) విధానంలో సాగు చేసే అవకాశాలను రైతులకు వివరించాలని సూచించారు. ఎల్‌నినో వంటి తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో స్పష్టమైన విధానాన్ని రైతులకు అందించాలని నిర్దేశించారు. రైతు యాప్‌ ద్వారా పూర్తి సమాచారాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు వేగంగా అందించాలన్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించే యాక్షన్‌ ప్లాన్‌ పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. పశుదాణా విషయంలోనూ వీబీజీ రామ్‌జీ పథకాన్ని అనుసంధానించాలని సూచించారు. త్వరలోనే 201 ఉద్యాన క్లస్టర్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇకనుంచి ప్రతి మంగళవారం వ్యవసాయ అనుబంధ రంగాలు, ఎల్‌నినో చర్యలపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం స్పష్టం చేశారు.


ఆక్వా రైతులందరికీ ఈనెల నుంచి విద్యుత్‌ రాయితీ

జోన్లతో నిమిత్తం లేకుండా నాన్‌ ఆక్వా జోన్‌లో ఉన్న ఆక్వా రైతుల కూ రాయితీపై విద్యుత్‌ అందించాలని సీఎం చంద్రబాబు అధికారుల ను ఆదేశించారు. ఆక్వా జోన్‌ పరిధిలో ఇస్తున్నట్లే.. నాన్‌ ఆక్వా జోన్‌లో ని రైతులకూ యూనిట్‌ విద్యుత్‌ రూ.1.50కే ఇవ్వాలని స్పష్టం చేశారు. దీనిని ఈనెల నుంచే అమలు చేయాలని నిర్దేశించారు. దీనివల్ల 12,500 మంది ఆక్వా రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. రొయ్యల మేత ధరల నియంత్రణపై కార్యచరణ చేపట్టాలన్నారు. ఫిష్‌ మీల్‌ ఎగుమతులను 50 శాతానికి తగ్గించేలా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. నాణ్యత తక్కువగా ఉండే ఆఫ్‌ స్టైల్‌ పొగాకుపై కిలోకు రూ.10 చొప్పున మద్దతు ధర ఇచ్చేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచే ఇది అమలులోకి రావాలని స్పష్టం చేశారు. 94 మిలియన్‌ కిలోల ఆఫ్‌ స్టైల్‌ పొగాకును కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. దీని ద్వారా 44 వేల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. బ్యారెన్‌కు రూ.50 వేలు రుణం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు.

Updated Date - Aug 05 , 2026 | 03:25 AM