Share News

సేవలు మరింత సులువుగా అందాలి

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:23 AM

ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులువుగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

సేవలు మరింత సులువుగా అందాలి

  • ఫిర్యాదుల వ్యవస్థ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండాలి

  • రాష్ట్రంలో నెట్‌వర్క్‌ సమస్యలు లేకుండా చూడండి

  • ఆర్టీజీఎస్ సమీక్షా సమావేశంలో చంద్రబాబు

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులువుగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ(ఆర్టీజీఎస్‌) నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. ప్రజలతో నిత్యం సత్సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం మరింత సులువు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవలను సులభతరం చేశామని సీఎంకు అధికారులు వివరించారు. ముందుగా 11 రకాల సేవల్లో ప్రక్రియలను కుదిస్తున్నామని వివరించారు. అలాగే ప్రజా ఫిర్యాదుల వ్యవస్థ ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేసేలా ప్రజలకు అవకాశం కల్పించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ నెట్‌వర్క్‌ సమస్యలు లేకుండా చూడాలని, ఈ మేరకు నెట్‌వర్క్‌ సంస్థలతో మాట్లాడాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో సుమారు మూడు వేల ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని, వాటిని మూడు నెలల్లో పరిష్కరిస్తామని అధికారులు వివరించారు. నవచేతన పేరిట స్త్రీ శిశు సంంక్షేమ శాఖ చేపట్టిన ‘ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ డెవల్‌పమెంట్‌ స్ర్కీనింగ్‌’ విధానంపై సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 33,949 మంది పిల్లలను స్ర్కీనింగ్‌ చేశామన్నారు. అంగన్వాడీకేంద్రాలకు వ చ్చే వారితోపాటు ఇళ్లకు కూడా వెళ్లి స్ర్కీనింగ్‌ చేయాలని సీఎం ఆదేశించారు.


తక్షణ పరిష్కారాలు చూపండి

సీఎం సూచనల మేరకు క్షేత్రస్థాయి పర్యటనల విషయంలో సర్క్యులర్‌ జారీ చేశామని అధికారులు తెలిపారు. ఈ మేరకు నెలలో సెక్రటరీలు 3 రోజులు, హెచ్‌ఓడీలు 6 రోజులు, జిల్లా కలెక్టర్లు 8 రోజులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని పేర్కొన్నామని చెప్పారు. సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి తక్షణ పరిష్కారాలను సూచించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌ విధానం మరింత మెరుగుపరచేలా స్టాండర్డ్‌ ఆపరేటివ్‌ ప్రొసీజర్స్‌ (ఎస్ఓపీ) జారీ చేసినట్లు అధికారులు వివరించారు. సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ, సీఐఐ ప్రతినిధులను వెంటబెట్టుకుని ఆర్టీజీఎస్‌ కార్యాలయానికి సీఎం చంద్రబాబు వచ్చారు. ఆర్టీజీఎస్‌ పనితీరును సీఐఐ ప్రతినిధులకు ఆర్టీజీఎస్‌ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ వివరించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆర్టీజీఎస్‌ పనివిధానానికి సంబంధించిన కేస్‌ స్టడీస్ వారిముందుంచారు. సీఐఐ గ్లోబల్‌ లీడర్‌షిప్‌సెంటర్‌ను త్వరగా ఏర్పాటు చేయాలని సీఐఐని, సీఎం కోరారు. సమావేశంలో సీఎస్‌ జి.సాయిప్రసాద్‌, డీజీపీ హరీశ్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 30 , 2026 | 04:24 AM