Share News

క్లౌడ్‌ బరస్ట్‌ నీటిని మరో ప్రాంతానికి మళ్లించాలి

ABN , Publish Date - Jul 05 , 2026 | 04:01 AM

ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎక్కడైనా నదీ పరీవాహక ప్రాంతంలో ఆకస్మికంగా క్లౌడ్‌ బరస్ట్‌ అయితే..

క్లౌడ్‌ బరస్ట్‌ నీటిని మరో ప్రాంతానికి మళ్లించాలి

  • వర్షం నీటిని భూగర్భంలో ఎన్ని టీఎంసీలు నిల్వ చేసిందీ లెక్కిద్దాం

  • జలధార ప్రయోజనాలపై అధ్యయనం చేయండి: సీఎం

  • కుప్పం నుంచి కలెక్టర్లతో సమీక్ష

అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎక్కడైనా నదీ పరీవాహక ప్రాంతంలో ఆకస్మికంగా క్లౌడ్‌ బరస్ట్‌ అయితే.. ఆ వర్షం నీటిని పక్కనే ఉన్న మరో నదీ పరీవాహక ప్రాంతానికి తరలించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్లు, జల వనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. చెరువుల్లో పూడిక తీత, ఫీడర్‌ ఛానళ్ల అనుసంఽధానంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన ప్రతి శనివారం జరిగే జలధార సమీక్షలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. రాష్ట్రంలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ గడచిన రెండేళ్లలో జల వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదల చర్యల కారణంగా నీటి ఇబ్బందులు తీవ్ర స్థాయిలో లేవని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. జలధార కింద 100 రోజుల ప్రోగ్రామ్‌ ఇచ్చామని, ఇప్పటికే 90 రోజులు పూర్తయ్యాయని తెలిపారు. జలధార ప్రగతిపై జిల్లా కలెక్టర్లను ఆరా తీశారు. జలధారను కొనసాగిస్తామని ప్రకటించారు. పలువురు కలెక్టర్లు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జలధార ప్రగతి ని వివరించారు.


కాగా, ఇప్పటి వరకూ వర్షం నీరు భూగర్భంలోకి చేరి ఎంత మట్టం పెరిగిందో గమనిస్తూ వస్తున్నామని, ఇకపై వర్షం నీరు భూగర్భంలో ఎన్ని టీఎంసీలుగా నిల్వ ఉంటుందో శాస్త్రీయంగా గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. బేసిన్‌ నుంచి బేసిన్‌కు వర్షం నీటిని తరలించడం, ఫీడర్‌ కాలువల అభివృద్ధి, చెరువులను నింపడం తదితరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ గడచిన రెండేళ్లుగా తీసుకున్న చర్యల కారణంగా చెరువుల్లో నీరు చేరాయని కలెక్టర్లు వివరించారు. జలధార కార్యక్రమంపై థర్డ్‌ పార్టీ ఆడిట్‌ను చేయిస్తామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ వివరించారు. వర్షాలు కురిస్తే .. జలధార కార్యక్రమం వల్ల ఎంత ప్రయోజనం కలిగిందో చెప్పేందుకు వీలుందన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సహాయ పునరావాస శాఖ కమిషనర్‌ ప్రశాంతి, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 04:03 AM