Share News

పుంగనూరు తమ్ముళ్లపై చర్యలు

ABN , Publish Date - Jul 15 , 2026 | 04:18 AM

తిరుపతిలో జరిగిన పుంగనూరు నియోజకవర్గం టీడీపీ శ్రేణుల తన్నులాట ఘటనపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. క్రమశిక్షణ విషయంలో..

పుంగనూరు తమ్ముళ్లపై చర్యలు

  • తన్నులాటపై చంద్రబాబు సీరియస్‌

  • టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శిపై

  • దాడి చేసిన వారికి షోకాజ్‌ నోటీసులు

  • పార్టీ నుంచి నలుగురి సస్పెన్షన్‌

  • మరో 12 మందిపై హత్యాయత్నం కేసులు

అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): తిరుపతిలో జరిగిన పుంగనూరు నియోజకవర్గం టీడీపీ శ్రేణుల తన్నులాట ఘటనపై పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. క్రమశిక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జిపై అభిప్రాయ సేకరణ కోసం తిరుపతిలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ముల్లంగి వెంకట రమణపైన, మీడియా ప్రతినిధులపైనా అసంతృప్త వర్గం దాడి చేసింది. దీనిని తీవ్రంగా పరిగణించిన అధిష్ఠానం వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పల్లాను ఆదేశించింది. దీంతో నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. మరో ఇద్దరికి షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. పోలీసులు 12 మందిపై హత్యాయత్నం సహా వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. పార్టీ పదవులు, నియోజకవర్గ ఇన్‌చార్జుల నియామకాలు పార్టీ నిర్ణయిస్తుందని, ఒత్తిళ్లు, సోషల్‌ మీడియా ప్రచారాల ద్వారా నిర్ణయాలు మారవని సీఎం స్పష్టం చేశారు.

Updated Date - Jul 15 , 2026 | 04:19 AM