కేంద్రం ఆప్షన్లు పరిశీలించాక మన అభిప్రాయం చెబుదాం అప్పటిదాకా దీనిపై మాట్లాడొద్దు: సీఎం
ABN , Publish Date - Jun 26 , 2026 | 06:24 AM
తుంగభద్ర నదీ జలాల వివాద పరిష్కారానికి కేంద్రం వేసే హైలెవల్ కమిటీ విధివిధానాలేమిటో మొదట పరిశీలిద్దామని సీఎం చంద్రబాబు అన్నారు.
అమరావతి, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర నదీ జలాల వివాద పరిష్కారానికి కేంద్రం వేసే హైలెవల్ కమిటీ విధివిధానాలేమిటో మొదట పరిశీలిద్దామని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్రం ఇచ్చే ఆప్షన్లను పరిశీలించి.. అప్పుడు మన అభిప్రాయం చెబుదామని తెలిపారు. అప్పటిదాకా పొరుగు రాష్ట్రాలు ప్రతిపాదించే అంశాలపై మనం మాట్లాడకూడదని సూచించారు. గురువారం తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభం తర్వాత ఆయన మంత్రాలయంలో టీడీపీ శ్రేణులతో సమావేశానికి బయల్దేరారు. ఆయన వెంట జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు కూడా హెలికాప్టర్లో వెళ్లారు. ఈ సందర్భంగా పోలవరం, సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై సీఎం చర్చించారు. గోదావరి-కావేరి అనుసంధానానికి కేంద్రం లక్ష కోట్లు వ్యయం చేయనుందని.. దీనివల్ల రాష్ట్రాలకు ప్రయోజనమని తెలిపారు. ఈ పథకం చేపడితే రాష్ట్ర జల సమస్యలు తీరిపోతాయన్నారు. ఈ నెల 29వ తేదీన జల వనరుల శాఖపై సమీక్షిద్దామని సీఎం చెప్పారు.