ప్రజావ్యతిరేక విధానాలకు ఫలితం ఇదే!
ABN , Publish Date - May 05 , 2026 | 04:26 AM
అధికారాన్ని ప్రజాక్షేమానికి వినియోగించకుండా, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తే ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇస్తారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో అధికార పార్టీల ఓటమికి కారణమదే
అధికారాన్ని ప్రజాక్షేమానికి వినియోగించాలి
లేకుంటే ఎన్నికల్లో ఫలితాలు ఇలాగే ఉంటాయి
ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు బాధ్యతతో ఉండాలి
మంత్రులతో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): అధికారాన్ని ప్రజాక్షేమానికి వినియోగించకుండా, ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తే ఎన్నికల్లో ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇస్తారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకు పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు ఫలితాలే నిదర్శనమన్నారు. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు బాధ్యతతో వ్యవహరించాలని, వారు నిరంతరం అధికారంలో ఉన్న వారిని గమనిస్తుంటారని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడవుతున్న తరుణంలో సీఎం చంద్రబాబు సోమవారం మధ్యాహ్నం అందుబాటులో ఉన్న మంత్రులతో సచివాలయంలోని తన చాంబర్‌లో లంచ్ మీటింగ్ నిర్వహించారు.
మోదీ నాయకత్వంపై నమ్మకం: సీఎం
బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడం పట్ల సీఎం చంద్రబాబు సోమవారం ‘ఎక్స్’ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయాలు ఎన్డీయేపైన, ప్రధాని మోదీపైన ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు.
విజయ్ అరంగేట్రం.. అదిరింది: లోకేశ్
మంత్రి లోకేశ్ కూడా విజయ్‌కు అభినందనలు తెలిపారు. అరంగేట్రంలో అదరగొట్టారని, ఈ విజయం ఓటర్ల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందన్నారు. కాగా, ప్రభంజనం సృష్టించిన టీవీకే అధినేత విజయ్‌ను హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ అభినందించారు.
లోకేశ్‌తో ప్రభుత్వ సలహాదారు మంతెన భేటీ
ఏపీ యోగా, నేచురోపతి విభాగం సలహాదారు,ప్రముఖ ప్రకృతి వైద్యనిపుణుడు మంతెన సత్యనారాయణరాజు సోమవారం ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. దశాబ్దాలుగా ప్రకృతి వైద్యం ద్వారా మంతెన సత్యనారాయణ రాజు అందిస్తున్న సేవలను లోకేశ్ కొనియాడారు.