నేడు ఢిల్లీకి సీఎం
ABN , Publish Date - Jul 22 , 2026 | 04:27 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు.
మోదీ, అమిత్‌షాతో భేటీ డీలిమిటేషన్, మహిళా బిల్లులపై చర్చలు
వీటిపై ప్రాంతీయ పార్టీలతో సమన్వయం చేసుకునే బాధ్యత చంద్రబాబుకు అప్పగింత
దీనిపై చర్చించడానికే హస్తిన పర్యటన
కేంద్ర మంత్రివర్గ విస్తరణపైనా మంతనాలు!
1న ‘భోగాపురం’ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించనున్న ముఖ్యమంత్రి
పలువురు మంత్రులనూ కలిసే అవకాశం
అమరావతి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులను ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మళ్లీ తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ బిల్లులను ఈసారి ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని బీజేపీ పెద్దలు పట్టుదలతో ఉన్నారు. ఇందుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ సాధనపై దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా ప్రాంతీయ పార్టీలను సమన్వయం చేసే బాధ్యతను చంద్రబాబుకు అప్పగించారు. దీనిపై చర్చించేందుకే ఢిల్లీ పెద్దల ఆహ్వానంపై ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర మంత్రివర్గ విస్తరణపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధానితో భేటీ సందర్భంగా ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఆయన్ను సీఎం ఆహ్వానిస్తారు. బుధవారం ఉదయం 7.50కు గన్నవరం విమానాశ్రయం నుంచి చంద్రబాబు ఢిల్లీ బయల్దేరతారు. అక్కడకు చేరుకున్నాక నేరుగా పార్లమెంటు భవనానికి వెళ్తారు. తన పర్యటనలో ప్రధానిని, అమిత్‌షాను మాత్రమే గాక.. పీయూష్ గోయల్, మనోహర్‌లాల్ ఖట్టర్, సీఆర్ పాటిల్ సహా పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిసే అవకాశముంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం 10.20కి అమరావతి తిరిగి బయల్దేరతారు.