Share News

అమరావతిని ఆపలేరు

ABN , Publish Date - Jul 03 , 2026 | 04:28 AM

రాజధాని అమరావతిని ఆపడం ఎవరి తరమూ కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చిచెప్పారు. రాజధానిలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని..

అమరావతిని ఆపలేరు

  • అది ఎవరి తరమూ కాదు

  • గొడ్డలి పార్టీది రోజుకో మాట: చంద్రబాబు

  • అసెంబ్లీ సాక్షిగా అమరావతికి నాడు మద్దతు

  • అధికారంలోకి వచ్చి మూడు రాజధానులన్నారు

  • ఇప్పుడు మావిగన్‌ పాటపాడుతున్నారు

  • వీబీ-జీరామ్‌జీ పథకంతో.. గ్రామాల రూపురేఖలు మారుస్తాం!

  • రూ.11,700 కోట్లతో ఉపాధి పనులు

  • రూ.లక్ష కోట్లతో హార్టీకల్చర్‌ హబ్‌గా సీమ

  • దీనికి త్వరలో మదనపల్లెలో శంకుస్థాపన

  • గోదావరి పుష్కరాల్లోపే పోలవరం పూర్తి

  • అభివృద్ధికి అడ్డుపడితే జగన్నాథ రథచక్రాలే!

  • ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక

  • తిరుపతి జిల్లా ముక్కావారిపల్లె వద్ద వీబీ-జీ రామ్‌జీ స్కీంకు శ్రీకారం

  • కేంద్ర మంత్రి చౌహాన్‌, డిప్యూటీ సీఎంతో కలిసి ప్రారంభించిన చంద్రబాబు

గొడ్డలి పార్టీ ఐదేళ్లలో విధ్వంసం సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 93 రకాల కార్యక్రమాలు, పథకాలను తుంగలో తొక్కింది. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటన్నింటినీ పునరుద్ధరించాం.

- సీఎం చంద్రబాబు

వీబీ-జీరామ్‌జీ పథకం గ్రామాల స్వరూపాన్ని మార్చివేసే పవిత్ర కార్యక్రమం. దేశానికి ఆదర్శమైన గొప్ప పథకం. ప్రధాని మోదీ నేతృత్వంలో అగ్రదేశంగా ఎదిగేందుకు వికసిత్‌ భారత్‌ దిశగా సాగిస్తున్న ప్రయాణానికి ఎంతగానో ఉపయుక్తం.

- సీఎం చంద్రబాబు

తిరుపతి/రైల్వేకోడూరు, జూలై 2 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిని ఆపడం ఎవరి తరమూ కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చిచెప్పారు. రాజధానిలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని.. అయితే గొడ్డలి పార్టీ రోజుకో మాట మాట్లాడుతూ అభివృద్ధికి అడ్డు తగులుతోందని ధ్వజమెత్తారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా అమరావతికి అనుకూలంగా మాట్లాడిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులని మాట మార్చారని.. ఇప్పుడు మావిగన్‌ అంటూ కొత్త పాట పాడుతున్నారని మండిపడ్డారు. ‘వికసిత్‌ భారత్‌-గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌ (గ్రామీణ్‌).. వీబీ-జీరామ్‌జీ’ పథకంతో రాష్ట్రంలో గ్రామాల రూపురేఖలు మారుస్తామన్నారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లె వద్ద ఈ పథకాన్ని కేంద్ర వ్యవసాయం-రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో కలసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.

Untitled-4 copy.jpg


కొత్త ఉపాధి పథకం కింద కేంద్రం నుంచి రూ.7700 కోట్లు, రాష్ట్రం వాటా కింద మరో రూ.4 వేల కోట్లతో పనులు చేపడతామన్నారు. 125 రోజుల పనిదినాలతో గ్రామాల అభివృద్ధికి అవసరమైన ఏ పనులైనా చేపట్టేందుకు అవకాశముందని.. రోడ్లు, డ్రైనేజీలు, కాలువలు.. ఇలా వేర్వేరు ఆస్తుల కల్పనకు ఆస్కారముందని తెలిపారు. దీనిని రాష్ట్రం సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటుందన్నారు. ‘రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌, జియో ట్యాగింగ్‌, బయోమెట్రిక్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తాం. కేంద్ర పథకాలన్నిటినీ నిర్వీర్యం చేసిన జగన్‌.. దొంగ లెక్కలు చూపి నిధులు మళ్లించేశారు. ఇక అలా జరగదు. ఇంటింటికీ తాగునీటి కొళాయినిచ్చే జలజీవన్‌ మిషన్‌ పథకాన్ని కూడా నిర్వీర్యం చేస్తే మేం రూ.28 వేల కోట్లతో మళ్లీ ప్రారంభించాం’ అని గుర్తుచేశారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..


ఆ ఘనత పవన్‌దే..

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధికి నిధులు ఖర్చు చేస్తాం. 2024 ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామాల్లో ఒకేసారి గ్రామసభలు నిర్వహించిన ఘనత పవన్‌ కల్యాణ్‌కే దక్కింది. గ్రామీణ ప్రాంతాల్లో 48 రకాల పనులు 4500 చేపట్టి పూర్తి చేయించాం. 7 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 40 వేల గోకులాలు, 15,500 నీటి తొట్టెలు, 1.007 లక్షల పంటకుంటలు నిర్మించాం. గిరిజన ప్రాంతాల్లో 1376 కిలోమీటర్ల రోడ్లు వేసి వారి జీవితాల్లో పవన్‌ ఆనందం నింపారు. 1.66 లక్షల ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం చేపట్టాం. ఉపాధి హామీ పనుల నిమిత్తం 55.44 కోట్ల పనిదినాలు సృష్టించి.. రూ.15,695 కోట్లు ఖర్చు చేశాం. ఈ ఏడాది మరో 10 వేల కిమీ గ్రావెల్‌ రోడ్లు, 1500 కిమీ బీటీ రోడ్లు, 500 కిమీ మ్యాజిక్‌ డ్రెయిన్లు, లక్ష ఎకరాల్లో పండ్ల తోటల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నాం. పొలాలకు రోడ్లు వేసే బాధ్యతా ప్రభుత్వం తీసుకుంటోంది.


పుష్కరాల్లోపే పోలవరం జాతికి అంకితం..

రాయలసీమను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతాం. హార్టీకల్చర్‌ హబ్‌గా మారుస్తాం. దానికోసం ఈ ఏడాది రూ.40 వేల కోట్ల కేంద్ర నిధులు, రూ.60 వేల కోట్ల ప్రైవేటు నిధులు.. మొత్తం లక్ష కోట్లు పెట్టుబడిగా పెడతాం. ఈ హబ్‌కు త్వరలో మదనపల్లెలో శంకుస్థాపన చేస్తాం. సీమ తలరాతను మార్చేది ఎన్డీయే ప్రభుత్వమే. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఆలోపే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం. కేంద్ర సహకారంతో విశాఖలో స్టీల్‌ ప్లాంట్‌ను నిలబెట్టుకున్నాం. విశాఖ రైల్వే జోన్‌ కూడా సాధించుకున్నాం. ఉత్తరాంధ్రకు గూగుల్‌ డేటా సెంటర్‌ వస్తోంది. పుట్టపర్తిలో ఐదో తరం ఫైటర్‌ జెట్‌ తయారవుతోంది. సత్యవేడులో హీరో మోటర్‌ సైకిళ్ళ తయారీ యూనిట్‌ నడుస్తోంది. బుధవారమే గ్లోబల్‌ పార్ట్స్‌ 2.0 ప్లాంట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశాను. ఇప్పుడు తిరుపతి జిల్లాకు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ మోటర్‌ సైకిల్‌ తయారీ ప్లాంట్‌ వస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి, అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోంది. వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు ప్రజలు సహకరించాలి.


‘మామ’పై చంద్రబాబు ప్రశంసల జల్లు

మధ్యప్రదేశ్‌లో ‘మామ’గా ప్రసిద్ధుడైన కేంద్ర మంత్రి శివరాజ్‌ చౌహాన్‌పై సీఎం ప్రశంసల జల్లు కురిపించారు. తోతాపురి మామిడి రైతులను ఆదుకునేందుకు, రోడ్లు, పీఎంఏవై ఇళ్ల నిర్మాణానికి నిధులిచ్చారని కొనియాడారు. నాలుగు సార్లు మధ్యప్రదేశ్‌ సీఎంగా, ఏడుసార్లు ఎంపీగా పనిచేసిన ఆయన ఓటమి ఎరుగని నేతగా అభివర్ణించారు. ‘ప్రజల మనిషి. ఏమడిగినా కాదనే తత్వం కాదు. ఆయన మనందరికీ మామ. దేశానికే మామ’ అని అన్నారు. సభకు హాజరైన ప్రజలతో పలుసార్లు మామ అని అనిపించడంతో చౌహాన్‌ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.


ఏమేం చేశారు..?

బహిరంగ సభ వేదికపై సీఎం, డిప్యూటీ సీఎం, చౌహాన్‌తో పాటు కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్‌, కమలేశ్‌ పాశ్వాన్‌ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి వీబీ-జీరామ్‌జీ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చినట్లయింది. అంతకుముందు బహిరంగసభ ప్రాంగణంలో పంటకుంట పనులను చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, శివరాజ్‌ చౌహాన్‌ ప్రారంభించారు. ఏపీలో విజయవంతంగా అమలు చేస్తున్న మ్యాజిక్‌ డ్రెయిన్‌ నమూనాను పరిశీలించారు. గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పనుల ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధి శ్రామికులకు చౌహాన్‌, సీఎం, డిప్యూటీ సీఎం జాబ్‌కార్డులు అందించారు. సమాచార బుక్‌లెట్‌, కంపెండియమ్‌ ఆఫ్‌ ఆర్టికల్స్‌ను పవన్‌ విడుదల చేశారు. సాఫ్ట్‌ పోర్టల్‌ను నేతలు ప్రారంభించారు. సభలో మంత్రులు అనగాని సత్యప్రసాద్‌, సత్యకుమార్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, కడప అర్బన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ ఛైర్మన్‌ ముక్కా రూపానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 03 , 2026 | 05:59 AM