Share News

మీ ఆస్తి.. మీ అధికారం

ABN , Publish Date - Jul 10 , 2026 | 03:31 AM

భవిష్యత్‌లోనూ ప్రజల ఆస్తులను ఆక్రమించకుండా, ప్రజల ఆస్తిపై ప్రజలకే సర్వహక్కులు ఉండేలా రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

మీ ఆస్తి.. మీ అధికారం

  • భవిష్యత్తులోనూ ఆక్రమించకుండా కట్టుదిట్టం

  • రాజముద్రతో పాస్‌ పుస్తకాల జారీ.. రైతులకు ఆస్తి పన్నును ఎన్టీఆర్‌ రద్దు చేశారు

  • నేను ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు చేశాను.. సరిహద్దు రాళ్లపై నాడు జగన్‌ బొమ్మలు

  • తండ్రికి సమాధి వద్ద పూజలు.. తల్లికి క్షోభ.. ఇలాంటి వాడు సమాజానికి అవసరమా?

  • సీతమ్మను నీచంగా మాట్లాడిన రావణ్‌కు గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం.. ఇది న్యాయమా?

  • గత ఐదేళ్లూ రాయలసీమలో రక్తచరిత్ర.. దాన్ని స్వర్ణ, రైజింగ్‌ సీమగా మారుస్తున్నా

  • 2027 మార్చి నాటికి 9833 గ్రామాల్లో 72,70,605 పుస్తకాల పంపిణీయే లక్ష్యం

  • నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం వెల్లడి.. రైతులకు పాస్‌ పుస్తకాల పంపిణీ

నంద్యాల, జూలై 9 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్‌లోనూ ప్రజల ఆస్తులను ఆక్రమించకుండా, ప్రజల ఆస్తిపై ప్రజలకే సర్వహక్కులు ఉండేలా రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో గురువారం జరిగిన ‘మీ భూమి- మీ హక్కు’ గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ముందుగా బనగానపల్లె తహశీల్దార్‌ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ‘మీ భూమి- మీ హక్కు’ గ్రామ సభలో రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... గడిచిన రెండేళ్లుగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందుతోందన్నారు. గత పాలకుల పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘గత ఐదేళ్ల పాలనలో తమ మాట వినని రైతుల భూములను 22ఏలో పెట్టి ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పేరుతో భూములను లాక్కునేందుకు ప్రయత్నం చేశారు. మేం అధికారంలోకి రాగానే ఆ దుర్మార్గ చట్టాన్ని రద్దు చేసి, భూ వివాదాలకు చెక్‌ పెట్టాం. ధృడ సంకల్పంతో ముందుకుపోతున్నాం. గత పాలకులు భూమి పత్రాలపైనా..సర్వే రాళ్లపైనా తమ ఫొటోలు ముద్రించుకున్నారు. ఆ ఫొటోల పిచ్చిని తొలగించేలా, కట్టుదిట్టమైన రాజముద్రతో పాసు పుస్తకాలను రైతులకు అందజేస్తున్నాం.


అంతేకాకుండా నవాబుల పాలన నుంచీ సుదీర్ఘంగా ఉన్న భూ సమస్యలను కూడా పరిష్కరించాం. పేద రైతుల కష్టాలను గుర్తించి భూములపై పన్నును రద్దు చేసిన మహానీయుడు ఎన్టీఆర్‌. అదే స్ఫూర్తితో 2027 మార్చి నాటికి 9833 గ్రామాల్లో 72,70,605 పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేసి, ఎలాంటి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే నా లక్ష్యం.’’ అని చంద్రబాబు అన్నారు. సంతృప్తి స్థాయిలో నంద్యాల జిల్లా రాష్ట్రంలో 16వ స్థానంలో ఉందని, మరింత మెరుగైన ఫలితాలను సాధించాలని చంద్రబాబు కలెక్టర్‌ రాజకుమారికి దిశ నిర్దేశం చేశారు. అదేవిధంగా కొలిమిగుండ్లలో జలధార- జలహారతి అతి తక్కువ రోజుల్లోనే 1,700 ఎకరాలకు సాగునీరు అందేలా చేసిన మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని అభినందించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...


సీమలో గొడ్డలి పార్టీ రక్త చరిత్ర

‘‘గత ఐదేళ్లలో గొడ్డలి పార్టీ రాయలసీమలో రక్త చరిత్ర రచించింది. సొంత బాబాయిని హత్య చేసి నాపై తప్పుడు ప్రచారం చేశారు. గంజాయి, రౌడీలు, గూండాలను ప్రోత్సహించే దిశగా గొడ్డలి పార్టీ వ్యవహరించింది. గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం రాయలసీమలో అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఒకప్పుడు రాయల సీమ అంటే కరువు. కానీ ఇప్పుడు రతనాల సీమగా మారుతోంది. కడప స్టీల్‌ ప్లాంట్‌, హీరో మోటార్స్‌, డిఫెన్సు ఫైటర్‌ జెట్‌ ప్లాంట్‌ ఏర్పాటు అవుతున్నాయి. భవిష్యత్‌లో సీమలో తయారైన ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌లు దేశమంతా తిరుగుతాయి’’

ఓట్ల కోసమే తండ్రి సమాధికి పూజలు

‘‘ఓట్ల కోసమే తండ్రి సమాధికి జగన్‌ పూజలు చేస్తున్నారు. బతికి ఉన్న తల్లికి, చెల్లికి ఆస్తి ఇవ్వకుండా క్షోభ పెడుతున్నారు. ఇలాంటి వ్యక్తులు సమాజానికి అవసరమా? తల్లికి గౌరవం ఇవ్వని వ్యక్తులు ఎందుకు? గతంలో రాయలసీమ ఎత్తిపోతల పఽథకాన్ని అనుమతులు లేకుండా చేపట్టడం వల్ల గ్రీన్‌ ట్రైబ్యునల్‌ రద్దు చేసింది. అందుకు నాపై నిందలు వేశారు. తిరుపతి జిల్లాలో శెట్టిపల్లి, గుంటూరులోని వట్టి చెరుకూరు, చిత్తురు జిల్లా కంగుందిలో చాలా ఏళ్లుగా ఉన్న భూ వివాదాలను పరిష్కరించాం. పేద ల సంక్షేమం.. అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది’’ అని చంద్రబాబు తెలిపారు. రాబోయే రోజుల్లో రాయలసీమ రతనాల సీమగా మారడంతో పాటు రైజింగ్‌ సీమగా తయారవుతుందన్నారు.


‘కుప్పం’లో నా పనితీరుపైనా ప్రజాభిప్రాయం కోరా: చంద్రబాబు

‘‘కార్యకర్తలే టీడీపీకి బలం. పార్టీకి వారు మూలస్తంభాలు. పార్టీలో చురుకైన కార్యకర్తలు ఉండటం వల్లే మళ్లీ మనం అధికారంలోకి వచ్చాం. వారందరికీ అండగా ఉంటా. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాను.’’ అని చంద్రబాబు అన్నారు. బనగానపల్లె నియోజకవర్గంలోని యూనిట్‌, క్లస్టర్‌, బూత్‌ ఇంచార్జిలు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కుప్పంలో మూడు రోజుల తన పర్యటన గురించి చెబుతూ.. ఎమ్మెల్యేగా తన పనితీరుపైనా అక్కడ ప్రజాభిప్రాయం కోరారని తెలిపారు. ‘‘కార్యకర్తలు విబేధాలు పెట్టుకోకుండా సమైక్యంగా ఉండాలి. వారికి నాయకులు అందుబాటులో ఉండాలి. పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తాను.’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి పయ్యావుల కేశవ్‌తో పాటు మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌, జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే గౌరు చరిత, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరిలు పాల్గొన్నారు. బీసీ జనార్దన్‌రెడ్డి మంత్రిగా చక్కగా విధులు నిర్వహిస్తున్నారని అభినందించారు.

Updated Date - Jul 10 , 2026 | 03:33 AM