చంద్రబాబు ‘ఉక్కు’సంకల్పం
ABN , Publish Date - Jul 03 , 2026 | 05:00 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉక్కు సంకల్పంతో రాయలసీమ పారిశ్రామికంలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. కడప జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు..
నేడు కడప స్టీలు ప్లాంటు పనులు ప్రారంభం
జమ్మలమడుగులో ఏర్పాటు చేస్తున్న జేఎ్‌సడబ్ల్యూ
16,350 కోట్ల వ్యయంతో రెండు దశల్లో నిర్మాణం
మొత్తం 7,500 మందికి ఉపాధి అవకాశాలు
2028 నాటికి మొదటి దశ పూర్తయ్యేలా ప్రణాళిక
నాడు శంకుస్థాపనలతోనే సరిపెట్టిన జగన్
(కడప-ఆంధ్రజ్యోతి)
ముఖ్యమంత్రి చంద్రబాబు ఉక్కు సంకల్పంతో రాయలసీమ పారిశ్రామికంలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. కడప జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన కడప స్టీలు ప్లాంటు నిర్మాణానికి సీఎం చంద్రబాబు శుక్రవారం జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లిలో శంకుస్థాపన చేయనున్నారు. రూ.16,350 కోట్ల వ్యయంతో జిందాల్ సౌత్ వెస్ట్ రెండు దశల్లో స్టీలు ప్లాంటు నిర్మించనుంది. 2,500 మందికి ప్రత్యక్షంగా, 5 వేలమందికి పరోక్షంగా ఉపాధి కలగనుంది. కడపలో స్టీలు ప్లాంటు ఏర్పాటుకు దివంగత సీఎం వైఎస్ హయాంలో పురుడుపోసుకుంది. 2007లో బ్రహ్మణి స్టీల్స్‌కు వైఎస్ హయాంలో శంకుస్థాపన చేశారు. అనంతరం వైఎస్ చనిపోవడం, ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దనరెడ్డి జైలుకు వెళ్లడంతో బ్రహ్మణి స్టీల్స్‌ను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. తర్వాత విభజిత రాష్ర్టానికి మొట్టమొదటి సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు 2018లో డిసెంబరు 28న రాయలసీమ స్టీలు కార్పొరేషన్ పనులకు జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కంబాలదిన్నెలో శంకుస్థాపన చేశారు. తర్వాత అధికారం చేపట్టిన జగన్, చంద్రబాబు మీద కక్షతో దాన్ని అటకెక్కించారు. 2019 డిసెంబరు లో వైఎస్ఆర్ స్టీలు ప్లాంటు కార్పొరేషన్ పేరిట జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద శంకుస్థాపన చేశారు. జేఎస్‌డబ్ల్యూతో శంకుస్థాపన చేశారే కానీ స్టీలు ప్లాంటు నిర్మాణం మాత్రం చేపట్టలేదు. సొంత జిల్లాలో స్టీలు ప్లాంటు కూడా చేపట్టలేని సీఎంగా ముద్ర వేసుకున్నారు. కడప జిల్లాలో స్టీలు ప్లాంటు నిర్మాణం పూర్తి చేస్తామని గత ఏడాది కడపలో జరిగిన మహానాడు వేడుకగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే పనులు మొదలవుతున్నాయి. మొత్తం 1,100 ఎకరాల్లో స్టీలు ప్లాంటు నిర్మాణం.. మొదటి దశలో రూ.4,800 కోట్ల పెట్టుబడితో ప్లాంటు నిర్మిస్తారు. రెండో దశలో రూ.11,850 కోట్లతో పూర్తి చేయనున్నారు. మొదటి దశను 2028 ఏప్రిల్‌కు పూర్తి చేస్తారు.
చకచకా పనులు
స్టీలు ప్లాంట్‌కు అవసరమైన రెండు టీఎంసీల నీటిని గండికోట జలాశయం నుంచి కేటాయించారు. ఇక జాతీయ రహదారి 67ను దీనికి అనుసంధానిస్తూ కొత్తగా రహదారి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించి ప్రహరీ, ఇతర కార్యాలయాలు, అతిథి గృహాలు, బోర్‌వెల్‌లు పూర్తయ్యాయి. ఉక్కు కర్మాగారానికి అనుబంధంగా రూ.2 వేలకోట్లతో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ నిర్మాణం చేపట్టనుంది. 2400 ఎకరాల్లో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇది పరిశ్రమల విద్యుత్ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇక్కడ అనుబంధ పరిశ్రమలు, రవాణా, ఇతర వాటిల్లో సుమారు రూ.50 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఇది రాయలసీమకు గేమ్ చేంజర్ అని చెబుతున్నారు. జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను శుక్రవారం సీఎం ప్రారంభించనున్నారు. గురువారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత అధికారులతో కలసి ఏర్పాట్లు పరిశీలించారు.