నిండు జీవితానికి ‘రెండు చుక్కలు’
ABN , Publish Date - Jun 28 , 2026 | 04:03 AM
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
నేడు రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో వ్యాక్సినేషన్
ఐదేళ్లలోపు పిల్లలకు 68.67 లక్షల డోసులు సిద్ధం
ఉండవల్లిలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
అన్ని జిల్లాల్లో 29,873 కేంద్రాల ఏర్పాటు
అమరావతి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఐదేళ్ల లోపు వయసున్న 49,20,239 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ప్రారంభిస్తారని కమిషనర్ చక్రధర్‌బాబు వెల్లడించారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విశాఖపట్నంలో జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 29,873 కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. వలస కుటుంబాలు, నిర్మాణ ప్రాంతాలు, ఇటుక బట్టీలు, సంచార జాతుల నివాస ప్రాంతాల్లో ఉండే చిన్నారుల వద్దకు వెళ్లి, వారికి పోలియో చుక్కలు వేసేందుకు 1757 ప్రత్యేక బృందాలను నియమించినట్లు చెప్పారు. బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, జాతరలు, సంతలు, ప్రధాన రాకపోకల ప్రాంతాల్లోనూ 1144 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇంటింటికీ వెళ్లేందుకు 59,746 బృందాలను ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంచిందన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో 1,31,298 మంది సిబ్బంది పాల్గొంటారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన 68,67,740 డోసుల పోలియో వ్యాక్సిన్‌ను ఇప్పటికే అన్ని జిల్లాలకు తరలించామని తెలిపారు. సాధారణ టీకా కార్యక్రమంలో పోలియో చుక్కలు తీసుకున్న పిల్లలు కూడా పల్స్ పోలియో కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాలని అధికారులు కోరారు. రాష్ట్రంలో చివరి పోలియో కేసు 2008లో నమోదైందని, అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ పోలియో రహిత రాష్ట్రంగా కొనసాగుతోందని పేర్కొన్నారు.