నేటి నుంచి ఇంటింటికీ టీడీపీ
ABN , Publish Date - Jul 27 , 2026 | 04:10 AM
గొడ్డలి పార్టీ విధానాలు, తప్పుడు పద్ధతులను ప్రజల్లో ఎండగట్టాలని టీడీపీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఘోర ఓటమి చెందినా ఇప్పటికీ సమాజంలో చిచ్చు రాజేస్తోందని మండిపడ్డారు.
వైసీపీ విధానాలను ఎండగట్టండి
ఆ పార్టీ విధ్వంసకర పద్ధతులను ప్రజలకు వివరించండి
నాడు ఓట్లేయాలని ఇంటింటికీ వెళ్లి కోరాం
నేడు హామీలను నెరవేరుస్తున్నామని చెబుదాం
ప్రజాప్రతినిధులు, పార్టీ యంత్రాంగమంతా పాల్గొనాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలూ గెలవాలి
పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు పిలుపు
అమరావతి, జూలై 26 (ఆంధ్రజ్యోతి): గొడ్డలి పార్టీ విధానాలు, తప్పుడు పద్ధతులను ప్రజల్లో ఎండగట్టాలని టీడీపీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఘోర ఓటమి చెందినా ఇప్పటికీ సమాజంలో చిచ్చు రాజేస్తోందని మండిపడ్డారు. గొడ్డలి పార్టీ విధ్వంసకర విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ప్రజలతో నిత్యం మాట్లాడుతూ ఉంటే గొడ్డలి పార్టీ కుట్రలను బహిర్గతం చేయవచ్చన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండడాన్ని బాధ్యతగా తీసుకోవాలని, ఇది అగ్రస్థాయి మొదలుకుని క్షేత్రస్థాయి నేతల వరకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. రెండేళ్ల కూటమి పాలనపై సోమవారం నుంచి 45 రోజుల పాటు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చేపట్టనున్న సందర్భంగా చంద్రబాబు పార్టీ నాయకులతో ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రెండేళ్ల పాలనపై చేపట్టాల్సిన ఇంటింటి ప్రచారం, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ‘ఓట్లేయాలని ఎన్నికల సమయంలో ఇంటింటికీ వెళ్లి చెప్పారు.
ఇచ్చిన హామీలను వివరించారు. అదే విధంగా ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి వెళ్లి మేమిచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పాలి. ప్రజలు ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తే వాటిని నివృత్తి చేయాలి. వారికి అర్థమయ్యేలా వివరించాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు. గత ఎన్నికల్లో చరిత్రాత్మకమైన విజయాన్ని ప్రజలు అందించారని, ప్రజల ఆశీర్వాదం వల్లే సీట్లలో 94ు స్ట్రైక్ రేట్, 57ు ఓట్లు సాధించగలిగామని అన్నారు. ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు సీరియ్‌సగా తీసుకోవాలని స్పష్టం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా పార్టీ యంత్రాంగం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పారు. ‘కూటమి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. కానీ ఏమరుపాటు వద్దు. ప్రజలకు నచ్చని, వారు మెచ్చని పనులు చేయకూడదు. రాష్ట్రం కోసం కూటమి ప్రభుత్వం కచ్చితంగా కొనసాగాల్సిందే. ఇది ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చెప్పాలి. యువత సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో పాటు యువతను గొడ్డలి పార్టీ ఏ విధంగా నిర్వీర్యం చేసిందనే అంశాలను వివరించాలి. యువత భవితకు, వాళ్ల ఆలోచనలకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని కోరారు.
ప్రజలతో సన్నిహితంగా ఉండండి
‘వైసీపీ ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదాలు, విధ్వంసం వల్ల 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. టీడీపీ సహా కూటమి పార్టీలు చేసిన పోరాటాలు, ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలతో మంచి మెజార్టీలు సాధించగలిగాం. ప్రజలకు ఉపయోగపడేలా పాలన చేపడుతున్నాం. నిరంతరం ప్రజాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలూ గెలవాలి. టీడీపీ సహా కూటమి పార్టీల అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బూత్ కన్వీనర్లు సహా వివిధ పార్టీ హోదాల్లో పనిచేసిన వారు బాధ్యతతో పనిచేయాలి. ప్రజలు, కార్యకర్తలతో సన్నిహితంగా ఉండాలి. నాకు కావాల్సింది అనుచరులు కాదు పార్టీకి నాయకులు కావాలి. సమస్యలకు పరిష్కారం చూపగలిగే నైపుణ్యాలను అలవర్చుకోవాలి. లీడర్ షిప్ క్వాలిటీ పెంచుకోవాలి. డబ్బులు ఉన్నాయని, ఎలాగైనా గెలుస్తామనే ధీమాతో గొడ్డలి పార్టీ వ్యవహరించింది. కేవలం డబ్బులతోనే ప్రజాభిమానాన్ని పొందలేం. 2024 ఎన్నికలతో పాటు ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించాలి’ అని చంద్రబాబు సూచించారు.
విజయవంతం చేద్దాం: పల్లా
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలపై విస్తృత ప్రచారాన్ని చేపట్టాలని పార్టీ శ్రేణులకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ ప్రజాచైతన్య యజ్ఞం 45 రోజుల పాటు నిర్విరామంగా కొనసాగనుందన్నారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులందరం కలిసి విజయవంతం చేద్దామని కోరారు. సూపర్-6 హామీల అమలు, మహిళలు, రైతులు, యువత, విద్యార్థులకు అందిన లబ్ధిని ప్రజలకు వివరించాలని కోరారు. ఒకే రాజధాని-అభివృద్ధి వికేంద్రీకరణ, ఉత్తరాంధ్ర, రాయలసీమలో జరుగుతున్న అభివృద్ధిని వివరించాలని సూచించారు. గత ప్రభుత్వ విధ్వంసక పాలనకు, ఎన్డీయే ప్రభుత్వ అభివృద్ధి పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. ప్రజల సమస్యలు, సూచనలను నమోదు చేసి వాటి పరిష్కారానికి పార్టీ,ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకునేలా కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయం, మిత్రపక్షాల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.