చంద్రబాబు సీఎంగా ఉంటేనే రాష్ర్టాభివృద్ధి
ABN , Publish Date - Jun 13 , 2026 | 05:50 AM
దేశ రాజకీయాలలో చంద్రబాబు ఒక సూపర్‌స్టార్ అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు.
టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న
రెండేళ్ల పాలనపై అమ్మవారికి తెలుగు మహిళల సారె
విజయవాడ అర్బన్, జూన్ 12(ఆంధ్రజ్యోతి): దేశ రాజకీయాలలో చంద్రబాబు ఒక సూపర్‌స్టార్ అని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం అన్నివిధాలా ముందుకు వెళుతుందన్నారు. నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల కలయికతో ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం ఆయన విజయవాడ వన్‌టౌన్‌లో వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. దుర్గగుడి చైనావాల్ ప్రాంతం నుంచి ఘాట్‌రోడ్డు వద్ద ఉన్న కామధేను అమ్మవారి ఆలయం వరకు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం వెంకన్న మీడియాతో మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతగా సాగినందుకు తెలుగు మహిళలు అమ్మవారికి సారె సమర్పించినట్టు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రాన్ని పాలించేందుకు శక్తి నివ్వాలని దుర్గమ్మను కోరుకున్నట్టు తెలిపారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మనుగడ ఉండదన్నారు. అమరావతి, విజయవాడ మునిగిపోతున్నాయని వైసీపీ నాయకులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.