తెలుగు జాతిని నంబర్ వన్‌గా నిలుపుదాం
ABN , Publish Date - Mar 20 , 2026 | 04:27 AM
మన పండుగలు, ఆచార వ్యవహారాల్లోనే సైన్సు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వాస్తు శాస్త్రం, సూర్య నమస్కారాలు, యోగా, ధ్యానం, నేచురోపతి వైద్యం వంటివి మనకు ప్రకృతి నుంచి వచ్చినవేనని చెప్పారు.
స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్రాభివృద్ధి
గత 21 నెలల్లో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం
ప్రైవేటు రంగంలో 6.28 లక్షల మందికి ఉపాధి
ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన
38 మందికి కళారత్న, 122 మందికి ఉగాది పురస్కారాలు
వేసవి వచ్చినా రిజర్వాయర్లలో 65 శాతం నీటి నిల్వలున్నాయి. మే 15 నాటికే నారుమళ్లు వేసుకోవాలని ముందుగానే ప్రకటించిన ప్రభుత్వం మాదే. మూడోసారి కూడా గోదావరి పుష్కరాలను నిర్వహించే గౌరవం నాకే దక్కింది. తర్వాత కృష్ణా పుష్కరాలనూ మూడోసారి ఘనంగా నిర్వహిస్తాం.ప్రతి వ్యక్తికీ ఆర్థిక, సామాజిక, ఆరోగ్య భద్రత అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. అందరికీ సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నాం.
- సీఎం చంద్రబాబు
అమరావతి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): మన పండుగలు, ఆచార వ్యవహారాల్లోనే సైన్సు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వాస్తు శాస్త్రం, సూర్య నమస్కారాలు, యోగా, ధ్యానం, నేచురోపతి వైద్యం వంటివి మనకు ప్రకృతి నుంచి వచ్చినవేనని చెప్పారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతామని తెలిపారు. 2047 నాటికి తెలుగుజాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలని సంకల్పించుకున్నట్లు తెలిపారు. గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనం చేసి వేడుకలను ప్రారంభించిన ఆయన.. ఉగాది పచ్చడిని రుచి చూశారు. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణిశర్మ పంచాంగ శ్రవణాన్ని మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కందుల దుర్గేశ్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం శ్రద్ధగా విన్నారు. సాహిత్యం, సంగీతం, కళలు, సామాజిక సేవా రంగాల్లో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 38 మందికి కళారత్న అవార్డులు, మరో 122 మందికి ఉగాది పురస్కారాలను ఆయన అందజేశారు. వివిధ దేవాలయాల అర్చక పురోహితులను సత్కరించారు.
తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగం, వ్యవసాయ, ఉద్యానవన పంచాంగాలు, సాంస్కృతిక శాఖ వార్షిక ఈవెంట్స్ క్యాలెండర్, శిల్పారామం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. మొదట ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ‘ఉగాది పచ్చడి మన జీవితాలను ప్రతిబింబిస్తుంది. షడ్రుచుల తరహాలోనే మనందరి జీవితాల్లో కష్టసుఖాలు ఉంటాయి. పండుగలు ఆరోగ్యకరమైన జీవన శైలిని నేర్పుతాయి. మన సంస్కృతి, సంప్రదాయాలు నేర్పే విలువలను అందరూ గౌరవించి పాటించాలి. ఇక్కడ ఉన్న మనందరి కంటే విదేశాల్లో స్థిరపడిన తెలుగువారే మన సంస్కృతి, సంప్రదాయాల విస్తృతికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారారు.’ అని పిలుపిచ్చారు. ఇంకా ఏం చెప్పారంటే..
ఆ ఐదేళ్లలో ముఖాల్లో నవ్వులే లేవు..
2024కి ముందు ఐదేళ్లు రాష్ట్రంలో పండుగలు లేవు.. ప్రజల ముఖాల్లో నవ్వులే లేవు. ఒక వ్యక్తి కారణంగా.. అందరూ కలిసి సంతోషంగా పండుగలు నిర్వహించుకునే పరిస్థితి లేదు. తల్లికి, చెల్లికి ఆస్తులు ఇవ్వని వ్యక్తులు, ఇంకొందరు దుష్టులు.. ప్రజలను ఏమార్చేందుకు కుట్రలు చేస్తారు. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. విభజిత ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి కోసం కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం టెక్నాలజీ, డేటా సెంటర్ల గురించి చర్చిస్తున్నాం. విశాఖ, తిరుపతి, అమరావతి కేంద్రాలుగా ప్రాంతీయ ఎకనామిక్ జోన్లు ఏర్పాటు చేశాం. పోలవరం నిర్వాసితులకు గత పాలకులు పైసా కూడా ఇవ్వలేదు. మేం నిర్వాసితులకు ఇప్పటి వరకు రూ.1,943 కోట్లు ఇచ్చాం. అన్ని ప్రాంతాలూ సస్యశ్యామలం కావాలంటే పోలవరం పూర్తి కావాలి. దీనికి ఇంకా రూ.5 వేల కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. గోదావరి పుష్కరాల కంటే ముందే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తాం. కృష్ణా డెల్టాకు, విశాఖకు గ్రావిటీతో నీళ్లు వెళ్తే..రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది.
జనాభా పెంపునకు చర్యలు..
జనాభా నిర్వహణ విధానాన్ని తీసుకొచ్చి జనాభాను పెంచేలా చర్యలు చేపడుతున్నాం. తల్లికి వందనం ద్వారా చదువుతున్న పిల్లలందరికీ ఆర్థిక సాయం అందిస్తున్నాం. దివ్యాంగశక్తి ద్వారా దివ్యాంగులకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో వారికి ఆత్మగౌరవాన్ని కల్పించడంతోపాటు డబ్బులు ఆదా అయ్యేలా చర్యలు తీసుకున్నాం. అర్చకులకు రూ. 15 వేలు వేతనం ఇవ్వడంతోపాటు ఇమాంలు, మౌజన్లకు గౌరవ వేతనాలు అందిస్తున్నాం.
20 లక్షల ఉద్యోగాల సృష్టికి సంకల్పం..
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కోసం సంకల్పించాం. ఉగాదిని పురస్కరించుకుని 10,060 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా 15,940 మంది టీచర్ పోస్టులను భర్తీ చేశాం. 5,757 మంది పోలీసు కానిస్టేబుళ్ల నియామకాలను పూర్తి చేశాం. గడచిన 21 నెలల్లో మొత్తం 30,607 మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. ప్రైవేటు రంగంలో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. సమాజంలో అట్టడుగున ఉండిపోయినవారిని పేదరికం నుంచి బయటపడేసేలా జీరో పావర్టీ కార్యక్రమం పీ-4 చేపట్టాం. 2047 నాటికి వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీగా ఏపీ మారాలంటే అన్ని రంగాల్లోనూ రాష్ట్రం ముందుండాలి. వాస్తు శాస్త్రం, సూర్య నమస్కారాలు, యోగా, ధ్యానం, నేచురోపతి వైద్యం వంటివి మనకు ప్రకృతి నుంచి వచ్చినవే. ఆరోగ్యం, ఆనందం, సంపద వీటివల్లే సాధ్యం. అందుకే నేలను, ప్రకృతిని ఆరాదిస్తాం. దానిని అందిపుచ్చుకునే రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ‘సంజీవని’ ప్రాజెక్టు ద్వారా ముందడుగు వేశాం. నీటిని పరిరక్షించేలా నీటి భద్రత విధానాన్ని తీసుకొచ్చాం. తాగునీటికి, సాగునీటికి, పరిశ్రమలకు అవసరమైన నీటిని సరఫరా చేసేలా నీటి యాజమాన్యం చేస్తున్నాం.