Nimmala Ramanaidu: సాగునీటి రంగంపై సీఎం ఫోకస్!
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:53 AM
సాగునీటి రంగంపై ము ఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. దావోస్ పర్యటనకు వెళ్లే ముందు రాష్ట్ర జల వనరుల శాఖపై సమగ్ర సమీక్ష నిర్వహించిన చంద్రబాబు..
దావోస్ నుంచి రాగానే నీటి సంఘాలతో సమావేశం?
‘సమాఖ్య’తో మంత్రి నిమ్మల భేటీ
అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): సాగునీటి రంగంపై ము ఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. దావోస్ పర్యటనకు వెళ్లే ముందు రాష్ట్ర జల వనరుల శాఖపై సమగ్ర సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. ఈ పర్యటన ముగించాక .. వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించనున్నారు. అలాగే, చిన్న తరహా నీటి వ్యవస్థలో కీలకభూమిక వహిస్తున్న సాగునీటి సంఘాలతో రాజధాని నగరం అమరావతిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని జల వనరుల శాఖను సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం సాగునీటి సంఘాల సమాఖ్య కార్యవర్గంతో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు. సీఎం దావోస్ పర్యటన నుంచి తిరిగి రాగానే.. వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్యతో బహిరంగ సమావేశాన్ని నిర్వహిస్తామని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. తేదీ ఇంకా ఖరారు కాలేదని, నెలాఖరులోగా సమావేశం ఉంటుందని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల ప్రగతిని సీఎం సమీక్షిస్తారు. దావోస్ నుంచి వచ్చాక ఈ నెలాఖరు దాకా సాగునీటి ప్రాజెక్టులపైనే సీఎం దృష్టి కేంద్రీకరించనున్నారు.