పొగాకు కిలో రూ.200 తగ్గొద్దు
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:17 AM
రాష్ట్రంలో పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని సీఎం చంద్రబాబు చెప్పారు.
పొగాకు వెనక్కి వెళ్లడానికి లేదు.. బయట కొనుగోలు చేస్తే.. అరెస్టులే
ట్రేడర్లు, రైతుల భేటీలో సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. మార్కెట్‌లో పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కు కంటే తగ్గడానికి వీల్లేదని స్పష్టం చేశారు. గురువారం పొగాకు రైతులు, ట్రేడర్లతో సీఎం సమావేశం నిర్వహించి పొగాకు ధరలపై సమీక్షించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పొగాకు రైతులను ఆదుకునేందుకు ట్రేడర్లు, కొనుగోలు కంపెనీలు మానవీయ కోణంలో రైతులకు సహకరించాలని సూచించారు. పొగాకు వేలం కేంద్రాల్లో నో బిడ్, లో బిడ్ అనే మాటలకు తావుండకూడదని స్పష్టం చేశారు. రైతులు మార్కెట్‌కు తెచ్చిన పొగాకు బేళ్లను వెనక్కి పంపే పరిస్థితి ఉండకూడదని, మార్కెట్‌లోకి వచ్చిన పొగాకును కంపెనీలు కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. పొగాకు బోర్డు పరిధిలో కాకుండా.. అనధికారికంగా కొనుగోళ్లు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే అరెస్టులు చేస్తామని హెచ్చరించారు. అలాగే పొగాకు మార్కెట్ స్థిరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా ప్రయత్నిస్తుందని, ఈమేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. రైతులు, పొగాకు బోర్డు ప్రతినిధులను వెంట బెట్టుకుని ఢిల్లీ వెళ్లి, సంబంధిత మంత్రులు, అధికారులను కలవాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడును ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రాంనారాయణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు.