విడతలవారీ ‘షో’ వద్దు!
ABN , Publish Date - Jul 01 , 2026 | 04:26 AM
వెలిగొండ ప్రాజెక్టు కోసం వాళ్లు భూములు ఇచ్చారు. పరిహారం కోసం మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు! ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి... రూ.300 కోట్ల పరిహారం చెల్లింపుపై ప్రకటన చేసి...
రూ.300 కోట్లూ ఒకేసారి పడాలి
లేదంటే నా మాట పోతుంది
వెలిగొండ నిర్వాసితులపై సీఎం పట్టు
‘ఒక్కసారిగా కష్టం’ అన్న ఆర్థిక శాఖపై ఫైర్
ఫలితంగా 29న చకచకా ఖాతాల్లోకి సొమ్ము
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
వెలిగొండ ప్రాజెక్టు కోసం వాళ్లు భూములు ఇచ్చారు. పరిహారం కోసం మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు! ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి... రూ.300 కోట్ల పరిహారం చెల్లింపుపై ప్రకటన చేసి... నమూనా చెక్కు చూపించాక కూడా ఫలితం లేకపోతే? నిర్వాసితుల్లో కొందరి ఖాతాల్లో జమ అయి... మరికొందరికి కాకుండా పోతే!? అదంతా ఒట్టి ‘షో’గా మిగిలిపోయేది. కానీ... ముఖ్యమంత్రి తీవ్ర స్పందనతో ఆర్థిక శాఖ అప్పటికప్పుడు నిధులు జమ చేసేసింది. దీని వెనుక ఏం జరిగిందంటే... వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఒకే విడతలో రూ.300 కోట్ల విడుదల వెనుక హైడ్రామా చోటుచేసుకుంది. మూడు రోజుల కిందట (జూన్ 27న) చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు ప్రగతిని పరిశీలించేందుకు అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వాసితులకు రూ.300 కోట్ల నిధులు విడుదల చేస్తున్నానని.. తక్షణమే వారి ఖాతాల్లో పడతాయని మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద బహిరంగ సభలో ప్రకటించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ ప్రకటన గురించి జల వనరుల శాఖ ప్రత్యేక సీఎస్ శశిభూషణ్ కుమార్ ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్‌కు ఫోన్ చేసి చెప్పారు. ఒకే దఫాలో రూ.300 కోట్ల విడుదల కష్టమని.. విడతల వారీగా చెల్లిస్తామని రొనాల్డ్ రోస్ అన్నారు. శశిభూషణ్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విడతలవారీగా నిర్వాసితుల ఖాతాల్లో డబ్బులు పడితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తానని తాను ప్రకటించాక.. వారి ఖాతాల్లో డబ్బులు పడకపోతే.. ముఖ్యమంత్రిగా తన మాట పోతుందన్నారు. ఈ విషయాన్ని రొనాల్డ్ రోస్‌కు గట్టిగా చెప్పాలని శశిభూషణ్‌కు సూచించారు. ఆయనకు తక్షణమే ఫోన్ కలపాలని ఆదేశించారు.
అక్కడే ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడు వెంటనే ఫోన్ చేశారు. రోస్‌తో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. విడతలవారీగా నిధులు వేస్తామంటే కుదరదని, వెంటనే రూ.300 కోట్లు జమచేసి ఆ విషయాన్ని శశిభూషణ్‌కు చెప్పాలని.. మెసేజ్ కూడా పెట్టాలని ఆదేశించారు. చంద్రబాబు గట్టిగా ఆదేశించడంతో.. ఆర్థిక కార్యదర్శి నిమిషాల వ్యవధిలోనే ఆ నిధులు జమ చేసేసి.. శశిభూషణ్‌కు ఫోన్ చేసి చెప్పారు. బహిరంగ సభలో సీఎం మాట్లాడుతుండగా.. శశిభూషణ్ ఆయన వద్దకు వెళ్లి రూ.300 కోట్లు విడుదలయ్యాయని తెలిపారు. అయితే వరుసగా శని, ఆదివారాలు సెలవులు వస్తున్నందున.. సోమవారం నిర్వాసితుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయన్నారు. ఇదే విషయాన్ని బహిరంగ సభలో సీఎం ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగానే సోమవారం నిర్వాసితులకు వ్యక్తిగత ఖాతాల్లో డబ్బులు పడ్డాయి. 30 ఏళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న వారు.. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.