ఏమ్మా.. బాగున్నారా!
ABN , Publish Date - Apr 21 , 2026 | 06:20 AM
‘‘ఏమ్మా.. బాగున్నారా..? పిల్లలు ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నవయ్యా..? రోజుకు ఎంత సంపాదిస్తున్నావు..? ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది?.’’ అంటూ అన్న క్యాంటీన్‌లో అల్పాహారం తీసుకునేందుకు వచ్చిన...
పిల్లలు ఏం చేస్తున్నారు.. పేదలకు బాబు పలకరింపు
అన్న క్యాంటీన్‌లో సీఎం సందడి
విజయవాడ, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): ‘‘ఏమ్మా.. బాగున్నారా..? పిల్లలు ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తున్నవయ్యా..? రోజుకు ఎంత సంపాదిస్తున్నావు..? ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది?.’’ అంటూ అన్న క్యాంటీన్‌లో అల్పాహారం తీసుకునేందుకు వచ్చిన పేదలు, సాధారణ ప్రజలను సీఎం చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. ఆటోడ్రైవర్లు, విద్యార్థులు, మహిళలు, పారిశుధ్య కార్మికులతో ఆయన కలివిడిగా మాట్లాడారు. సీఎం స్థాయి వ్యక్తి తమతో కలిసి అల్పాహారం తీసుకోవడం, తమ యోగక్షేమాలను తెలుసుకునే ప్రయత్నం చేయడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు.
పెన్షన్‌కు పెట్టుకోమ్మా!
అల్పాహారం తీసుకుంటున్న సమయంలో తన పక్కనే ఉన్న ఓ పారిశుధ్య కార్మికురాలితో చంద్రబాబు మాటలు కలిపారు. ‘‘నువ్వేం చేస్తున్నావమ్మా..’’ అంటూ ఆమె కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకున్నారు. దీనికి ఆమె.. తాను పటమట ప్రాంతంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నాని, భర్త చనిపోయాడని వివరించారు. ఆ వెంటనే.. ‘‘ప్రతినెలా జీతం సక్రమంగా అందుతోందా?. వితంతు పెన్షన్ వస్తోందా?.’’ అని సీఎం ప్రశ్నించారు. పెన్షన్ రావడం లేదని ఆమె చెప్పడంతో.. దరఖాస్తు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.
డిగ్రీ పూర్తయితే ఖాళీగా ఎందుకు?
తనకు ఎదురుగా అల్పాహారం తీసుకుంటున్న ఓ ముస్లిం మహిళతో కూడా చంద్రబాబు మాట్లాడారు. ఆమె కుటుంబ బాగోగులు తెలుసుకున్నారు. తన కుమారుడు డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్ద ఉంటున్నాడని ఆమె చెప్పడంతో.. ‘‘డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఎందుకు ఉంటున్నాడు. ఏదోఒకటి చేయాలి కదా?.’’ అని సీఎం ప్రశ్నించారు. అబ్బాయితో ఏదో ఒక పని చేయించాలని, జీవితంలో స్థిరపడేలా చూడాలని సూచించారు.
రక్షణగా ఉంటావా...?
తనతోపాటు అల్పాహారం చేస్తున్న విద్యార్థితో సీఎం చంద్రబాబు సంభాషించారు. ‘‘నువ్వేం చేస్తున్నావు?’’ అని విద్యార్థిని ప్రశ్నించగా.. పదో తరగతి చదువుతున్నానని అతను బదులిచ్చాడు. ‘‘అన్న క్యాంటీన్ ఎలా ఉపయోగపడుతోంది?.’’ అని సీఎం మరో ప్రశ్న వేశారు. దీనికి ఆ విద్యార్థి స్పందిస్తూ.. ‘‘ఇంట్లో టిఫిన్ తినకుండా వచ్చినప్పుడు ఈ క్యాంటీన్‌లో తింటా.’’ అని జవాబిచ్చాడు. స్కూల్లో బోధన బాగుందా? అని సీఎం అడగ్గా.. బాగానే చెబుతున్నారని సమాధానమిచ్చాడు. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావని సీఎం అడిగితే.. పోలీసు అవుతానని చెప్పాడు. ‘‘అందరినీ కొట్టవచ్చని పోలీసు అవుతావా?. ప్రజలకు రక్షణగా ఉంటావా?. వారి మీద పెత్తనం చేస్తావా?.’’ అని చంద్రబాబు నవ్వుతూ ప్రశ్నించారు.