Share News

కార్యకర్తలే.. ప్రచారకర్తలు!

ABN , Publish Date - Apr 04 , 2026 | 04:24 AM

తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే సైనికులు వారేనని, కార్యకర్తలకు పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

కార్యకర్తలే.. ప్రచారకర్తలు!

  • క్లస్టర్‌ ఇన్‌చార్జుల శిక్షణలో చంద్రబాబు

  • 10లోపు పార్టీ రాష్ట్ర కమిటీ

అమరావతి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే సైనికులు వారేనని, కార్యకర్తలకు పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. క్లస్టర్‌ ఇన్‌చార్జులు కూడా కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. శుక్రవారం సీఎం చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం, క్లస్టర్‌ ఇన్‌చార్జులతో నిర్వహించిన ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ కార్యక్రమాలకు కార్యకర్తలే ప్రచారకర్తలు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు చెప్పుకోవడం కార్యకర్తలపైనే ఆధారపడి ఉంటుంది. దీనికి క్లస్టర్‌ ఇన్‌చార్జులు బాధ్యత తీసుకోవాలి.’’ అని సూచించారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించి భవిష్యత్తులో ఎవరూ అమరావతిని కదల్చలేని విధంగా దానికి చట్టబద్ధత కల్పించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. అమరావతి బిల్లు.. రైతుల త్యాగాలకు ఫలితం దక్కేలా చేసిందని, రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా కల్పించిందని పల్లా పేర్కొన్నారు.


మహిళలకు 33శాతం పదవులు

టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు ఓ కొలిక్కి రానుంది. ఈ నెల 10వ తేదీలోపు రాష్ట్ర కమిటీని ప్రకటించేందుకు పార్టీ సిద్ధమవుతోంది. శుక్రవారం ఉండవల్లి నివాసంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబుతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై సుమారు గంటపాటు చర్చించారు. సామాజిక సమీకరణలు, మహిళలకు 33 శాతం పదవులపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసి తుది జాబితాను సిద్ధం చేయాలని చంద్రబాబు.. పల్లాను ఆదేశించారు. గతంలో రాష్ట్ర కమిటీలో సుమారు 200 మందికి పైగా అవకాశం కల్పించారు. ఈసారి మహిళా రిజర్వేషన్‌ అమల్లోకి రానున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కమిటీలోనూ 33 శాతం పదవులను మహిళలకు కేటాయించాలని నిర్ణయించారు. దీంతో ఈసారి కమిటీలో మహిళా నేతల ప్రాధాన్యం గణనీయంగా పెరగనుంది.

Updated Date - Apr 04 , 2026 | 04:25 AM