నాటి చీకట్ల నుంచి వెలుగులోకి!
ABN , Publish Date - Jul 18 , 2026 | 04:18 AM
‘‘రెండేళ్లకు ముందు అంతా చీకటి..విధ్వంసమే ఉండేది. ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
రెండేళ్లలోనే పరిస్థితులను మార్చగలిగాం
కేంద్రం సహకారంతోనే ఇది సాధ్యమైంది
అమరావతి, పోలవరానికి ఆర్థిక చేయూత
మార్చిలో పోలవరం తొలిదశ జాతికి అంకితం
ప్రజల జీవన ప్రమాణాలే ఏ అభివృద్ధికైనా కీలకం
అప్పుడే సమాజం సమగ్రంగా ఎదుగుతుంది
నిర్మల చొరవతో వడ్డీ భారం తగ్గించుకోగలిగాం
ఆమె స్ఫూర్తితో రాష్ట్రంలోని మహిళలు ఎదగాలి
డ్వాక్రా సంఘాలకు సోలార్ పార్కుల బాధ్యత
పారిశ్రామికాభివృద్ధికి చిరునామాగా పల్నాడు
నరసరావుపేట సభలో సీఎం చంద్రబాబు
1,03,246 మందికి రూ.3,216 కోట్లు
నిర్మలతో కలిసి సీఎం భారీ ‘రుణ వితరణ’
ఒక రైతు భవిష్యత్తు మారేందుకు, యువకుల ఆశయ సాధనకు, మహిళా సాధికారతకు, పారిశ్రామికవేత్త కలలకు ‘రుణ వితరణ’ పెట్టుబడిగా నిలుస్తుంది. అప్పు కోసం ఒకప్పుడు సూక్ష్మ రుణ సంస్థలు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఎక్కువగా ఆధారపడేవారు. అధిక వడ్డీ.. చక్రవడ్డీలతో చాలా ఇబ్బందులు పడేవారు. ఆ పరిస్థితులు ప్రభుత్వాలకు కూడా సవాల్‌గా ఉండేవి. నేడు బ్యాంకులు చొరవ చూపిస్తున్నాయి. భారీ రుణ వితరణకు సిద్ధమవుతున్నాయి.
- సీఎం చంద్రబాబు
నరసరావుపేట, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ‘‘రెండేళ్లకు ముందు అంతా చీకటి..విధ్వంసమే ఉండేది. ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయ సహకారాలతోనే ఇదంతా చేయగలుగుతున్నామని తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో శుక్రవారం జరిగిన భారీ రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. 1,03,246 మంది లబ్ధిదారులకు రూ.3,216 కోట్ల రుణాలను వారిరువురూ పంపిణీ చేశారు. అనంతరం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువస్తామని ఎన్నికలకు ముందు నేను, పవన్ కల్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు భరోసా ఇచ్చాం. అలానే ముందుకు వెళుతున్నాం. నాల్గోసారి సీఎం బాధ్యతలు చేపట్టినా, గతంలో ఎప్పుడూ చూడనటువంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను రాష్ట్రంలో చూశాను. ఎక్కడ చూసినా సమస్యల సుడిగుండమే.
ప్రధాని మోదీ చొరవ, నిర్మలా సీతారామన్ సహకారంతోనే ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రం బయటపడింది.’’ అని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రూ.15,000 కోట్లు ఇచ్చి నిలిచిపోయిన అమరావతికి జీవం పోసిందన్నారు. ‘‘కేంద్రం బ్యాంకుల ద్వారా అమరావతి అభివృద్ధికి ఆర్థిక చేయూత అందిస్తోంది. పోలవరానికి రూ.12,155 కోట్లు ఇచ్చారు. పోలవరం 2027 మార్చి లోపు పూర్తి చేసి మొదటి దశను జాతికి అంకితం చేస్తాం. విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్లు ఇచ్చారు. వీబీ జీరామ్‌జీ పథకం కింద రూ.7,700 కోట్లు, జల్‌జీవన్ మిషన్ కింద రూ.28,000 కోట్లు తెచ్చుకోగలిగాం. రాయలసీమను హార్టీ కల్చర్ హబ్‌గా తయారు చేయడానికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెడుతుండగా, ఇందులో రూ.40,000 కోట్లు కేంద్రం సహకారంతో రుణం తీసుకుంటున్నాం. కొంత గ్రాంట్‌గా కూడా ఇచ్చింది. రూ.60,000 కోట్ల విలువైన ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయి. ప్రపంచానికి గ్లోబల్ హబ్‌గా అది మారనుంది.’’ అని చంద్రబాబు తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
పారిశ్రామికాభివృద్ధికి చిరునామా
‘‘పల్నాడు జిల్లాలో పారాల్సింది రక్తం కాదు. ఇక్కడ పారిశ్రామిక విప్లవం రావాలి. ఈ ప్రాంతాన్ని పారిశ్రామికాభివృద్ధికి చిరునామాగా నిలుపుతాం. ఒకప్పుడు బ్యాంకు రుణం పొందడం కష్టంగా ఉండేది. ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం.. ఇటువంటి రుణ మేళాలు నిర్వహించడం గర్వకారణం. ఒక్కొక్క కుటుంబానికి ఐదు మందిని లెక్కిస్తే ఈ జిల్లాలో ఐదు లక్షల మందికి బ్యాంకుల నుంచి రుణాలు అందాయి. వ్యవసాయం కోసం 84,393 మందికి రూ.2,363 కోట్లు, ఎంఎస్ఎంఈ రంగం నుంచి 4,449 యూనిట్లకు రూ.335 కోట్లు; గృహ, వాహన, సౌర విద్యుత్ వంటి వాటికి సంబంధించి 10,228 ఖాతాలకు రూ.624 కోట్లు, వివిధ పథకాల కింద రూ.2500 కోట్లు పంపిణీ చేశాం. బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలే కాదు...రాష్ట్రాభివృద్ధిలో కూడా భాగస్వాములు.’’
అందరూ సహకరించాలి
‘‘స్వర్ణాంధ్ర- 2047లో భాగంగా..ఆనాటికి రాష్ట్రంలో ప్రతిఒక్కరూ ఆర్థికంగా బాగుండాలని, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం. దీనికి ప్రతిఒక్కరూ సహకరించాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించడానికి అనునిత్యం కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు పోతున్నాం. ఏపీలో 10 లక్షల డ్వాక్రా సంఘాలు, 1.10 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. ఒక్కో కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త తయారు కావాలి. ఇది మహిళలతోనే ప్రారంభం కావాలి. గత ఏడాది లక్ష మంది ఎంఎ్‌సఎంఈలు పెట్టారు. ఈ ఏడాది ఐదు లక్షల మందిని ఎంఎ్‌సఎంఈలుగా తయారు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ఏడాది 1.67 లక్షలమందికి రుణాలు ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం.’’ అని చంద్రబాబు తెలిపారు. కాగా, ప్రతి మండలంలో డ్వాక్రా సంఘాలకు ఒక సోలార్ పార్కు ఇవ్వాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరగా, సీఎం అంగీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు చదలవాడ అరవిందబాబు, కన్నా లక్ష్మీనారాయణ, జూలకంటి బ్రహ్మారెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, భాష్యం ప్రవీణ్, ఎంఎల్‌సీ మర్రి రాజశేఖర్, కలెక్టర్ కృతికా శుక్లా, జేసీ సంజనా సింహా, యూనియన్ బ్యాంక్ ఎండీ, సీఈవో ఆశీష్ పాండే, ఎన్‌ఎల్‌బీసీ కన్వీనర్ కె.శ్రీధర్‌బాబు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
నిర్మల చొరవతో..
నిర్మలా సీతారామన్‌ది క్రియేటివ్ మైండ్ అని, చాలా సున్నితంగా అలోచిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘రాష్ట్రం తీసుకున్న అప్పులకు వడ్డీ రేటు ఎక్కువగా ఉండేది. వాటిని 12 నుంచి 13 శాతం నుంచి 8 నుంచి 9 శాతానికి తగ్గించుకున్నాం. దీని వలన ఏడాదికి రూ.1,530 కోట్లు ఆదా అవుతోంది. నిర్మలా సీతారామన్ చొరవ వల్లే ఇది సాధ్యమైంది. బ్యాంకింగ్ వ్యవస్థలో ఆమె సమూల మార్పులు తీసుకొచ్చారు. ఎన్నో సంస్కరణలు తెచ్చారు’’ అని సీఎం కొనియాడారు. కాగా, రాబోయే రోజుల్లో ఆరు జిల్లాల్లో రుణ వితరణ మేళాను నిర్వహించాలని చంద్రబాబు కోరగా, ఆమె ఆంగీకరించారు. త్వరలోనే మూడు నెలలకు ఒకటి చొప్పున ఆరు జిల్లాల్లో నిర్వహిస్తామని తెలిపారు.