Share News

కుటుంబాలకు సంక్షేమ లేఖలు

ABN , Publish Date - Mar 13 , 2026 | 03:53 AM

వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా పేదలకు కలిగే మేలు ఏమిటో మదింపు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ దిశగా కసరత్తు చేయాలని ప్రభుత్వ శాఖలు...

కుటుంబాలకు సంక్షేమ లేఖలు

  • ఒక్కో కుటుంబానికి పథకాల మేలు ఎంత చేకూరిందనేది లెక్క తీయండి

  • ఆ వివరాలతో వారికి లేఖలు రాయండి

  • కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు

  • భవిష్యత్తులో కుటుంబం యూనిట్‌గా సంక్షేమం అందించాల్సి రావొచ్చని వ్యాఖ్య

అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా పేదలకు కలిగే మేలు ఏమిటో మదింపు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ దిశగా కసరత్తు చేయాలని ప్రభుత్వ శాఖలు, కలెక్టర్‌లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అభివృద్ధితో పాటు, సంక్షేమం కూడా ప్రభుత్వానికి ముఖ్యమని, ఈ రంగంలో జరుగుతున్న మేలును ప్రజలకు సవివరంగా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రెండోరోజు కలెక్టర్ల సమావేశంలో భాగంగా సంక్షేమ పథకాలపై ఆయా శాఖల కార్యదర్శులు ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని మాట్లాడారు. ‘‘ సంక్షేమ రంగంలో అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండాలి. నలుగురైదుగురు సభ్యులున్న కుటుంబానికి పింఛన్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్త్రీ శక్తి, తల్లికి వందనం, దీపం ఉచిత సిలిండర్‌, ఆరోగ్యశ్రీ , హౌసింగ్‌, ఇతర సంక్షేమ పథకాల ద్వారా ఎంతమేర ఆర్థిక మేలు జరిగిందో లెక్క తీసి ఆ కుటుంబానికి సవివరంగా లెక్కలతో సహా వివరించాలి. దానివల్ల తమ మేలుకోసం ప్రభుత్వం చేస్తున్న కృషి ఏమిటో వారు తెలుసుకుంటారు. ఈ దిశగా సంక్షేమ శాఖలు విధి విధానాలు రూపొందించాలి. రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలకు కుటుంబం యూనిట్‌గా పరిగణించే పరిస్థితి వస్తుంది. కాబట్టి, సగటున ఒక్కో కుటుంబానికి కలుగుతున్న మేలు ఎంతో ప్రభుత్వం స్పష్టంగా చెప్పగలిగేలా వివరాలు సిద్ధం చేయాలి. ఈ మేరకు అధికారులు అధికారికంగా లేఖ రాయాలి’’ అని ఆదేశించారు. కాగా, వచ్చే రెండేళ్లలో అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇస్తామని సీఎం చెప్పారు. ఉగాదికి 2.50 లక్షల గృహ ప్రవేశాలు చేస్తామని తెలిపారు. ప్రతి ఇంటికీ 18 నెలల వ్యవధిలో ఇంటర్నెట్‌ అందించే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు.


వేసవిలో జాగ్రత్త

ఈ సారి వేసవి తీవ్రంగా ఉండనుందని సంకేతాలు అందుతున్నాయని సీఎం తెలిపారు. వేసవిలో మరింత అప్రమత్తంగా ఉంటూ, ముందస్తు జాగ్రత్తలు, ఇతర ఉపశమన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. వాతావరణ మార్పులకు తగినట్లుగా ఉపాధి హామీ పనివేళలను మార్చుకోవాలని కోరారు. ఎండ తీవ్రతను బట్టి మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వేసవి ముగిసే వరకు 3-4 నెలల పాటు జిల్లాల్లో ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు, విపత్తుల నిర్వహణకు నోడల్‌ అధికారులను ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలను పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆయన సూచించారు.

Updated Date - Mar 13 , 2026 | 03:54 AM