నేనీ సీటులో ఉండగా.. అవినీతి జరగదు
ABN , Publish Date - Aug 23 , 2026 | 04:10 AM
తాను సీఎం సీటులో కూర్చున్నంత కాలం అవినీతి జరగదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ‘‘మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించాం. ఎక్కడా అవకతవకలు జరగలేదు.
అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీ
అడ్డుకునేందుకు 350 పిటిషన్లు వేశారు
ప్రక్రియ పూర్తయిన ఏడాది తర్వాత ఆరోపణలు
స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం టీడీపీ, ఎన్డీయే పాలసీ
ఇష్టానుసారం గ్రూప్-1 పేపర్ మూల్యాంకనం
నాటి దుర్మార్గాల్ని సరి చేయడానికే రెండున్నరేళ్లు
భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే ఖబడ్దార్
భోగాపురంతో ఉత్తరాంధ్ర ఆశలు, కలలకు రెక్కలు
డేటా సెంటర్స్ రాకముందే విమర్శలు మొదలెట్టారు
‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో సీఎం
రాష్ట్రంలో పనిచేస్తున్న టీచర్లలో 80 శాతం మంది నేను భర్తీ చేసిన డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాఽధించినవారే. డీఎస్సీ అంటేనే టీడీపీ. ఒకప్పుడు బదిలీల కోసం టీచర్లు నాయకుల చుట్టూ తిరిగేవారు. అటువంటి పరిస్థితిని తప్పించి, వారి గౌరవం పెంచాను. అలాంటి ఉపాధ్యాయులను అగౌరవపరిచేలా తప్పు చేశారంటూ ప్రచారం చేస్తున్నారు.
- సీఎం చంద్రబాబు
కె.కోటపాడు (అనకాపల్లి జిల్లా), ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): తాను సీఎం సీటులో కూర్చున్నంత కాలం అవినీతి జరగదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ‘‘మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించాం. ఎక్కడా అవకతవకలు జరగలేదు. డీఎస్సీ అంటే తెలుగుదేశం పార్టీ’’ అని సీఎం అన్నారు. కొందరు డీఎస్సీ పూర్తి కాకూడదన్న ఉద్దేశంతో 350 పిటిషన్లు వేశారని, నియామక ప్రక్రియ పూర్తయిన ఏడాది తరువాత ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం ఎం.కోడూరులో శనివారం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పిల్లలు చదువుకోవడమే కాకుండా క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో రెండు శాతం ఉన్న స్పోర్ట్స్ కోటాను మూడు శాతానికి పెంచినట్టు వెల్లడించారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిస్తే ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారని, అది టీడీపీ, ఎన్‌డీఏ పాలసీ అని స్పష్టం చేశారు. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేశామని, ఎక్కడా తేడా జరగలేదని (డీవియేషన్స్) చంద్రబాబు తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో ఇష్టానుసారంగా చేశారని, కోర్టులు తప్పుబట్టినా లెక్క చేయలేదన్నారు. ఈ వ్యవహారంలో జగన్ పీఏ వందల కోట్ల రూపాయలు సంపాదించారని, దానికి సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఇవన్నీ బయటకు వస్తాయనే, ఏడాది తరువాత మెగా డీఎస్సీపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. తప్పు చేసినవాళ్లు ఎప్పటికీ తప్పించుకోలేరని సీఎం హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
ప్రజలు నిజాయితీగా ఉండాలి..
‘‘నేను రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాను. కానీ, ఎన్నికలు వచ్చేసరికి డబ్బులు ఇచ్చిన వాళ్లకు ఓట్లేయాలని కొందరు భావిస్తారు. ఈ ఆలోచన మారాలి. ప్రజలు నీతి, నిజాయితీతో ఉంటే రాజకీయాలు చేసే వ్యక్తులు తప్పులు చేయకుండా ఉంటారు. అందుకే ఎన్నికల్లో డబ్బు ప్రభావం లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. అప్పుడే ఏపీ స్వర్ణాంధ్ర అవుతుంది. అదే సమయంలో రాష్ట్రంలో అరాచకాలు పోవాలి. గొడ్డలి పార్టీ ఐదేళ్లూ విధ్వంసాన్ని నమ్ముకుని నేరాలు, ఘోరాలు చేసింది. ఇప్పుడూ వాటినే నమ్ముకోవడం ప్రమాదకరం. వైసీపీ ఐదేళ్ల పాలనలో నకిలీ మద్యం వల్ల 30 వేల మంది చనిపోయారు. లక్షల మంది అనారోగ్యం పాలయ్యారన్నారు. నకిలీ మద్యంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి భూములను 22ఏ కింద పెట్టి నాడు కబ్జా చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నాకు రెండేళ్లు పట్టింది. ఇప్పటికీ సగం పూర్తికావాల్సి ఉంది. హిందూ దేవాలయాలను, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా నాడు వ్యవహరించారు. దేవాలయాల జోలికి వస్తే ఖబడ్దార్.’’
అదే మాకు పెద్ద కిక్కు..
‘‘హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం. రాజకీయాల్లో చేసిన పనికి కృతజ్ఞతను కోరుకుంటాం. కృతజ్ఞత, అభిమానాన్ని కనబరిస్తే అదే అతి పెద్ద కిక్. ఇన్ని చేసిన నేను వచ్చినప్పుడు మీరు (ప్రజలను ఉద్దేశించి) రాకపోతే నీరుగారిపోతాను. ఈరోజు మీరు పలికిన స్వాగతం, జేజేలు నాలో మరింత నమ్మకం, విశ్వాసాన్ని పెంచాయి. ఇటీవల ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురానికే పరిమితం కాదు. అది ఉత్తరాంధ్ర ఆశలు, కలలకు రెక్కలు. ఇక్కడ పిల్లలు మాట్లాడుతూ, డేటా సెంటర్స్, క్వాంటం కంప్యూటింగ్ గురించి చెప్పడం ఆనందంగా ఉంది. నాకు తెలియని అనేక విషయాలను పిల్లలు చెప్పడం గొప్పగా ఉంది. ప్రపంచంలోనే తొలిసారి క్వాంటం కంప్యూటింగ్‌ను భారత్‌కు, అమరావతికి తీసుకురావడం రాష్ట్రానికే గర్వకారణం. గూగుల్ డేటా సెంటర్ రాకుండానే కొందరు విమర్శలు చేస్తున్నారు. నీళ్లు లేవంటూ ఆరోపణలు చేస్తున్నారు. నేను ఒక డేటా సెంటర్ ప్రారంభిస్తే ఇప్పుడు ఐదు డేటా సెంటర్లు వచ్చాయి. రానున్న రోజుల్లో కొన్ని లక్షల మంది ఏఐ ప్రొఫెషనల్స్ తయారవుతారు. అటువంటి ఉద్యోగాలు వస్తే ఆకాశమే హద్దుగా ఆదాయం లభిస్తుంది. మరోవైపు నీటి సమస్య లేకుండా 3.5 టీఎంసీలను పోలవరం నుంచి గ్రావిటీతో తీసుకువచ్చి అనకాపల్లి జిల్లాలోని ప్రతి చెరువు, రిజర్వాయర్ నింపే బాధ్యతను తీసుకుంటాం.’’
అభివృద్ధి అంటే ఆరోగ్యకరమైన జీవితాలు
‘‘అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురావడం మాత్రమే కాదు. స్వచ్ఛమైన ప్రాంతాలు, ఆరోగ్యకరమైన జీవితాలు, పర్యావరణ పరిరక్షణ కూడా దాని కిందకే వస్తాయి. 2047 నాటికి ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ అగ్రదేశంగా ఆవిర్భవిస్తుంది. అదే సమయంలో ఏపీ కూడా 2047 నాటికి రూ.50 లక్షలు తలసరి ఆదాయం సాధించే ప్రణాళికలను సిద్ధం చేశాం. మూడున్నర లక్షలు ఉన్న తలసరి ఆదాయాన్ని రూ.50 లక్షలకు పెంచుతాం. పరిశ్రమలకు, నాలెడ్జ్ ఎకానమీకి అనకాపల్లి కేంద్రంగా తయారవ్వనుంది. ప్రతి గ్రామం జీరో వేస్ట్ పంచాయతీగా తయారు కావాలి. రాష్ట్రంలో 143 లక్షల మెట్రిక్ టన్నుల వేస్ట్‌ను డిస్పోజ్ చేశాం. పర్యావరణం, ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు నేను ఏడాదిన్నర కాలం నుంచి భిన్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాను. ప్రతి కుటుంబానికీ నాలుగైదు సంక్షేమ పథకాలు అందేలా చేశాం. పథకాలు అమలు చేస్తూనే రెండింతలు అభివృద్ధి చేసేలా ముందుకు సాగుతున్నాం’’ అని సీఎం చంద్రబాబు వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్, మంత్రులు పి.నారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, ఎంపీలు సీఎం రమేశ్, చింతకాయల విజయ్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేశ్‌బాబు, సుందరపు విజయ్ కుమార్, కేఎస్ఎన్‌ఎస్ రాజు, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్‌లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే లలితకుమారి కుమార్తెకు బాబు ఆశీర్వాదం
విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో శనివారం సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈనెల 27న వివాహం కానున్న ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, బాలాజీ అప్పల రామప్రసాద్ దంపతుల కుమార్తె అస్మిత, కాబోయే అల్లుడు చప్ప ఎర్ని పవన్‌మౌళిలని ఆయన ఆశీర్వదించారు. అనంతరం కోళ్ల కుటుంబ సభ్యులు ఎవరెక్కడ ఉన్నారో ఆరా తీశారు. ఎమ్మెల్యే మరిది దివంగత కోళ్ల మోహన్ కుమార్తె కుందన వైకల్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆమె వైద్యానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పది నిమిషాలు అక్కడ గడిపిన ఆయన, తిరిగి విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు.