అమరావతి అంటేనే జగన్‌కు కంపరం!
ABN , Publish Date - Apr 03 , 2026 | 06:04 AM
అమరావతి అనేది రాష్ట్ర ప్రజలకు సెంటిమెంట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం ఎన్డీయే నేతలతో సీఎం టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు.
ఆ పేరు పలకడానికీ ఆయన ఇష్టపడరు
అందుకే మావిగన్ అంటూ వింత ప్రతిపాదనలు
ఎన్డీయే నేతలతో సీఎం టెలీ కాన్ఫరెన్స్
అమరావతి, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): అమరావతి అనేది రాష్ట్ర ప్రజలకు సెంటిమెంట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. గురువారం ఎన్డీయే నేతలతో సీఎం టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు. ఈ సందర్భంగా అమరావతికి చట్టబద్ధత కల్పించడంలో ఎదురైన పరిణామాలను చర్చించారు. వైసీపీ పాలన వల్ల రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా పోయిందన్నారు. ఇప్పటికీ రాజధాని విషయంలో వారు చిత్రంగా ప్రవర్తిస్తున్నారని, మావిగన్ అంటూ మాట్లాడుతున్నారని, అమరావతిపై వారికున్న ద్వేషానికి ఇది పరాకాష్ట అని సీఎం వ్యాఖ్యానించారు. అమరావతి పేరు పలకడానికి కూడా జగన్ ఇష్టపడటం లేదన్నారు. అందుకే మావిగన్ అంటూ ఓ వింత పేరును తీసుకొచ్చారని పేర్కొన్నారు. గతంలోనూ ‘ఎస్‌ఆర్‌ఎం అమరావతి’ అని యూనివర్సిటీ పేరు ఉంటే దాన్ని ‘ఎస్‌ఆర్‌ఎం’గా మార్పించారని తెలిపారు. అమరావతి పేరు వింటే జగన్‌కు కంపరంగా ఉండి, నిత్యం విషం కక్కుతున్నారని అన్నారు. అమరావతిపై జగన్ వైఖరి భవిష్యత్తులోనూ మారదని స్పష్టమైపోయిందన్నారు. రాష్ట్ర ప్రజలందరిలోనూ ‘మా రాజధాని అమరావతి’ అనే భావన రావాలి, ప్రతి ఒక్కరూ వారికి నచ్చిన రీతిలో రాజధాని సంబరాలు జరుపుకొనే సమయం ఇదని సీఎం పేర్కొన్నారు. ‘గత ఐదేళ్లూ ఎక్కడికి వెళ్లినా.. మీకు మూడు రాజధానులా! అంటూ ఎగతాళిగా మాట్లాడేవారు. ఇప్పుడు సగర్వంగా మా ఏకైక రాజధాని అమరావతి అని చెప్పుకుందాం’ అని పిలుపునిచ్చారు. టెలీ కాన్ఫరెన్సులో బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.