Share News

మొన్న విశాఖ.. నిన్న మావిగన్‌.. నేడు విజయవాడ..

ABN , Publish Date - Jul 04 , 2026 | 04:14 AM

మతిస్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయాల్సిన పరిస్థితి గతంలో ఎన్నడూ తనకు తలెత్తలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘జగన్‌ సీఎం అయ్యాక మూడు రాజధానులన్నారు.

మొన్న విశాఖ.. నిన్న మావిగన్‌.. నేడు విజయవాడ..

  • రేపు ఏమంటారో? మతిస్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం.. నా రాజకీయ చరిత్రలోనే ఇది తొలిసారి

  • అమరావతే రాజధాని... ఆంధ్రులు గర్వించేలా నిర్మిస్తాం

  • స్టీల్‌ ప్లాంట్‌కు 2సార్లు జగన్‌ మోసపు శంకుస్థాపనలు: సీఎం

కడప, జూలై 3 (ఆంధ్రజ్యోతి): మతిస్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయాల్సిన పరిస్థితి గతంలో ఎన్నడూ తనకు తలెత్తలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ‘‘జగన్‌ సీఎం అయ్యాక మూడు రాజధానులన్నారు. అధికారం పోయాక, కేంద్ర చట్టం తర్వాత మావిగన్‌ అన్నారు. నిన్న విజయవాడ అన్నారు. రేపు ఏమంటారో..’’ అని ఎద్దేవా చేశారు. సున్నపురాళ్లపల్లెలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎవరి వల్ల రాయలసీమకు మంచి జరిగింది.. ఎవరి వల్ల నష్టం జరిగిందనేది అర్థం చేసుకోవాలన్నారు. ‘‘నేను ముఖ్యమంత్రి అయ్యాక కియా కంపెనీ తీసుకొస్తే, అది 19లక్షల కార్లు ఉత్పత్తి చేసింది. అందులో మూడు లక్షల కార్లు 90 దేశాలకు ఎగుమతి చేశారు. కానీ, నాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి బ్రహ్మణీ స్టీల్‌ కోసమంటూ 2007లో 14వేల ఎకరాలు ఇచ్చారు. ప్లాంట్‌ వచ్చేసిందన్నట్టే భ్రమ కల్పించారు. ఎయిర్‌పోర్టు కడతామన్నారు. అవేవీ జరగలేదు. ఓబులాపురం గనుల పేరు చెప్పి, దోపిడీ చేసి విదేశాలకు ఎగుమతి చేశారు. డబ్బు చేసుకున్నారు. ఆ వ్యవహారంలో తప్పు చేసిన వారు జైలుకెళ్లారు’’ అని వివరించారు. రాయలసీమలో ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టునూ జగన్‌ పూర్తి చేయలేకపోయారని, పులివెందులలో ఒక్క ఎకరాకు కూడా నీరు ఇవ్వలేకపోయారన్నారు. ‘‘హింసా రాజకీయాలు చేయకూడదు. నేను తీవ్రవాదులతో సమాజం కోసం పోరాడాను. ఇటీవల గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లు వచ్చాయి. ఈ జిల్లాకు చెందిన వ్యక్తే ఇప్పుడు గంజాయి బ్యాచ్‌ను వెనకేసుకొస్తున్నారు. శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. రోడ్డు మీదకు పోయిన ఆడబిడ్డ తిరిగి రాలేని పరిస్థితి ఉంటే ఎన్ని లక్షల తలసరి ఆదాయాన్ని సంపాదించినా నిరర్థకమే’’ అని అన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 04:16 AM