Share News

ప్రతి భారతీయుడూ గర్వపడే క్షణం

ABN , Publish Date - Jul 19 , 2026 | 02:55 AM

విక్రమ్‌-1 రాకెట్‌ విజయవంతంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

ప్రతి భారతీయుడూ గర్వపడే క్షణం

  • ‘విక్రమ్‌-1’ విజయంపై చంద్రబాబు హర్షం

  • శ్రీహరికోటలోని షార్‌లో రాకెట్‌ ప్రయోగాన్ని

  • కుమారుడితో కలిసి వీక్షించిన లోకేశ్‌

అమరావతి/సూళ్లూరుపేట, జూలై 18(ఆంధ్రజ్యోతి): విక్రమ్‌-1 రాకెట్‌ విజయవంతంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. తొలి ప్రయోగంలోనే విజయవంతంగా కక్ష్యలోకి చేరడంతో భారత్‌ మరో చారిత్రక మైలురాయిని అధిగమించిందని పేర్కొన్నారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న స్కైరూట్‌ ఏరోస్పేస్‌, ఇస్రో, ఇన్‌స్పేస్‌, ఎన్‌ఎ్‌సఐఎల్‌కు శనివారం ‘ఎక్స్‌’ వేదికగా సీఎం అభినందనలు తెలిపారు. అగ్ర దేశాలతో పోటీపడే స్థాయికి భారత ప్రైవేటు అంతరిక్ష రంగం ఎదిగిందనే దాన్ని ఈ విజయం నిరూపించిందన్నారు. ఇది భారత అంతరిక్ష రంగంలో ఇది ఒక నూతన శకానికి నాంది అని పేర్కొన్నారు. ఈ విజయం ప్రతి భారతీయుడు గర్వపడే క్షణమని, భావితరాల యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.


ఏపీకి రండి.. స్కైరూట్‌కు లోకేశ్‌ ఆహ్వానం

విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగాన్ని మంత్రి లోకేశ్‌ కుమారుడు దేవాంశ్‌తో కలిసి ప్రత్యక్షంగా వీక్షించారు. శనివారం షార్‌కు వెళ్లిన ఆయన.. మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి రాకెట్‌ గమనాన్ని ఆసక్తిగా గమనించారు. ప్రయోగం విజయం సాధించిన అనంతరం లోకేశ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచే మాట్లాడుతూ.. స్కైరూట్‌ సంస్థ తొలి ప్రయత్నంలోనే రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడం వారి పనితీరుకు నిదర్శనమని ప్రశంసించారు. ఇదే స్పూర్తితో మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని ఆకాంక్షించారు. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో కూడా కంపెనీ పెట్టేందుకు అన్ని వనరులు పుష్కలంగా ఉన్నాయని, ప్రభుత్వం పరంగా కూడా అన్ని సహకారాలు అందించి ప్రోత్సహిస్తామన్నారు. ఏపీకి రావాలని ఆహ్వానించారు. ఇప్పటికే వైజాగ్‌లో ఆ కంపెనీ ప్రతినిధులను కలిశామని తెలిపారు.

Updated Date - Jul 19 , 2026 | 02:57 AM