Share News

అవినీతికి చెక్

ABN , Publish Date - May 19 , 2026 | 04:02 AM

పాలనలో అవినీతి అనేది కనిపించకూడదని, ప్రతి ఉద్యోగి పారదర్శకతతో విధులు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

అవినీతికి చెక్

  • ప్రతి ఉద్యోగి పారదర్శకతతో పనిచేయాలి

  • బాగా పనిచేసినవారిని గౌరవిస్తాం

  • 2047-స్వర్ణాంధ్ర సాధనకు పది సూత్రాలు

  • ఉద్యోగుల సహకారం వల్లే ‘బెస్ట్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ వచ్చింది

  • అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

  • వేసవిలో తాగునీటి సమస్య రాకూడదు

  • 80 శాతం మంది ఉద్యోగుల పనితీరు భేష్‌

  • సేవల్లో మొదటి మూడు స్థానాల్లో నెల్లూరు, తూర్పుగోదావరి, పల్నాడు కలెక్టర్లు

  • ఒక టీమ్‌గా పనిచేసి అభివృద్ధి సాధించాలి

  • ప్రభుత్వంపై నమ్మకం పెరిగేలా పనిచేయాలి

  • జిల్లాల కలెక్టర్లు, 40 వేల మంది ఉద్యోగులతో జంబో టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు

  • సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే ధ్యేయం

అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): పాలనలో అవినీతి అనేది కనిపించకూడదని, ప్రతి ఉద్యోగి పారదర్శకతతో విధులు నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతి ఒక్కరి పనితీరును విశ్లేషిస్తున్నామని, బాగా పనిచేసినవారిని గౌరవిస్తామని స్పష్టం చేశారు. సోమవారం వెలగపూడి సచివాలయంలోని రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ(ఆర్టీజీఎస్‌) వేదికగా జిల్లాల కలెక్టర్లతో పాటు 40,000 మంది ఉద్యోగులతో సీఎం జంబో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్ల నుంచి కింది స్థాయి ఉద్యోగుల దాకా ఇందులో భాగస్వాములయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ... సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సహకారం వల్లే ‘బెస్ట్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు వచ్చిందని చెప్పారు. 2047-స్వర్ణాంధ్ర సాధనకు లక్ష్యాలను పెట్టుకున్నామని, పది సూత్రాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ 23 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, 24 లక్షల ఉద్యోగావకాశాలు వచ్చాయని వెల్లడించారు.


పింఛన్ల పంపిణీ టాప్‌

పట్టణాలు, గ్రామాల్లో వేసవిలో తాగు నీటి సమస్య రాకుండా చూడాలని ఉద్యోగులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఉద్యోగులను కోరారు. ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వంపై ఉద్యోగుల్లోనూ, ప్రజల్లోనూ నమ్మకం పెరిగిందని అన్నారు. ప్రభుత్వ సేవలపై తీసుకుంటున్న ఫీడ్‌బ్యాక్‌ గణాంకాలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ సేవల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. ప్రభుత్వ సేవలు అందించడమే కాకుండా ప్రజలతో సఖ్యతగా మెలుగుతుండటం వల్లే పెన్షన్ల పంపిణీలో టాప్‌లో ఉన్నామని సీఎం అన్నారు. పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో ఏమైనా గ్యాప్‌ ఉంటే జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాలని సూచించారు. ఒక టీమ్‌గా పనిచేసి అభివృద్ధి సాధించాలన్నారు. జిల్లాల్లో 80 శాతం మంది ఉద్యోగుల పనితీరు బాగుందని అభినందించారు. అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆర్థిక, ఆర్థికేతర సమస్యలుగా విభజించుకుని పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. ఆర్థికేతర సమస్యలన్నీ 100 శాతం పరిష్కరించాలన్నారు.


మంచి సూచనలు పాటిస్తాం

జంబో టెలీకాన్ఫరెన్స్‌లో తమకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణానికి సంబంధించి కాకినాడ జిల్లాకు చెందిన ఉద్యోగి మంచి సూచనలు చేశారంటూ సీఎం అభినందించారు. ఈ సూచనలు పాటిస్తామంటూ హామీ ఇచ్చారు. ప్రజలకు సంతృప్తికర సేవలు అందించడంలో నెల్లూరు, తూర్పుగోదావరి, పల్నాడు జిల్లాల కలెక్టర్లు మొదటి మూడు స్థానాల్లో నిలిచారని ప్రశంసించారు. ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి నెల్లూరు జిల్లా కలెక్టర్‌ చేసిన ప్రయోగాన్ని చూసి ప్రతి నియోజకవర్గంలోనూ నాలుగు సార్లు పర్యటనలు చేసేలా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.

పాలనలో వేగం పెరగాలి

గూగుల్‌, ఆర్సెల్లార్‌ మిట్టల్‌, ఏఎంసీఏ వంటి కీలక ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయని ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వివరించారు. త్వరలో బీపీసీఎల్‌ వంటి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టు ద్వారా పుట్టపర్తి-బెంగళూరు మధ్య ఏరో స్పేస్‌ సిటీగా అభివృద్ధి జరుగుతుందన్నారు. స్పీడ్‌ ఆఫ్‌ డెలివరింగ్‌ గవర్నెన్స్‌ అన్ని చోట్లా రావాలని ఉద్యోగులకు స్పష్టం చేశారు. రక్షణ శాఖకు చెందిన ఏఎంసీఏ ప్రాజెక్టుకు 36 రోజుల్లో అనుమతులు ఇచ్చి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టామని చంద్రబాబు వివరించారు. ఏఎంసీఏ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం స్పందించిన తీరుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందన్నారు.

Updated Date - May 19 , 2026 | 05:46 AM