హైదరాబాద్ ప్లస్‌గా అమరావతి
ABN , Publish Date - Jun 21 , 2026 | 04:26 AM
హైదరాబాద్ ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ అవకాశాన్ని ఆ భగవంతుడు తనకు ఇచ్చాడన్నారు.
హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆధ్యాత్మిక నగరంగా అమరావతి
ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప బహుమతి యోగా
ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలనేదే మా లక్ష్యం..
జాతీయ మీడియాతో సీఎం చంద్రబాబు
ఉండవల్లి గుహల వద్ద రామ్‌దేవ్‌తో యోగాంధ్ర
చంద్రబాబు తరహాలో ప్రతి సీఎం పని చేస్తే వికసిత్ భారత్-2047 లక్ష్యం ముందే సాకారం
చంద్రబాబు యోగి, కర్మయోగి: రామ్‌దేవ్
తాడేపల్లి, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ అవకాశాన్ని ఆ భగవంతుడు తనకు ఇచ్చాడన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఉండవల్లి గుహల వద్ద శనివారం యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాం ధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భం గా జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆధ్యాత్మిక నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతానని ఉద్ఘాటించారు. సైబరాబాద్, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక ఆదాయం తెచ్చి పెడుతున్నాయన్నారు. అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్ ఎదిగిందని, టెక్నాలజీని అనుసంధానించి ఓ అధునాతన రాజధానిని నిర్మిస్తున్నామని అన్నారు. విశాఖలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని, ఈ ఏడాది యోగా డేను అమరావతిలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రతి ఇంటికి యోగా ను తీసుకువెళ్లాలనేదే తమ లక్ష్యమని, ఓ మిషన్ మోడ్‌లో యోగాను అందరికి చేరువ చేస్తామని తెలిపారు. యోగాతో రామ్‌దేవ్ ప్రపంచ వ్యాప్తం గా అందరికీ చేరువయ్యారని, యోగా ను ఇంటింటికి తీసుకెళ్లేలా ఆయనతో కలిసి ఏపీ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. యోగా ప్రపంచానికి భారత్ ఇచ్చిన ఓ అమూల్యమైన బహుమతి అని అన్నారు. ఇలాంటి యోగాతోనే మానసిక ఒత్తిడిని దూరం చేసుకుని ఏకాగ్రతను సాధించగలమన్నారు. టెక్నాలజీ ఒక్కటే సంపద తెచ్చిపెట్టదని, భారత్‌కు ఉన్న అత్యంత అమూల్యమైన శక్తి ఆధ్యాత్మిక సంస్కృతి అని గుర్తు చేశారు.
యోగా దేశానికి గర్వకారణం: రామ్‌దేవ్
యోగా మన దేశానికి గర్వకారణమని యోగా గురువు బాబా రామ్‌దేవ్ అన్నారు. యోగా డేకు సీఎం చంద్రబాబు తనను ముఖ్యఅతిథిగా రమ్మన్నారని, కానీ తాను యోగా అతిథిగా వచ్చానని చెప్పా రు. చంద్రబాబు తరహాలో ప్రతి సీఎం పని చేస్తే వికసిత్ భారత్- 2047 లక్ష్యం ముందుగానే సాకారమవుతుందన్నారు. దేవతల రాజధాని అమరావతి ఇప్పుడు యోగా రాజధాని అయిందన్నారు. స్విట్జర్లాండ్ వంటి అందాలు అమరావతిలో ఉన్నాయని, ఇక్కడి అరటిపం డ్లు, మామిడి పండ్లు రుచిగా ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు ప్రకృ తి, సాంస్కృతిక, యోగా సర్వ జన ప్రేమికుడని అన్నా రు. ఏక్ భారత్.. శ్రేష్ట భారత్ అనే నినాదంతో ప్రధాని మోదీ పని చేస్తున్నారని, దానికి చంద్రబాబు సహకరిస్తున్నారని చెప్పారు. తొలుత రామ్‌దేవ్ ఆసనాలు వేసి విచ్చేసిన వారితో యోగాసనాలు వేయించారు.
జీవితంలో యోగా అంతర్భాగం కావాలి: రామ్‌దేవ్
విజయవాడ అర్బన్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసాన్ని పొందవచ్చని ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ అన్నారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కృష్ణా నది తీరంలో ఉన్న డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు ఆరోగ్యాలయంలో రామ్‌దేవ్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఆయనకు యోగా అండ్ నేచురోపతి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రామ్‌దేవ్ యోగాసనాలు, ప్రాణాయామాలను ప్రదర్శిస్తూ యోగా యొక్క గొప్పతనాన్ని వివరించారు. యోగా అనేది వ్యాయామ విధానం మాత్రమే కాకుండా ప్రతి మనిషి జీవితంలో అంతర్భాగం కావాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా పతంజలి యోగా పీఠానికి చెందిన 50 మంది బాలబాలికలు అత్యున్నత స్థాయి అడ్వాన్స్‌డ్ యోగా, పవర్ యోగా విన్యాసాలను ప్రదర్శించారు. అనంతరం డాక్టర్ విశాల, డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు.. రామ్‌దేవ్‌ను ఘనంగా సత్కరించారు.