Share News

‘డబుల్‌ ఇంజన్‌’తోనే బుల్లెట్‌ వేగంతో అభివృద్ధి!

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:09 AM

డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తోనే బుల్లెట్‌ వేగంతో అభివృద్ధి జరుగుతుందని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తమిళనాట డీఎంకే లాంటి పార్టీల వల్లే అభివృద్ధి జరగడం లేదని, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే..

‘డబుల్‌ ఇంజన్‌’తోనే బుల్లెట్‌ వేగంతో అభివృద్ధి!

  • సత్వర అభివృద్ధి అప్పుడే సాధ్యం

  • ఎన్డీయేతో తమిళనాడుకు పూర్వ వైభవం

  • డీఎంకే వల్ల రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం

  • కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి పరుగులు: సీఎం చంద్రబాబు

  • ప్రజలు ఆలోచించి.. ఓటేయాలని పిలుపు

  • రిజర్వేషన్‌ బిల్లుపై వ్యతిరేక ఓటుతో

  • మహిళలకు డీఎంకే, కాంగ్రెస్‌ ద్రోహం

  • చెన్నైలో మీడియాతో టీడీపీ అధినేత

  • సాత్తూరులో బాబు రోడ్‌షోకు భారీ స్పందన

చెన్నై, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తోనే బుల్లెట్‌ వేగంతో అభివృద్ధి జరుగుతుందని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తమిళనాట డీఎంకే లాంటి పార్టీల వల్లే అభివృద్ధి జరగడం లేదని, రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే.. రాష్ట్ర ప్రజలు తెలివిగా ఆలోచించి, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులకు ఓటువేయాలని విజ్ఞప్తి చేశారు. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాన్ని ఎన్నుకొనే అవకాశాన్ని చేజార్చుకోవద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. మంగళవారం చెన్నైలో కేంద్రమంత్రులు పీయూష్‌ గోయల్‌, కె.రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో అభివృద్ధి ఆగిపోయిందని, చెన్నై లాంటి నగరాల నుంచి కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు మొత్తం దక్షిణ భారతదేశానికి కేంద్రంగా వున్న చెన్నై.. ఇప్పుడు బెంగుళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలతో పోటీ పడగలుగుతోందా అనే విషయాన్ని తమిళ ప్రజానీకం ఆలోచించాలని సూచించారు. భారీ వర్షాలు కురిస్తే, చెన్నై ముంపు సమస్కను ఎదుర్కొంటోందన్నారు. డీఎంకే పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయన్నారు. మహిళలపై నేరాలు 59 శాతం పెరిగాయని, రాష్ట్రంలో 32 కస్డడీ డెత్‌లు జరిగాయని, నకిలీ మద్యం సమస్య కూడా ఉందని పేర్కొన్నారు.


నాపైనే దక్షిణాది వ్యతిరేక ముద్ర వేస్తారా?

మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై కేంద్రాన్ని ఓడించామని చెబుతున్న కాంగ్రెస్‌, డీఎంకే పార్టీలు.. నిజానికి మహిళల్ని ఓడించారని చంద్రబాబు అన్నారు. ‘‘నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదు. కొత్త జనగణన ప్రకారమైతే దక్షిణాది నష్టపోవాల్సి వచ్చేది. డీలిమిటేషన్‌ బిల్లు వల్ల ప్రస్తుత సీట్ల సంఖ్యను 50 శాతం పెంచితే, వాటిల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్‌ లభిస్తుంది. ఇంత కంటే మంచి అవకాశం మరొకటి లేదు. మహిళా, డీలిమిటేషన్‌ బిల్లుల్ని గుడ్డిగా వ్యతిరేకించడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకే నష్టం. నేను ఇలా చెబుతున్నందుకు నన్ను దక్షిణాది వ్యతిరేకిగా ముద్ర వేస్తున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేను దక్షిణాది రాష్ట్రాలకు ఎందుకు అన్యాయం చేస్తాను? నేను దక్షిణాది రాష్ట్రాల మంచి కోసమే మాట్లాడుతున్నాను’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ అనవసరంగా మాట్లాడుకుంటున్నామని, మనమందరం ఒక్కటేనన్నారు. దేశానికి సంస్కరణవాది ప్రధానిగా ఉన్నారని, జాతీయ ప్రయోజనాలతో పనిచేస్తున్న మోదీకి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. తమిళనాడు అభివృద్ధి కోసం కూడా పనిచేసే అవకాశం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


మోదీపై వ్యతిరేకతతో భాషా భేదాలా?

మాతృ భాషను గౌరవించాలని, మాతృ భాషతోనే మన సంస్కృతిని కాపాడుకోగలమని చంద్రబాబు అన్నారు. బహుభాషలు నేర్చుకోవడం వల్ల అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు. ప్రధాని మోదీపై వ్యతిరేకతతో భాషా భేదాలు తీసుకురావడం సరికాదన్నారు. కాగా, నటుడు విజయ్‌పై స్పందిస్తూ.. ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌లతో ఎవ్వరినీ పోల్చలేమని, కొత్తగా పార్టీ పెట్టిన విజయ్‌ ఏ మేరకు రాణించగలరో ఇప్పుడే చెప్పలేమని అన్నారు.

చంద్రబాబు రోడ్‌షోకు పోటెత్తిన జనం

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు రెండు రోజుల తమిళనాడు పర్యటన ముగిసింది. మంగళవారం సాయంత్రం విరుదునగర్‌ జిల్లా సాత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్డీయే అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. రోడ్‌షోకు భారీగా జనం తరలివచ్చారు. తెలుగువారి ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో భారీ స్పందన కనిపించింది. అంతకుముందు సాత్తూరుకు చెందిన వివిధ వర్గాల ప్రముఖ నేతలతో భేటీ అయ్యారు. అనంతరం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, సాత్తూరు అభ్యర్థి నయినార్‌ నాగేంద్రన్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించారు. ఈ రెండు చోట్లా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్డీయే అంటే అభివృద్ధికి మారుపేరుగా అభివర్ణించారు.

Updated Date - Apr 22 , 2026 | 05:43 AM