Share News

గొడ్డలి పార్టీ.. క్రిమినల్స్‌ తయారీ అడ్డా!

ABN , Publish Date - Aug 07 , 2026 | 04:17 AM

గంజాయి బ్యాచ్‌ను వెంటేసుకుని తిరుగుతూ.. వారిని జెన్‌జీ అని చెప్పుకోవడం గొడ్డలి పార్టీకే చెల్లిందని సీఎం చంద్రబాబు అన్నారు.

గొడ్డలి పార్టీ.. క్రిమినల్స్‌ తయారీ అడ్డా!

  • పరామర్శల పేరుతో జగన్‌ విధ్వంసం: సీఎం

  • గంజాయి బ్యాచ్‌నూ జెన్‌జీగా చెప్పుకోవడం ఆ పార్టీకే చెల్లు

  • అసూయతోనే డీఎస్సీపై యాగీ

  • ఏడాది తర్వాత ధర్నాలు చేయడమేంటి?

  • కోర్టుల్లో 300 పైచిలుకు కేసులు వేసింది

  • వాటిని కొట్టేసి చీవాట్లు పెట్టినా తీరు మారదు

  • నాడు ‘దిశ’ పేరుతో ప్రజలను మభ్యపెట్టారు

  • ఉత్తుత్తి పోలీసు స్టేషన్లతో హంగామా

  • అగ్రిగోల్డ్‌ కేసులో త్వరగా న్యాయం చేయాలి

  • పనిచేయడమే కాదు.. ప్రజలతో సంధానమూ ముఖ్యమే.. నిత్యం వారితో ఉండండి: బాబు

  • క్యాబినెట్‌ భేటీ అనంతరం మంత్రులతో చర్చ

నక్సలిజాన్ని, హైదరాబాద్‌లో మతకలహాలను అదుపు చేసిన నాకు.. గొడ్డలి పార్టీ అరాచకాలను కంట్రోల్‌ చేయడం పెద్ద పని కాదు. కానీ రాజకీయ ముసుగు ఉండడంతో ఆలోచించాల్సి వస్తోంది.

వైసీపీ హయాంలో.. లేని దిశ చట్టాన్ని ఉన్నట్లు చూపి రాష్ట్ర ప్రజలందరినీ భ్రమల్లో పెట్టారు. దిశ పేరుతో ఉత్తుత్తి పోలీసుస్టేషన్లు, వాహనాలతో హంగామా చేయడం తప్ప మహిళల భద్రతకు తీసుకున్న చర్యలు శూన్యం.

- సీఎం చంద్రబాబు

అమరావతి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): గంజాయి బ్యాచ్‌ను వెంటేసుకుని తిరుగుతూ.. వారిని జెన్‌జీ అని చెప్పుకోవడం గొడ్డలి పార్టీకే చెల్లిందని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్‌ పరామర్శల పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నారని, దేవరపల్లి పర్యటనలో అడవి పందులు పొలాల్ని నాశనం చేసినట్లు గొడ్డలి పార్టీ నేతలు చిరువ్యాపారుల దుకాణాలను, పొగాకు రైతుల కష్టాన్ని ధ్వంసం చేశారని విమర్శించారు. రాజకీయ పార్టీ ముసుగులో.. క్రిమినల్స్‌ తయారీ అడ్డాగా గొడ్డలి పార్టీ మారిందన్నారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం క్యాబినెట్‌ సమావేశంలో ఎజెండా అంశాలపై చర్చ అనంతరం సీఎం సహచర మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా జగన్‌ పరామర్శ యాత్రలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పరామర్శ ముసుగు తగిలించుకుని గొడ్డలి పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్నారు. ‘దేవరపల్లిలో ఓ మహిళ చిరువ్యాపారం చేసుకుంటూ పొట్టపోసుకుంటుంటే ఆమె దుకాణాన్ని కూడా ధ్వంసం చేశారు. ప్రశాంతంగా ఉండే జిల్లాల్లోనూ శాంతిభద్రతల సమస్య సృష్టిస్తున్నారు.


గొడ్డలి పార్టీ మీటింగ్‌ అంటే మందు తాగించడానికి లైసెన్స్‌ ఇచ్చినట్లు ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. జనాల్ని తాగించి తరలించుకొస్తున్నారు’ అని దుయ్యబట్టారు. డీఎస్సీపై గొడ్డలి పార్టీ చేస్తున్న యాగీని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. డీఎస్సీపై ఏడాది తర్వాత ధర్నాలు చేయడం ఏమిటన్నారు. పారదర్శకంగా నిర్వహించామనే అసూయతో గొడ్డలి పార్టీ కుట్రలు పన్నుతోందని.. న్యాయస్థానాల్లో 300 పైచిలుకు కేసులు వేసింది. వాటిని కోర్టులు కొట్టేసి చీవాట్లు పెట్టినా ఆ పార్టీ నేతల తీరు మారడం లేదు. వారికి డీఎస్సీ రిజర్వేషన్లపై కనీస అవగాహన లేదు, అందుకే ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. ఇంకా ఏమన్నారంటే..


అగ్రి బాధితులకు సత్వర న్యాయం..

అగ్రిగోల్డ్‌ బాధితులకు సత్వర న్యాయం చేయాలి. బాధితులకు ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అడ్డుకునేందుకు కొందరు న్యాయస్థానాలను ఆశ్రయుంచాలని చూస్తున్నారు. దీనిపై కఠినంగా ఉంటూ ఎక్కడికక్కడ అగ్రి ఆస్తులను సరైన రీతిలో వేలం పెట్టి బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలి. వేలంపాటలో సరైన ధర రాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. అగ్రి గోల్డ్‌ వ్యవహారంపై క్యాబినెట్‌ సబ్‌ కమిటీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. బాధితులు సుమారు 8 రాష్ట్రాల్లో ఉన్నారు. 15 ఏళ్లుగా వారు న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలి.

  • పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం చేస్తున్న లబ్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆక్వా రైతులకు రూ.1100 కోట్లు విద్యుత్‌ సబ్సిడీగా ఇస్తున్నాం. ఆక్వా, నాన్‌ ఆక్వా జోన్లు అనే తేడా లేకుండా అందరికీ సబ్సిడీ అందిస్తున్నాం. ఆక్వా ఫీడ్‌ ఎక్స్‌పోర్టు 50 శాతం తగ్గించేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది.

  • ఈ నెలాఖరులో వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తాం. ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడగలిగాం. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పనిచేయడం ఎంత ముఖ్యమో ప్రజలతో అనుసంధానం కావడం కూడా అంతే ముఖ్యం. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం చేసే మంచిని వారికి వివరించాలి.

  • ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి అనుగుణంగా మంత్రుల ప్రసంగాలు ఉండాలి. వారి ప్రసంగాల్లో స్వర్ణాంధ్ర విజన్‌ 2047 ప్రతిబింబించాలి.


  • ఈ నెల 17 నుంచి నాలుగు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. మళ్లీ డిసెంబరులో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిద్దాం.

  • క్వాంటమ్‌ వ్యాలీ ప్రారంభోత్సవం ఈ ఏడాది డిసెంబరులో గానీ, వచ్చే ఏడాది జనవరిలో గానీ జరుగుతుంది.

  • భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ ఘట్టాన్ని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సెంటిమెంట్‌గా ఫీల్‌ అయ్యారు. ఇది మనది అని సొంతం చేసుకున్నారు. గిరిజనులు తమ సంప్రదాయ థింసా నృత్యంతో తొలిసారి గిన్నీస్‌ రికార్డు సృష్టించడం గొప్ప ఘట్టం.

  • ఈ నెల 13న రాజధానిలో సీడ్‌ యాక్సిస్‌ రహదారిని ప్రారంభిస్తాం. అమరావతిలో ఏర్పాటు చేయనున్న ‘అమరావతి ఐ’.. దుబాయ్‌లో ఉన్న ఐ వీల్‌ కంటే పెద్దగా ఉంటే బాగుంటుంది. దుబాయ్‌లో ఉన్న ఐ వీల్‌ 250 మీటర్ల ఎత్తులో ఉంటుంది. (సీడ్‌ యాక్సిస్‌ రహదారి ప్రారంభోత్సవం ముగిశాక, ఎమ్మెల్యే కార్వర్ట్స తాళాలు సీఎంకి అప్పగిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. దసరా నాటికి మంత్రుల విల్లాలు పూర్తవుతాయన్నారు.)


స్థానిక ఎన్నికల్లో మనదే పైచేయి కావాలి: లోకేశ్‌

మంత్రివర్గ సమావేశానికి ముందు సీఎం క్యాంపు కార్యాలయంలో లోకేశ్‌ మంత్రులతో జరిపిన బ్రేక్‌ఫాస్ట్‌ సమావేశంలో స్థానిక ఎన్నికలపై చర్చ జరిగింది. సెప్టెంబరు, అక్టోబరుల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, అందుకు సన్నద్ధం కావాలని ఆయన సహచర మంత్రులకు స్పష్టం చేశారు. మెజారిటీ స్థానాలను కూటమి అభ్యర్థులు కైవసం చేసుకోవాలన్నారు. ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని వేగంగా.. ఎక్కువ ఇళ్లను చుట్టేయాలన్నది లక్ష్యంగా పెట్టుకోకుండా ప్రతి ఇంటి వద్దా వీలైనంత ఎక్కువ సమయం గడిపి వారికి ప్రభుత్వం పట్ల ఉన్న అభిప్రాయాలను తెలుసుకోవాలని, ప్రభుత్వం చేస్తున్న మంచిని వివరించాలని కోరారు. ‘సర్‌’ ముసాయిదా ఓటర్ల జాబితా వచ్చిందని.. అర్హులెవరైనా ఓట్లు కోల్పోయి ఉంటే తిరిగి చేర్పించడంపై నేతలు దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు.

Updated Date - Aug 07 , 2026 | 06:00 AM