Share News

గొడ్డలి పార్టీ నెవర్‌ ఎగైన్‌!

ABN , Publish Date - May 24 , 2026 | 03:41 AM

‘గొడ్డలి పార్టీ నెవర్‌ ఎగైన్‌’ అంటూ రాష్ట్ర ప్రజలు సంకల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి అది హానికరం. ఆ పార్టీ రాకూడదని పూజలు చేయాలి.

గొడ్డలి పార్టీ నెవర్‌ ఎగైన్‌!

  • ఐదేళ్లూ నరకం చూపించారు

  • రప్పారప్పా అంటూ రంకెలు

  • జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలా?

  • బాబాయ్‌ హత్యపై జగన్‌ నంగనాచి డ్రామాలు

  • నా ముందు తోక జాడిస్తే కత్తిరిస్తా: సీఎం

  • రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఏఐ డాక్టర్‌

  • ఆగస్టు 15లోగా రాష్ట్రవ్యాప్తంగా సంజీవని

  • చిత్తూరు జిల్లా యాదమర్రిలో ‘సంజీవని’ కార్యక్రమంలో చంద్రబాబు వెల్లడి

ఆస్తి, పదవి, హోదా, డబ్బు, కార్లు, బంగళాలు ఎన్ని ఉన్నా.. అన్నింటికంటే ఆరోగ్యం ముఖ్యం. నిండు ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదు. ప్రతి వ్యక్తీ, ప్రతి కుటుంబమూ ఆరోగ్యంగా ఉండాలి. వ్యాధి వచ్చాక వైద్యం చేయడం నిన్నటి విధానం. వ్యాధి రాకముందే అప్రమత్తం చేయడం నేటి ఆలోచన. ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం తగ్గడమే నిజమైన అభివృద్ధి.

- సీఎం చంద్రబాబు

చిత్తూరు/యాదమర్రి, మే 23 (ఆంధ్రజ్యోతి): ‘గొడ్డలి పార్టీ నెవర్‌ ఎగైన్‌’ అంటూ రాష్ట్ర ప్రజలు సంకల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి అది హానికరం. ఆ పార్టీ రాకూడదని పూజలు చేయాలి. గొడ్డలి పార్టీకిసహకరించకండి’’ అని ఆయన కోరారు. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం సంతగేటు వద్ద శనివారం సంజీవని ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఏఐ డాక్టర్‌ అందుబాటులోకి వస్తారని తెలిపారు. జగన్‌ అధికారంలో ఉన్న ఐదేళ్లూ నరకం చూపించారని, ఎవరికీ నిద్ర లేకుండా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘జగన్‌ బాబాయ్‌ వైఎస్‌ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసు. నేనే హత్య చేయించానంటూ జగన్‌ నంగనాచిలా డ్రామాలు ఆడుతున్నారు. కోడికత్తి, గులకరాయి డ్రామాలు గుర్తున్నాయా? ప్రజలను మోసం చేసే ఎత్తుగడ ఇది. దళిత డ్రైవర్‌ సుబ్రమణ్యంను హత్య చేసినవాడికి సన్మానం చేసిన పార్టీ అది. మాస్క్‌ అడిగిన దళిత డాక్టర్‌ను వేధించి చంపేశారు. తల్లికి, చెల్లికి ఆస్తి ఇవ్వకుండా వేధించే వ్యక్తి రాష్ట్ర ప్రజలను చూస్తారా? హిందూ దేవాలయాలు, దేవుళ్లపైౖ దాడులు, అపవిత్ర కార్యక్రమాలు, కుట్రలు, మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారు.


టీడీపీ కార్యకర్తలు నందం సుబ్బయ్య, చంద్రయ్య, జల్లయ్య పీకలు కోసి నాడు నడిరోడ్డుపై చంపేశారు. గంజాయి బ్యాచ్‌లను ప్రోత్సహించారు. రప్పారప్పా అంటూ రంకెలు వేయడం, జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలు చేయడం వారి నైజం. కానీ, ఇక్కడ సీబీఎన్‌ ఉన్నాడు. తోక జాడిస్తే కత్తిరిస్తా. కారు కింద సొంత పార్టీ కార్యకర్త సింగయ్యను జగన్‌ తొక్కించారు. కడపలో అవినీతి ఆస్తుల పంపకాల కోసం పెద్దదస్తగిరిని చంపేశారు. నన్ను కూడా జైలులో పెట్టారు. 23 క్లైమోర్‌ బాంబులతో నక్సలైట్లు నా మీద దాడి చేస్తే సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి నన్ను కాపాడి, మీకు సేవ చేయమని పంపించారు.’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

అర్ధగిరిలో ‘సంజీవని’ విరిగిపడింది...

‘‘యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే, ఆంజనేయ స్వామి ద్రోణగిరి పర్వతాన్ని తెచ్చి సంజీవని ద్వారా ప్రాణాలు కాపాడారు. ఆయన తీసుకెళుతుంటే అందులో కొంతభాగం విరిగి ఇదే పూతలపట్టు నియోజకవర్గం అర్ధగిరిలో పడింది. ఇక్కడ నీళ్లు తాగితే మీ ఆరోగ్యం బాగవుతుంది. ఇది నమ్మకం. ఇది మహిమ. చరిత్ర ఎప్పుడూ సత్యాన్ని చెప్తుంది. ఆ నీళ్లకున్న మహిమ మరెక్కడా లేదు. అలాంటి పవిత్ర గడ్డ మీద సంజీవని కార్యక్రమాన్ని నిర్వహించడం పూర్వ జన్మ సుకృతం. గతేడాది జూలై 3న కుప్పంలో పైలట్‌ ప్రాజెక్టుగా ‘సంజీవని’ ప్రారంభించాం. ఈ ఏడాది మార్చి 15 నుంచి చిత్తూరు జిల్లాలో విస్తరించి 19.75 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం. ఆగస్టు 15లోపు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం. భవిష్యత్తులో 42 వైద్య పరీక్షలు మీ ఇంటి వద్దే చేయిస్తాం.’’


వైద్య రంగానికి రూ.19,305 కోట్లు

‘‘రాబోయే రోజుల్లో ఏఐ డాక్టర్‌ ఉంటాడు. అన్నివిధాలా మీకు గైడ్‌ చేస్తాడు. ప్రతి కుటుంబానికీఫ్యామిలీ డాక్టర్‌ను ఏర్పాటు చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడతాం. ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన వైద్య సేవలు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. ఈ ఏడాది వైద్యరంగానికి రూ.19,305కోట్లు కేటాయిస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ రూ.2.50లక్షలు బీమా కింద కవర్‌ చేశాం. ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు బతకాలి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. ‘భవిష్యత్తులో పిల్లలే సంపద. ఆరోగ్యవంతమైన ప్రజలే రాష్ట్రానికి నిజమైన సంపద.’’ ‘‘23నెలల పాలనలో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. వీటి ద్వారా 23 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. పుట్టపర్తిలో ఐదో జనరేషన్‌ ఫైటర్‌ జెట్‌ తయారీకి ఫౌండేషన్‌ వేశాం. రాబోయేరోజుల్లో యుద్ధాలకు పుట్టపర్తి నుంచి విమానాలు వెళ్తాయి. డిఫెన్స్‌ హబ్‌గా తయారు చేస్తాం. విశాఖలో డేటా సెంటర్‌, అమరావతిలో క్వాంటమ్‌, సీమలో డ్రోన్‌ స్పేస్‌ సిటీ, ఏరోస్పేస్‌ సిటీలు వస్తాయి. బుల్లెట్‌ కూడా సీమలోనే తయారవుతుంది. రాయలసీమ స్టీల్‌ ఫ్యాక్టరీ పూర్తి చేస్తాం. సిమెంట్‌ ఫ్యాక్టరీలు వస్తాయి. సీమలో ఐరన్‌ఓర్‌ ఉంది. గోల్డ్‌ మైన్‌ కూడా కర్నూలులో ప్రారంభిస్తున్నాం. దేశంలో అతి పెద్ద బంగారు ఉత్పత్తి రాయలసీమ నుంచే జరగనుంది. అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ ప్రయోగం చేసి భూగర్భ జలాలు పెంచారు. ఆయన కృషితో 8.5 మీటర్లకు భూగర్భజలాలు పెరిగాయి. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి.’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.


నేను మితంగా తింటాను

‘‘ఫుడ్‌ అనేది మెడిసిన్‌...కిచెన్‌ అనేది ఫార్మసీ. మీరు తినే ఆహారం మీకు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తుంది. నేను మితంగా, అవసరం కొద్ది, పోహకాహారం తింటాను. క్రమశిక్షణతో ఉంటాను. అందుకే నేను పిల్లల కంటే హుషారుగా ఆలోచిస్తుంటాను. రాబోయే 50 ఏళ్లలో ఏం కావాలో ఇప్పుడే ఆలోచించి శ్రీకారం చుడుతున్నాను. ప్రజల భవిష్యత్తు తప్ప నాకు వేరే ఆలోచన లేదు. ఈ జిల్లాలో (చిత్తూరు) పుట్టాను. మీ కళ్ల ముందు పెరిగాను. నిరంతం నేర్చుకుంటూ మీ జీవితాలు బాగుచేయాలనే లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నాను.’’ అని చంద్రబాబు తెలిపారు.

బాగుంది.. బాగుపడాలి..

సేవలపై ప్రజల్లో సంతృప్త స్థాయి బాగున్న శాఖల జిల్లా అధికారులను సీఎం చంద్రబాబు ప్రజావేదిక మీద నుంచే పిలిచి ప్రశంసించారు. ఆ విషయంలో వెనుకబడిన శాఖల అధికారులను కూడా వేదిక మీదకు పిలిచి ఇకమీదట బాగా పనిచేసి మెరుగుపడాలని హెచ్చరించారు. పాజిటివ్‌ పబ్లిక్‌ పర్సెప్షన్‌ రిపోర్ట్‌ ప్రకటించిన అనంతరం, సీఎం జిల్లా అధికార యంత్రాంగంతో గ్రూప్‌ ఫొటో తీసుకున్నారు.

Updated Date - May 24 , 2026 | 03:44 AM