Share News

చంద్రబాబు @ 76

ABN , Publish Date - Apr 20 , 2026 | 03:20 AM

పరిపాలనపై అత్యల్ప దృష్టి.. రాజకీయంపై అత్యధిక దృష్టి పెట్టడం వల్ల ఈ దేశం సామాజికంగాను, ఆర్థికంగాను ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకుంది. ఇకనైనా పరిస్థితులు మారాలి.

చంద్రబాబు @ 76

  • నేడు విలక్షణ నేత పుట్టినరోజు

  • విమర్శలకు వెరవడు.. విజన్‌ను వీడడు

  • ఆయన ముందుచూపు ఫలితమే హైటెక్‌ సిటీ

  • విభజిత ఏపీకి భవ్య రాజధానే లక్ష్యంగా అడుగులు

  • అమరావతిని క్వాంటమ్‌ హబ్‌గా మార్చేందుకు కృషి

  • రాజకీయాలకు తక్కువ టైం.. సుపరిపాలనకు ఎక్కువ

  • ఆది నుంచీ ఇదే బాబు అభివృద్ధి మంత్రం

  • వైసీపీ ఐదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు అవిశ్రాంత కృషి

  • 22 నెలల్లోనే రూ.9.36 లక్షల కోట్ల పెట్టుబడులు ఆయన ఘనతే

వర్తమాన ప్రపంచంలో వస్తున్న మార్పులను గుర్తించి.. వాటికి అనుగుణంగా భవిష్యత్‌ వ్యూహాలను రచించడం.. వాటిని రాష్ట్రాభివృద్ధికి సమన్వయం చేయడం.. చంద్రబాబును మిగతా రాజకీయ నాయకుల కంటే భిన్నంగా నిలుపుతోంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘పరిపాలనపై అత్యల్ప దృష్టి.. రాజకీయంపై అత్యధిక దృష్టి పెట్టడం వల్ల ఈ దేశం సామాజికంగాను, ఆర్థికంగాను ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకుంది. ఇకనైనా పరిస్థితులు మారాలి. సుపరిపాలనకు ఎక్కువ సమయం.. రాజకీయానికి తక్కువ సమయం కేటాయించగలిగే రోజులు రావాలి. అప్పుడే ఆ సమాజం అభివృద్ధిపరంగా దూసుకెళ్తుంది’ ..2003లో ప్రచురితమైన ‘మనసులో మాట’ పుస్తకంలో చంద్రబాబు వ్యక్తం చేసిన అభిప్రాయమిది. రెండు దశాబ్దాలు దాటినా ఆయన ఆశించిన మార్పులైతే రాలేదు.. కానీ ఆయన నేటికీ అదే అభిప్రాయానికి నిబద్ధుడై ఉన్నారు. రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే నాయకుడిగా.. రాజకీయాలకు తక్కువ సమయం.. సుపరిపాలనకు ఎక్కువ సమయం కేటాయిద్దామని నేటికీ పదే పదే చెబుతూ కలుషిత రాజకీయాలను మార్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం 76వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మారుమూల గ్రామం నారావారిపల్లెలో పుట్టిన చంద్రబాబుకు విలక్షణ రాజకీయ నాయకుడిగా పేరుంది. ఆయన ఆలోచనలు తొలి నుంచి సమకాలీన రాజకీయ నాయకులకు భిన్నంగా ఉండేవి.


కంప్యూటర్ల హవా మొదలైనప్పుడు.. రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేది ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) రంగమేనని గుర్తించి.. దానికి అనుగుణంగా చకచకా పావులు కదిపిన నాయకుడు చంద్రబాబు. ఆ రోజు కంప్యూటర్లు కూడుపెడతాయా అని ప్రతిపక్ష నాయకులు అపహ్యాసం చేసినా విమర్శలకు వెరవకుండా ముందుకు వెళ్లబట్టే నేడు హైదరాబాద్‌ హైటెక్‌ సిటీగా ప్రపంచపటంలో నిలవగలిగింది. తాజాగా క్వాంటమ్‌ కంప్యూటర్ల హవా మొదలైంది. దేశంలో వీటి ప్రాధాన్యాన్ని గుర్తించిన ఏకైక సీఎం చంద్రబాబు. అమరావతిని క్యాంటమ్‌ కంప్యూటర్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని లేని నగరంగా మిగిలిపోకూడదని.. అమరావతిని ప్రపంచంలోనే అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దాలని తపిస్తున్నారు.


విధ్వంసం నుంచి వికాసం దిశగా..

వైసీపీ హయాంలో ఐదేళ్లు రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లింది. విధ్వంసాన్ని అధిగమించి తిరిగి గాడిన పెట్టేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఏ దేశమైనా అభివృద్ధిపథంలో అడుగులు వేయాలంటే.. ముందుగా ప్రస్తుతం ఉన్న ఆస్తులు, అప్పుల జాబితాను జాగ్రత్తగా పరిశీలించి దానికి అనుగుణంగా స్పష్టత, నిబద్ధతలతో వ్యూహాన్ని రచించే నాయకులు ఉన్నప్పుడే సాధ్యమని ఆయన బలంగా విశ్వసిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో అదే విధానాన్ని ఆచరిస్తున్నారు. వైసీపీ మిగిల్చిన విధ్వంసం వల్ల పేరుకుపోయిన అప్పులను ఒకవైపు.. రాష్ట్రానికి సహజసిద్ధంగా లభించిన ఆస్తులను మరోవైపు బేరీజు వేసుకుంటూ విధ్వంసం నుంచి వికాసం దిశగా రాష్ట్రాన్ని అడుగులు వేయిస్తున్నారు.


పెట్టుబడుల వేటగాడు..

చంద్రబాబు 1998లో సిలికాన్‌ వ్యాలీలోని శాన్‌జోస్‌ ప్రాంతంలోని మిల్‌పిటాస్‌ అనే చిన్న మున్సిపాలిటీని సందర్శించారు. అప్పట్లో 50వేల జనాభాతో ఉండే ఈ పట్టణం ఏడాదికి 40 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని పన్నుల రూపంలో ఆర్జించేది. సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ టెక్నాలజీ కంపెనీల నుంచే సమకూరేది. చంద్రబాబు అక్కడి అధికారులను.. ఇన్ని పరిశ్రమలను మీరెలా ఆకర్షించగలిగారని ప్రశ్నించారు. దానికి స్థానిక అధికారి తమ పద్ధతి వివరించారు. ‘ఎవరైనా కంపెనీ ఏర్పాటుకు వస్తే నాలుగైదు విషయాల గురించి సమాచారం అడుగుతాం. ఎంత స్థలం కావాలి? ఎంత మంది ఉద్యోగులు పనిచేస్తారు? కంపెనీ పెట్టుబడి ఎంత? ఎంత టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.. వంటి అంశాలను అడిగి మేం అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌లో సమాధానాలను ఫీడ్‌ చేస్తాం. వెంటనే ఆ సాఫ్ట్‌వేర్‌.. ఆ కంపెనీ ద్వారా మా నగరానికి ఎంత పన్ను లభిస్తుంది.. ఉద్యోగుల స్థానిక ఖర్చుల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది.. మొదలైన వివరాలు అందిస్తుంది. వాటి ఆధారంగా ఆ కంపెనీకి ఏయే ప్రోత్సాహకాలు ఇవ్వాలో నిర్ణయిస్తాం. ఇదంతా పారదర్శకంగా ఉండడంతో కంపెనీలు మా నగరానికి రావడానికి ఇష్టపడుతున్నాయి’ అని సమాధానం ఇచ్చారు. మిల్‌పిటాస్‌ ఒకప్పుడు చెత్త నగరంగా పేరొందినా.. ప్రస్తుతం కాలిఫోర్నియాలోనే అత్యధిక ఆదాయం ఉన్న సంపన్న నగరమిది. నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు చంద్రబాబు కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ నుంచి.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ అమలు చేస్తూ పెట్టుబడుల వేటగాడిగా పేరొందారు. కూటమి అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో రూ.9.36 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందంటే.. అది చంద్రబాబు వల్లే సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు.

Updated Date - Apr 20 , 2026 | 03:24 AM